Weather Department: రాష్ట్రంలో పొడి వాతావరణం
ABN , Publish Date - Nov 02 , 2025 | 04:58 AM
రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయి. దీనికితోడు బంగాళాఖాతం నుంచి తేమగాలులు కూడా వీయడం లేదు.
విశాఖపట్నం/అమరావతి, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయి. దీనికితోడు బంగాళాఖాతం నుంచి తేమగాలులు కూడా వీయడం లేదు. ఈ నేపథ్యంలో శనివారం రాష్ట్రంలోని ఎక్కువ ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2, 3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. అక్కడక్కడ వర్షాలు కురిశాయి. శివారు ప్రాంతాలు, ఏజెన్సీలో రాత్రిపూట చలి పెరుగుతోంది. రానున్న రెండురోజుల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, దక్షిణ మయన్మార్, ఉత్తర అండమాన్ సముద్రం పరిసరాల్లో ఆవరించిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఆదివారం నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత బలపడి బంగ్లాదేశ్ వైపు పయనిస్తుందని అంచనా వేస్తున్నారు. కాగా, దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్నిచోట్ల ఆదివారం పిడుగులతో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని సంస్థ ఎండీ ప్రఖర్‌జైన్ తెలిపారు. కృష్ణానదికి మరికొన్ని రోజులు వరద ప్రవాహంలో హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉందన్నారు.