Eluru District: మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్
ABN , Publish Date - Nov 04 , 2025 | 04:54 AM
కర్నూలు జిల్లా చిన్నటేకూరులో జరిగిన ఘోర బస్సు ప్రమాదం మరుపునకు రాకముందే.. మరో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది.
హైదరాబాద్ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు బోల్తా
ఒకరు మృతి, 10 మందికి గాయాలు
ఏలూరు జిల్లాలో ప్రమాదం
లింగపాలెం, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా చిన్నటేకూరులో జరిగిన ఘోర బస్సు ప్రమాదం మరుపునకు రాకముందే.. మరో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. ధర్మాజీగూడెం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న భారతీ ట్రావెల్స్ బస్సు.. ఏలూ రు జిల్లా లింగపాలెం శివారు జూబ్లీనగర్ వద్ద సోమవారం రాత్రి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో పది మంది గాయపడ్డారు. పోలీసులు, ప్రయాణికులు తెలిపిన వివరాల మేరకు.. భారతీ ట్రావెల్స్ ఏఆర్ 06 బీ 8428 నెంబరు స్లీపర్ బస్సు ధర్మాజీగూడెం నుంచి సత్తుపల్లి మీదుగా హైదరాబాద్‌కు వెళ్తోంది. అయితే.. బస్సు ప్రారంభమైనప్పటి నుంచి డ్రైవర్ మితిమీరిన వేగంతో నడిపినట్టు ప్రయాణికులు తెలిపారు. ఎక్కినప్పటి నుంచి అతన్ని హెచ్చరిస్తూనే ఉన్నారు. తొలుత మఠంగూడెం-లింగపా లెం మధ్యలో ప్రయాణికులతో వెళుతు న్న ఓ ఆటోను బస్సు రాసుకుంటూ వెళ్లింది. ఆటో డ్రైవర్ కంగారుగా ఆటోను పక్కన ఆపేశాడు. ఆటో డ్రైవర్, సహా ప్రయాణికులు హాహాకారాలు చే శారు. అయినప్పటికీ బస్సును ఆపలేదు. అదే వేగంతో వెళుతున్న బస్సు లింగపాలెం వైన్‌షాపు వద్ద మోటారు సైకిల్‌పై వెళ్తున్న ఇద్దరిని ఢీకొట్టింది. వారు కింద పడిపోయారు. దీంతో స్థానికులు కేకలు వేస్తూ బస్సును ఆపమని అరిచారు. అయినా డ్రైవర్ అదే నిర్లక్ష్యంతో బస్సును ముందుకు పోనిచ్చాడు. బైక్ పై నుంచి పడిన ఇద్దరు బస్సును వెం బడించారు. డ్రైవర్ మరింత వేగం పెంచాడు. ఈ క్రమంలో జూబ్లీనగర్ సమీపంలోని మలుపు రావడంతో స్పీడు గా వెళుతున్న బస్సు నియంత్రణ కోల్పో యి బోల్తా పడింది. బస్సులో ముందు సీటులో కూర్చున్న హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న వీరంకి ప్రవీణ్(25)పై బస్సు వరిగి పడటంతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని బస్సులో ఉన్న 13 మందిని బయటకు తీశారు. బస్సు డ్రైవర్ మద్యం తాగి ఉన్నట్లు అనుమానిస్తున్నారు.