Drunk Students Attack Junior Doctors: చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో జూడాలపై విద్యార్థుల దాడి
ABN , Publish Date - Sep 14 , 2025 | 03:44 AM
చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో విధుల్లో ఉన్న జూనియర్ డాక్టర్ల జూడాలపై నగరంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు దాడికి పాల్పడ్డారు..
ముగ్గురు వైద్యులకు గాయాలు
మద్యం మత్తులో ఇంజనీరింగ్ స్టూడెంట్లు
ఆరుగురిపై కేసు నమోదు
చిత్తూరు రూరల్, అమరావతి, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో విధుల్లో ఉన్న జూనియర్ డాక్టర్ల (జూడాల)పై నగరంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత సుమారు 15 మంది విద్యార్థులు చిత్తూరు ఆసుపత్రి అత్యవసర విభాగానికి వచ్చారు. అంతా మద్యం మత్తులో ఉన్నారు. తమ స్నేహితుడి చేతికి దెబ్బ తగిలింద చూడాలంటూ కోరారు. డ్యూటీలోని వైద్యుడు పరిశీలించి స్కానింగ్ చేయించాలని చెప్పాడు. స్కానింగ్ కేంద్రం వద్దకెళ్లిన వారు అక్కడ డ్యూటీలో ఉన్న రేడియాలజి్‌స్టతో అసభ్యకరంగా ప్రవర్తించారు. రిపోర్టు తీసుకుని అత్యవసర విభాగానికి వచ్చిన విద్యార్థులు అక్కడి వైద్యులపై అసభ్యంగా వ్యాఖ్యానిస్తూ, అరుస్తూ గొడవ చేశారు. మిగిలిన రోగులకు అసౌకర్యమంటూ దెబ్బతగిలిన వ్యక్తి వద్ద ఒక్కరుండి మిగిలినవారు బయట వేచి ఉండాలని వైద్యుడు సూచించారు. దీంతో మత్తులో ఉన్న విద్యార్థులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. మమ్మల్నే బయట ఉండాలంటావా? అంటూ ఆ వైద్యుడిపై వారు దాడి చేసి గాయపరిచారు. అంతటితో ఆగకుండా మరో ఇద్దరు డాక్టర్లపైనా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనతో చికిత్స పొందుతున్న రోగులు భయాందోళనతో పరుగులు తీశారు. ఈ ఘటనపై జూడాలు శనివారం ఆందోళనకు దిగారు. విధులను బహిష్కరించారు. పోలీసులు దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేస్తామంటూ సర్ది చెప్పడంతో జూడాలు శాంతించారు. ఆమేరకు రెండో పట్టణ పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేశారు.
వైద్యులపై దాడిని ఖండించిన మంత్రి సత్య
చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు, సిబ్బందిపై దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి సత్యకుమార్ సృష్టం చేశారు. శుక్రవారం అర్థరాత్రి విధులు నిర్వహిస్తున్న వారిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. సిబ్బంది వ్యవహారశైలిలో లోపాలేమైనా ఉంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని, భౌతిక దాడులకు పాల్పడడం తగదని మంత్రి పేర్కొన్నారు.