Drug Racket: మూడేళ్లు.. 3 వేల ‘పార్టీలు’
ABN , Publish Date - Nov 22 , 2025 | 04:18 AM
మూడేళ్లు.. ఏకంగా మూడు వేల పార్టీలు. పుట్టినరోజు, ఎంగేజ్‌మెంట్, ప్రీవెడ్డింగ్.. ఇలా ప్రతి ఈవెంట్‌లోను డ్రగ్స్ మత్తు కిక్కెక్కించింది.
‘డ్రగ్స్’ సరఫరా కేసులో మరో కోణం
కీలక సూత్రధారి వైసీపీ విద్యార్థి విభాగ నేత కొండారెడ్డి
లోహిత్ యాదవ్ విచారణలో వెలుగులోకి విషయాలు
విజయవాడ, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): మూడేళ్లు.. ఏకంగా మూడు వేల పార్టీలు. పుట్టినరోజు, ఎంగేజ్‌మెంట్, ప్రీవెడ్డింగ్.. ఇలా ప్రతి ఈవెంట్‌లోను డ్రగ్స్ మత్తు కిక్కెక్కించింది. బెంగళూరు నుంచి వచ్చిన ఆ ‘డ్రగ్స్’ యువతను తప్పుదారి పట్టించింది. విశాఖపట్నం కేంద్రంగా సాగిన ఈ మత్తు వ్యవహారాలు విజయవాడలో బయటపడుతున్నాయి. మూడేళ్ల కాలంలో దాదాపు 3 వేల పార్టీల్లో మత్తు పదార్థాలను వినియోగించారు. విశాఖపట్నానికి చెందిన మత్తు ప్రేమికులు అర్జాల శ్రీవాత్సవ్, హవీల డిలైట్ గత ఆగస్టులో ఎండీఎంఏ, ఎల్‌ఎస్‌డీ మాదకద్రవ్యాలను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో తీసుకెళ్తూ విజయవాడలోని మహానాడు కూడలి వద్ద ఈగల్, టాస్క్‌ఫోర్స్ బృందాలకు పట్ట్టుబడిన విష యం తెలిసిందే. ఈ కేసులో తీగ లాగితే బెంగళూరులో డొంక కదిలింది. ఈ లింకులన్నీ వైజాగ్ వరకు వ్యాపించి ఉన్నాయి. సుదీర్ఘంగా సాగుతున్న దర్యాప్తులో వైజాగ్ పోలీసులకు చిక్కి రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ విద్యార్థి విభాగ నేత కొండారెడ్డి లీలలు బయటకు వచ్చాయి. వైజాగ్ మత్తు ప్రేమికుల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న జోగా లోహిత్ యాదవ్ పోలీసులకు కీలక విషయాలు వెల్లడించినట్టు తెలిసింది. విజయవాడ జిల్లా జైల్లో ఉన్న అతన్ని విచారించడానికి కోర్టు కొద్దిరోజుల క్రితం అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో టాస్క్‌ఫోర్స్ పోలీసు లు లోహిత్ యాదవ్‌ను విచారించిస్తున్నారు.
కొందరితో మొదలై..
ఒక పార్టీలో కొందరు, ఇంకో పార్టీలో ఇంకొందరు, మరో పార్టీలో మరికొందరు ఇలా మత్తు గ్యాంగ్ పెరుగుతూ పోయింది. కొండారెడ్డికి విజయవాడ జిల్లా జైల్లో ఉన్న జోగా లోహిత్ యాదవ్‌కు మధ్య ఈ విధంగానే పరిచయం ఏర్పడింది. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఇంజనీరింగ్ విద్యార్థి అర్జాల శ్రీవాత్సవ్, వైజాగ్‌కు చెందిన హర్షవర్థన్ నాయుడు స్నేహితులు. ఇంజనీరింగ్‌లో శ్రీవాత్సవ్‌కు హర్షవర్థన్ నాయుడు సీనియర్. ఇద్దరూ కలిసి పలు పుట్టినరోజు పార్టీలకు వెళ్లారు. హర్షవర్ధన్ ద్వారా శ్రీవాత్సవ్‌కు లోహిత్ యాదవ్ పరిచయమయ్యాడు. విశాఖపట్నంలో కొండలపైన, అపార్టుమెంట్లలో జరిగిన పార్టీలకు కొండారెడ్డి డ్రగ్‌స సరఫరా చేసేవాడు. అలా లోహిత్‌కు, కొండారెడ్డికి మధ్య మత్తు బంధం ఏర్పడి మరింత బలపడింది. కొండారెడ్డి తెర వెనుక ఉండి లోహిత్ యాదవ్‌కు టాస్క్ అప్పగించేవాడు. ఏ పార్టీ జరిగినా ‘కిక్’ కచ్చితంగా ఉండేది. మత్తు పదార్థాలను ఇంజనీరింగ్ విద్యార్థుల ద్వారా లోహిత్ యాదవ్ బెంగళూరు నుంచి తెప్పించేవాడు. బెంగళూరులో ఈ డ్రగ్‌ను మల్లెల మధుసూదన్‌రెడ్డి సమకూర్చేవాడు. కొద్దిరోజుల క్రితమే విజయవాడలోని మాచవరం పోలీసులు మధుసూదన్‌రెడ్డిని జైలుకు పంపారు. కాగా, టాస్క్‌ఫోర్స్ పోలీసులు లోహిత్ యాదవ్ ఫోన్‌ను పరిశీలించినట్టు తెలిసింది. దీనిలో కొండారెడ్డికి, లోహిత్‌కు మధ్య 1,500కు పైగా కాల్స్ ఉన్నట్టు గుర్తించారు. మామూలు కాల్స్‌తో పాటు వాట్సాప్ కాల్స్ మాట్లాడుకున్నట్టు తెలుసుకున్నారు.