Share News

Scrub Typhus Cases: స్క్రబ్‌ టైఫ్‌సకు.. డ్రగ్‌ రెసిస్టెన్స్‌ గండం..!

ABN , Publish Date - Dec 11 , 2025 | 03:31 AM

భయపడినట్లే జరుగుతోంది..! ‘స్క్రబ్‌ టైఫస్‌’ కేసుల విషయంలో ఔషధ నిరోధకత ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో నమోదవుతున్న స్క్రబ్‌ టైఫస్‌ మరణాలకు.....

Scrub Typhus Cases: స్క్రబ్‌ టైఫ్‌సకు.. డ్రగ్‌ రెసిస్టెన్స్‌ గండం..!

  • చికిత్సల్లో బలహీనంగా మారుతున్న డాక్సీసైక్లిన్‌ .. అందుకే మరణాలు సంభవిస్తున్నాయనే ఆందోళన

  • జినోమ్‌ స్వీకెన్సింగ్‌ పరీక్షలపైనే వైద్యుల ఆశలు

  • ఎయిమ్స్‌, పుణె, వెల్లూరుకు రక్త నమూనాలు

గుంటూరు మెడికల్‌, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): భయపడినట్లే జరుగుతోంది..! ‘స్క్రబ్‌ టైఫస్‌’ కేసుల విషయంలో ఔషధ నిరోధకత ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో నమోదవుతున్న స్క్రబ్‌ టైఫస్‌ మరణాలకు ఔషధ నిరోధకత (యాంటీ మైక్రోబియల్‌ రెసిస్టెన్స్‌/ఏఎంఆర్‌) కారణమని వైద్యవర్గాలు అనుమానిస్తున్నాయి. స్క్రబ్‌టైఫస్‌ చికిత్సకు వినియోగించే ప్రధాన యాంటీబయోటిక్‌ డాక్సీ సైక్లిన్‌. అయితే ప్రస్తుతం ఈ ఔషధం స్క్రబ్‌టైఫ్‌సపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోతోంది. గతేడాది వేల సంఖ్యలో స్క్రబ్‌టైఫస్‌ కేసులు నమోదైనా మరణాలు అత్యల్పంగానే ఉన్నాయి. ఈ ఏడాది కేసుల సంఖ్య తక్కువగా ఉన్నా మరణాల సంఖ్య పెరిగింది. దీనికి ప్రధాన కారణం వ్యాధి కారక క్రిములు ఔషధాల ప్రభావాన్ని తట్టుకునే శక్తిని సంతరించుకోవడంతో పాటు బ్యాక్టీరియా ఉత్పరివర్తనాలే కారణమని వైద్య వర్గాలు అనుమానిస్తున్నాయి. గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రిలో స్క్రబ్‌ టైఫస్‌ రోగులకు ఐవీ ఫ్లూయిడ్స్‌తో పాటు డాక్సీసైక్లిన్‌ మందు ఇస్తున్నా జ్వరం తగ్గడం లేదు. పరీక్షల్లో పాజిటివ్‌గానే చూపుతోంది. దీంతో ఎజిత్రోమైసిన్‌, ఎర్రితోమైసిన్‌ వంటి యాంటీ బయోటిక్‌ మందులు కూడా చికిత్సల్లో వాడుతున్నారు. అయినప్పటికీ ప్రయోజనం కనిపించడం లేదు. కొందరు రోగులు థ్రాంబోసైటోపీనియా (ప్లేట్‌లెట్లు తగ్గడం) లక్షణాలతో మృతి చెందుతున్నారు. రోగుల మెదడులో రక్తస్రావం జరగడంతో పాటు ఎన్‌కెఫలోపతి సమస్య ఏర్పడి మరణించినట్లు వైద్య రికార్డులు చెబుతున్నాయి. వీరికి ముందు జాగ్రత్తగా యాంటీ వైరల్‌ ఔషధం.. ఎసైక్లోవీర్‌ ఇచ్చినా కూడా ప్రయోజనం లేకుండా పోతోంది. ఈ సీజన్‌లో రాష్ట్రంలో 11 స్క్రబ్‌ టైఫస్‌ మరణాలు నమోదైతే, గుంటూరు జీజీహెచ్‌లోనే ఐదు మరణాలు వెలుగు చూశాయి. మృతులు ఐదుగురూ మహిళలు కావడం గమనార్హం. బుధవారం జీజీహెచ్‌లో 12 మంది ఈ వ్యాధికి చికిత్స పొందుతుండగా, వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూకు త రలించారు.


జినోమ్‌ సీక్వెన్సింగ్‌కు రక్త నమూనాలు

డ్రగ్‌ రెసిస్టెన్స్‌, వ్యాధి కారక క్రిముల ఉత్పరివర్తనం నేపథ్యంలో రోగుల రక్త నమూనాలను జినోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపాలని అధికారులు నిర్ణయించారు. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న రోగుల నుంచి నమూనాలు సేకరించి వాటిని పరీక్షల కోసం మంగళగిరిలోని ఎయిమ్స్‌, వె ల్లూరులోని క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీ, పుణెలోని నేషనల్‌ వైరాలజీ ల్యాబ్‌కు పంపుతున్నట్లు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రమణ యశస్వి బుధవారం తెలిపారు. స్క్రబ్‌ టైఫస్‌ జ్వరాల చికిత్సపై ఆయన తన చాంబర్‌లో పలు వైద ్య విభాగాల అధికారులతో సమీక్ష జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... స్క్రబ్‌ టైఫస్‌ పాజిటివ్‌ కేసుల నమూనాలను జినోమ్‌ సీక్వెన్సింగ్‌ పరీక్షకు పంపితే అసలు కారణాలు తెలుస్తాయన్నారు. డ్రగ్‌ ఆఫ్‌ చాయిస్‌ కూడా తెలుస్తుందని, దీనివల్ల రోగులకు మరింత మెరుగైన చికిత్స అందించవచ్చని ఆయన వెల్లడించారు. గతంలో 90 శాతం మంది రోగుల శరీరంపై వ్యాధి కారక.. నల్ల మచ్చ (ఎష్కార్‌) కనిపించేదన్నారు. ప్రస్తుత రోగుల్లో 60 శాతం మందిలోనే ఎష్కార్‌ కనిపించిందని డాక్టర్‌ రమణ తెలిపారు.


మరో ముగ్గురికి స్క్రబ్‌ టైఫస్‌

  • బాధితుల్లో నాలుగేళ్ల చిన్నారి.. వ్యాధి లక్షణాలతో వృద్ధుడి మృతి

రాష్ట్రంలో మరో మూడు స్క్రబ్‌ టైఫస్‌ కేసులు వెలుగుచూశాయి. వ్యాధి లక్షణాలతో ఓ వృద్ధుడు మృతిచెందాడు. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం మరువాడ గ్రామంలో నాలుగేళ్ల చిన్నారికి స్క్రబ్‌టైఫస్‌ పాజిటివ్‌గా తేలింది. సోమవారం బాలికకు తీవ్ర జ్వరం రావడంతో గజపతినగరం సీహెచ్‌సీకి తరలించారు. పరీక్షలు నిర్వహించగా బుధవారం స్క్రబ్‌టైఫస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాయదుర్గం, ధర్మవరం ప్రాంతాలకు చెందిన 16, 12 ఏళ్ల బాలికలకు స్క్రబ్‌ టైఫస్‌ సోకిందని అనంత ప్రభుత్వ సర్వజన వైద్యశాల వైద్యాధికారులు తెలిపారు. కాగా, స్క్రబ్‌ టైఫస్‌ లక్షణాలతో అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం అల్లుపురంలో 80ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు.

Updated Date - Dec 11 , 2025 | 03:31 AM