Share News

పదేపదే ఉల్లంఘిస్తే డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు!

ABN , Publish Date - Aug 05 , 2025 | 01:12 AM

సత్యనారాయణపురానికి చెందిన ఓ వ్యక్తి తన ద్విచక్ర వాహనాన్ని లైసెన్స్‌ లేకపోయినా కుమారుడికి ఎక్కువగా ఇస్తున్నాడు. ట్రాఫిక్‌ పోలీసులు మూడు సార్లు ఈ వాహనంపై చలాన్‌ విధించారు. తండ్రిని పిలిచి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అయినా ఆ అబ్బాయి ద్విచక్ర వాహనంపై పోలీసులకు పట్టుబడుతూనే ఉన్నాడు. దీంతో తండ్రి లైసెన్స్‌ను రద్దు చేయాలని ట్రాఫిక్‌ పోలీసులు రవాణా శాఖ అధికారులకు ఇటీవల ప్రతిపాదనలు పంపారు. ఇలా పదేపదే నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఎనిమిది మంది డ్రైవింగ్‌ లైసెన్స్‌ల రద్దుకు సిఫార్సు చేశారు. ఈ సంఖ్య భవిష్యత్తులో మరింత పెరగనుంది.

పదేపదే ఉల్లంఘిస్తే డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు!

ట్రాఫిక్‌ ఉల్లం‘ఘనులకు’ పోలీసుల ఝలక్‌

ఎనిమిది మంది డీఎల్‌ రద్దుకు రవాణా శాఖకు సిఫార్సు

భవిష్యత్తులో మరింతమంది లైసెన్స్‌లకు తప్పని ముప్పు

సత్యనారాయణపురానికి చెందిన ఓ వ్యక్తి తన ద్విచక్ర వాహనాన్ని లైసెన్స్‌ లేకపోయినా కుమారుడికి ఎక్కువగా ఇస్తున్నాడు. ట్రాఫిక్‌ పోలీసులు మూడు సార్లు ఈ వాహనంపై చలాన్‌ విధించారు. తండ్రిని పిలిచి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అయినా ఆ అబ్బాయి ద్విచక్ర వాహనంపై పోలీసులకు పట్టుబడుతూనే ఉన్నాడు. దీంతో తండ్రి లైసెన్స్‌ను రద్దు చేయాలని ట్రాఫిక్‌ పోలీసులు రవాణా శాఖ అధికారులకు ఇటీవల ప్రతిపాదనలు పంపారు. ఇలా పదేపదే నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఎనిమిది మంది డ్రైవింగ్‌ లైసెన్స్‌ల రద్దుకు సిఫార్సు చేశారు. ఈ సంఖ్య భవిష్యత్తులో మరింత పెరగనుంది.

(ఆంధ్రజ్యోతి - విజయవాడ):

విజయవాడలో ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి పోలీసులు విధిస్తున్న జరిమానాలను కొంతమంది వాహనదారులు తేలిగ్గా తీసుకుంటున్నారు. జరిమానాలు ఎన్నైనా చెల్లిస్తాం... ట్రాఫిక్‌ నిబంధనలను మాత్రం పాటించలేం అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ట్రాఫిక్‌ నిబంధనలకు సంబంధించి పోలీసులు నిత్యం నగరంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నిర్వహిస్తున్నారు. హెల్మెట్‌, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌, రెడ్‌సిగ్నల్‌ జంపింగ్‌, డ్రైవింగ్‌ లేకుండా వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనలపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తున్నారు. ఇది కాకుండా ధ్వని కాలుష్యానికి కారణమవుతున్న అధిక శబ్దం చేసే సైలెన్సర్లను అమర్చుకుంటున్న వాహనాలకు జరిమానాలు వేస్తున్నారు. అయినా తీరు మారకపోవడంతో డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దుతో సమాధానం చెప్పాలని ట్రాఫిక్‌ పోలీసులు నిర్ణయించారు.

వేలల్లో ఉల్లంఘనలు

విజయవాడ రహదారులపై మూడు రకాల ఉల్లంఘనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక విధానం లేకుండా రహదారులపై వాహనాలను నడుపుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. పక్క వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తూ వేగంగా ముందుకు దూసుకుపోతున్నారు. యువకులు స్నేక్‌ డ్రైవింగ్‌తో భయపెడుతున్నారు. వెనుక వైపు అమ్మాయిలు కూర్చుంటే మేఘాల్లో తేలుతున్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ ర్యాష్‌ డ్రైవింగ్‌కు సంబంధించి ట్రాఫిక్‌ పోలీసులు ఈ ఏడాది ఇప్పటి వరకు 16,521 కేసులను నమోదు చేశారు. ఆ తర్వాత స్థానంలో డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడుపుతున్న కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 12,223 నో డీఎల్‌ కేసులు నమోదు చేశారు. మూడో స్థానంలో సైలెన్సర్‌ కేసులు ఉన్నాయి. షోరూంల నుంచి కొనుగోలు చేసిన వాహనాలకు తయారీలో అమర్చిన సైలెన్సర్లను పీకేస్తున్నారు. వాటి స్థానంలో అధిక శబ్దం చేసే సైలెన్సర్లను అమర్చుకుంటున్నారు. ప్రధాన ఈ అమరిక బుల్లెట్లకు జోరుగా సాగుతోంది. రహదారులపై ఎవరి మార్గంలో వారు వెళ్తున్నప్పుడు ఆకతాయిలు బుల్లెట్లుపై వెళ్తూ పవర్‌ స్విచ్‌ను ఆఫ్‌చేసి ఆన్‌ చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా బాంబు పేలిన శబ్దం వస్తోంది. అప్పటి వరకు ఆదమరుపుగా ఉన్న పాదచారులు, వాహనదారులకు ఒక్కసారిగా గుండె జల్లుమంటోంది. ఎన్టీఆర్‌ పోలీసు కమిషనరేట్‌లో ఇటీవల డీజీపీ సమక్షంలో 500 బుల్లెట్లకు సంబంధించి సైలెన్సర్లను రోడ్డు రోలర్‌తో తొక్కించారు. ఈ మూడు ఉల్లంఘనలతో పాటు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసుల్లో పోలీసులకు కొంతమంది వాహనదారులు పదేపదే పట్టుబడుతున్నారు. జరిమానాలు చెల్లించేసి చేతులు దులుపుకుంటున్న ఉల్లంఘనులకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దుతో గుణపాఠం చెప్పాలని ట్రాఫిక్‌ పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఎనిమిది మంది వాహనదారుల డ్రైవింగ్‌ లైసెన్స్‌ను రద్దు చేయాలని రవాణా శాఖ అధికారులకు ప్రతిపాదనలు పంపారు. త్వరలో మరికొంతమంది లైసెన్స్‌లను రద్దు చేయాలని ప్రతిపాదించనున్నట్టు ట్రాఫిక్‌ విభాగ వర్గాలు తెలిపాయి.

Updated Date - Aug 05 , 2025 | 01:12 AM