Share News

తాగుతున్నారు.. తన్నుకుంటున్నారు!

ABN , Publish Date - Apr 16 , 2025 | 01:18 AM

నగర శివారు ప్రాంతాల్లోని మద్యం షాపుల వద్ద ఏర్పాటు చేసిన అనధికారిక పర్మిట్‌ రూముల్లో మందుబాబులు తప్పతాగి తన్నుకుంటున్నారు. దీంతో ఆయా పరిసర ప్రాంతాల్లో నిత్యం భయానక వాతావరణం నెలకొంటోంది. మద్యం అమ్మకాలు మాత్రమే జరపాల్సిన షాపుల నిర్వాహకులు వ్యాపారం పెంచుకునేందుకు చేసిన ఏర్పాట్లు గొడవలకు కారణమవుతున్నాయి. వీటిని అడ్డుకోవాల్సిన ఎక్సైజ్‌, పోలీసు అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది.

తాగుతున్నారు.. తన్నుకుంటున్నారు!

బార్‌లను తలదన్నేలా మద్యం షాపుల వద్ద ఏర్పాట్లు

అనధికార పర్మిట్‌ రూముల్లో నిత్యం ఘర్షణలు

భయానకంగా పరిసర ప్రాంతాలు

పట్టించుకోని ఎక్సైజ్‌, పోలీసు అధికారులు

నగర శివారు ప్రాంతాల్లోని మద్యం షాపుల వద్ద ఏర్పాటు చేసిన అనధికారిక పర్మిట్‌ రూముల్లో మందుబాబులు తప్పతాగి తన్నుకుంటున్నారు. దీంతో ఆయా పరిసర ప్రాంతాల్లో నిత్యం భయానక వాతావరణం నెలకొంటోంది. మద్యం అమ్మకాలు మాత్రమే జరపాల్సిన షాపుల నిర్వాహకులు వ్యాపారం పెంచుకునేందుకు చేసిన ఏర్పాట్లు గొడవలకు కారణమవుతున్నాయి. వీటిని అడ్డుకోవాల్సిన ఎక్సైజ్‌, పోలీసు అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది.

పాయకాపురం, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి):

పాయకాపురం ప్రాంతంతో పాటుగా నున్న, పాతపాడు, అంబాపురం గ్రామాల పరిధిలో సుమారు ఆరు వరకు వైన్‌ షాపులు ఉన్నాయి. అయితే వీటిని చూసిన వారెవరూ వైన్‌ షాపులు అనుకోరు. బార్‌లను తలదన్నేలా ఇక్కడ కుర్చీలు, టేబుళ్లు, ఫ్యాన్లు సకల సదుపాయాలు ఉంటాయి. కేవలం వైన్‌ షాపుల్లో మద్యం మాత్రమే అమ్మకాలు జరపాల్సి ఉన్నా పక్కనే షెడ్లు వేసి మరీ మందుబాబులకు సోడాలు, స్టఫ్‌ వగైరాలు అందిస్తున్నారు. దీని వలన వైన్‌ షాపులే కాక సమీపంలోని రోడ్లు, పొలాలు కూడా తిరునాళ్లను తలపిస్తున్నాయి.

నిత్యం ఘర్షణలే!

స్థానిక వైన్‌ షాపుల వద్ద నిత్యం ఏదో ఒక ఘర్షణ జరుగుతూనే ఉంటోంది. రెండు రోజుల క్రితం ప్రకాష్‌నగర్‌ సెంటర్‌లోని ఓ వైన్‌ షాపులో కొందరు యువకులు పూట్‌గా మద్యం తాగి అకారణంగా మరో యువకుడిపై దాడి చేశారు. ఈ ఘటనలో గణేష్‌ అనే యువకుడు తల, మొహం, చేతి భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి.

- నున్న గ్రామంలోని ఓ వైన్‌ షాపులో వారం రోజుల క్రితం రెండు వర్గాలు బాహాబాహీకి దిగి రోడ్లపై తన్నుకున్నాయి. ఈ ఘటనలో ఓ వర్గంపై స్ధానిక పొలీసులు కేసు కూడా నమోదు చేశారు. అదే రోజు మద్యం తాగిన మరో రెండు వర్గాలు తన్నుకున్నాయి. ఈ పంచాయితీ కూడా సంబంధిత స్టేషన్‌కు వచ్చింది. సదరు వైన్‌ షాపు పరిసర ప్రాంతాలు మొత్తం గాజు సీసాలు, గ్లాసులతో నిండిపోయి డంపింగ్‌ యార్డును తలపిస్తోంది.

- పాతపాడు వైన్‌ షాపు వద్ద పరిస్థితులు మరీ అధ్వానంగా ఉంటున్నాయి. ఇక్కడ ఏకంగా నిర్వాహకులు మూడు అనధికారిక పర్మిట్‌ రూమ్‌లను ఏర్పాటు చేసి మందుబాబులను ఆకర్షించేందుకు బల్లలు, ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ మద్యం తాగడానికి వచ్చే వారి వాహనాలతో కండ్రిక, పాతపాడు రోడ్డు తిరునాళ్లను తలపిస్తోంది.

- అంబాపురం పంచాయతీ పరిధిలోని పైపుల రోడ్డు వద్ద ఉన్న వైన్‌ షాపు వద్ద రోజు ఘర్షణ వాతావరణమే కనిపిస్తోంది. గత నెల పాయకాపురం శాంతినగర్‌కు చెందిన రెండు వర్గాలు బాహాబాహీకి దిగి బీరుబాటిళ్లతో దాడులు చేసుకున్నాయి. ఇదే ఘటనలో ఓ యువకుడు తన ద్విచక్రవాహనం నుంచి కత్తిని తీసి హల్‌చల్‌ చేయడంతో ఇన్నర్‌ రింగ్‌ రోడ్లపై ప్రయాణికులు సైతం హడలిపోయారు. ఇది జరిగిన వారానికి మద్యం తాగడానికి వచ్చిన కొందరు స్నేహితులు మద్యం మత్తులో రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు భీకరంగా దాడులు చేసుకున్నారు.

మామూళ్ల మత్తులో అధికారులు!

మద్యం షాపుల వద్ద ఇంత జరుగుతున్నా సంబంధిత ఎక్సైజ్‌, పోలీస్‌ శాఖల అధికారులు మాత్రం తమకు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. వైన్‌ షాపులో మద్యం తాగించకూడదని నిబంధనలు ఉన్నా నిర్వాహకులు అనధికారిక పర్మిట్‌ రూమ్‌లు పెట్టి తాగిస్తున్నారు. ఐదు నెలలుగా ఈ తతంగం జరుగుతున్నా అధికారులకు తెలియకపోవడం గమనార్హం. వైన్‌ షాపుల నిర్వాహకులే సీసీ కెమెరాలు పెట్టి మరీ మద్యం తాగించడం ఇక్కడ విశేషం. కాగా, అదే సీసీ కెమెరాల ఫుటేజ్‌లు తీసుకుని మరీ ఘర్షణలు పడినవారిపై పోలీసులు కేసులు నమోదు చేయడం మరో విశేషం. సీసీ కెమెరాల్లో స్పష్టంగా మద్యం తాగిస్తున్నట్లు కనిపిస్తున్నా అవేమి పట్టించుకోకుండా కేవలం కేసుల నమోదుకు మాత్రమే సీపీ ఫుటేజ్‌లను వాడుకోవడం గమనార్హం.

షాపుల వద్ద మద్యం తాగిస్తే చర్యలు : ఎక్సైజ్‌ సీఐ శ్రీనివాసరెడ్డి

వైన్‌ షాపుల వద్ద మద్యం తాగకూడదని బోర్డులు ఏర్పాటు చేశాం. నిబంధనలకు విరుద్ధంగా వైన్‌ షాపుల నిర్వాహకులు మద్యం తాగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.

Updated Date - Apr 16 , 2025 | 01:18 AM