శుష్కించిన జీఎనఎస్‌ఎస్
ABN , Publish Date - Apr 17 , 2025 | 12:55 AM
శ్రీశైలం జలాశయం నుంచి 38 టీఎంసీల మిగులు జలాలను 30 రోజుల్లో తరలించేలా గాలేరు నగరి పథకాన్ని తీర్చిదిద్దారు.
ఫ లైనింగ్‌తో అడుగంటిన భూగర్భ జలాలు
ఫ పరివాహక గ్రామాల్లో ఆగిపోయిన ఖరీఫ్ పంటలు
ఫ తాగు నీటికీ తప్పని ఇబ్బందులు
గాలేరి-నగరి కాల్వకు సిమెంట్ లైనింగ్ చేయడం వల్ల భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. కాలువ పొడవునా కలగాల్సిన ప్రయోజనాలు అడుగంటి శుష్క ప్రవాహంగా మారిపోయింది. దీని వల్ల జీఎనఎస్‌ఎస్ ప్రయోజనాలు తగ్గిపోయాయని రైతులు అందోళన చెందుతున్నారు. కృష్టానది వరద నీటితో రాయలసీమ జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు 1988లో ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు. 2005 నుంచి పనులు ప్రారంభించారు. రాయలసీమలోని 2.65 లక్షల ఎకరాలకు, నెల్లూరు జిల్లాలో 2.14 లక్షల ఎకరాలకు ఈ పథకం సాగునీరు అందించాలి. మొత్తంగా 10లక్షల జనాభాకు తాగునీరు అందించాలి. అయితే ఈ కాలువకు సిమెంట్ లైనింగ్ చేయడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయాయని ఈ ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు.
బనగానపల్లె, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయం నుంచి 38 టీఎంసీల మిగులు జలాలను 30 రోజుల్లో తరలించేలా గాలేరు నగరి పథకాన్ని తీర్చిదిద్దారు. పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ద్వారా గోరుకల్లు రిజర్వాయర్, అవుకు రిజర్వాయర్ ద్వారా కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాలకు తరలించేందుకు గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టుకు ఉమ్మడి రాష్ట్రంలో శ్రీకారం చుట్టాయి. మట్టికట్టతో గోరుకల్లు రిజర్వాయర్ నుంచి అవుకు రిజర్వాయర్ వరకు 57కిలోమీటర్ల మేర తవ్వి రైతులకు సాగు, తాగు నీరును అందిస్తున్నారు. గాలేరు నగరి కెనాల్ మట్టి కట్టతో నిర్మించడం వల్ల పాణ్యం, బనగానపల్లె, అవుకు, సంజామల మండలాల్లోని గాలేరు నగరి కాల్వ పరివాహక పరిసర ప్రాంతాల్లోని గ్రామాల్లోని పొలాల్లో బోరుబావుల్లో భూగర్భ నీరు పెరిగి రైతులు రెండుసార్లు పంటలు పండించుకొనేవారు. కాల్వకు ఇరువైపులా మట్టికట్టలు ఉండడంతో భూగర్భ నీరు పెరిగి రైతులకు సాగునీటికి ఢోకా ఉండేది కాదు.
గాలేరు నగరి కాల్వకు సిమెంట్ లైనింగ్ పనుల పూర్తి
గత వైసీపీ పాలనలో అప్పటి సీఎం జగనమోహనరెడ్డి గాలేరు నగరి కాల్వకు మట్టికట్టకు తూట్లు పొడిచారు. మట్టికట్ట స్థానంలో గాలేరు నగరి కాల్వకు ఇరువైపులా, కింది భాగంలో సిమెంట్ లైనింగ్ ఏర్పాటు చేయడానికి వైసీపీ హయంలో శ్రీకారం చుట్టి పూర్తి చేశారు. గోరుకల్లు రిజర్వాయర్ నుంచి అవుకు రిజర్వాయర్ నుంచి గండికోట మీదుగా త్వరగా కడప జిల్లాకు నీటిని మళ్లించేందుకు సిమెంట్ లైనింగ్ పనులను ఆగమేఘాల మీద పూర్తి చేశారు. 2021 సంవత్సరంలో గోరుకల్లు రిజర్వాయర్ నుంచి అవుకు రిజర్వాయర్ సమీపంలోని గాలేరు హెడ్ రెగ్యులేటర్ వరకు 57 కిలోమీటర్ల వరకు మట్టికట్టతో ఉన్న గాలేరు నగరి కాల్వకు సిమెంట్ లైనింగ్ పనులకు డీఎస్‌ఆర్, వీఏఆర్‌కెఎస్ కంపెనీలు జాయింట్ వెంచర్‌తో 57 కిలోమీటర్లకు 915 కోట్లతో టెండర్లను 2021 పిబ్రవరి నెలలో టెండర్లను దక్కించుకొని సిమెంట్ లైనింగ్ పనులు ప్రారంభించి పూర్తి చేశారు. గోరుకల్లు రిజర్వాయర్ నుంచి అవుకు రిజర్వాయర్ వరకు 57 కిలోమీటర్ల వరకు సిమెంట్ లైనింగ్ పనులు పూర్తయ్యాయి. అప్పట్లో గాలేరు నగరి కాల్వలో బోర్లు వేస్తామని, భూగర్భ జలాలు పెంచుతామని గత వైసీపీ ప్రభుత్వంలో హామీ ఇచ్చారు. ఆ హామీలకు తూట్లు పొడిచారు.
లైనింగ్ పనులు పూర్తయ్యాక తగ్గిపోయిన
భూగర్భ జలాలు
సిమెంట్ లైనింగ్‌పనులు పూర్తికావడంతో బనగాననపల్లె నియోజక వర్గంలో పలు చోట్ల భూగర్భజలాలు పూర్తిగా తగ్గిపోయాయి. గతంలో సిమెంట్ లైనింగ్ వేయకముందు కరువు ప్రాంతమైన పాణ్యం, బనగా నపల్లె, కోవెలకుంట్ల, అవుకు మండలాల్లోని భూముల్లో భూగర్భ జలాలు పెరిగి పుష్కలంగా పండించుకునే వారు. కానీ రెండేళ్లుగా సిమెంట్ లైనింగ్ పనుల వల్ల భూగర్భ జలాలు తగ్గాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం కడప జిల్లాకు సాగు, తాగునీటిని మళ్లించేందుకు ముఖ్యమంత్రి జగనమోహనరెడ్డి సిమెంట్ లైనింగ్ పనులు చేపట్టి, పాణ్యం, బనగానపల్లె, అవుకు, సంజామల మండలాల ప్రజలకు అన్యాయం చేశారని విమర్శిస్తున్నారు. భూగర్భ జలాలు తగ్గడంతో బోర్లలో నీరు లేక రైతులు ఖరీప్ పంటలు వేయడంలేదు. గతంలో మట్టి కాల్వ ఉన్నప్పుడు భూగర్భజలాలు పుష్కలంగా ఉండడంతో ఖరీప్ పంటలు సాగు చేసేవారు. మైనింగ్ వల్ల భూగర్భ జలాలు తగ్గిపోవడంతో రబీలో పంటల విస్తీర్ణం బాగా పడిపోయింది.
లైనింగ్ పనులు చేపట్టడం అన్యాయం
గాలేరు నగరి కాల్వలకు సిమెంట్ లైనింగ్ పనులు చేపట్టడం దారుణం. ఈ పనుల వల్ల ఈ ప్రాంత రైతులకు అన్యాయం జరుగుతున్నది. సాగు, తాగునీటికి ఇబ్బంది తప్పదు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తుతోంది. కేవలం స్వార్థంతో కడప జిల్లాకు వరద నీటిని త్వరగా తరలించేందుకు ఈ ప్రాంత రైతులు, ప్రజలకు అన్యాయం చేసేందుకే లైనింగ్ పనులు చేస్తున్నారు.
-భూషన్న, జిల్లా టీడీపీ బీసీ సెల్ కార్యదర్శి పెద్దరాజుపాలెం