Addapalli Janardana Rao: అడ్డం తిరిగిన అద్దేపల్లి!
ABN , Publish Date - Dec 30 , 2025 | 05:10 AM
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన నకిలీ మద్యం కేసులో కింగ్ పిన్‌గా వ్యవహరించిన ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దనరావు ఎక్సైజ్ ఉన్నతాధికారులపై అడ్డం తిరిగారు. మదనపల్లె ఎక్సైజ్ కార్యాలయంలో చోటుచేసుకున్న ఈ వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసింది....
కస్టడీ విచారణ నివేదికపై సంతకం పెట్టని జనార్దనరావు
నివేదిక మార్చారంటూ వాగ్వాదం
ఎట్టకేలకు రిపోర్టుపై సంతకం చేసిన నకిలీ మద్యం కేసు సూత్రధారి
మదనపల్లె ఎక్సైజ్ ఆఫీసులో హైడ్రామా
రాయచోటి/ములకలచెరువు, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన నకిలీ మద్యం కేసులో కింగ్ పిన్‌గా వ్యవహరించిన ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దనరావు ఎక్సైజ్ ఉన్నతాధికారులపై అడ్డం తిరిగారు. మదనపల్లె ఎక్సైజ్ కార్యాలయంలో చోటుచేసుకున్న ఈ వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసింది. విచారణలో తాను చెప్పినట్లు కాకుండా.. ఎక్సైజ్ అధికారులు నివేదికను మార్చారని ఆరోపిస్తూ.. సదరు నివేదికపై సంతకం చేసేది లేదని భీష్మించారు. ఆ తర్వాత ఎక్సైజ్ అధికారులు ఆయన చెప్పిన విధంగానే నివేదికను రూపొందించడంతో.. ఎట్టకేలకు అద్దేపల్లి సంతకం చేశారు. ఈ సంతకం విషయమై జనార్దనరావు, ఎక్సైజ్ అధికారుల మద్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరిగినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. ములకలచెరువు నకిలీ మద్యం కేసుకు సంబంధించి కోర్టు ఉత్తర్వుల మేరకు ఈ నెల 26న ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దరరావుతో పాటు ఆయన తమ్ముడు జగన్‌మోహన్‌రావు, అనుచరులు తాండ్ర రమేశ్, తిరుమలశెట్టి శ్రీనివాసరావు, షేక్ అల్లాబక్షులను ఎక్సైజ్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. మదనపల్లె సబ్‌జైలులో ఉన్న ఐదుగురిని మదనపల్లె ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించి మూడు రోజుల పాటు విచారించారు. కస్టడీ గడువు సోమవారం ఉదయంతో ముగిసింది. అయితే, మదనపల్లె ఎక్సైజ్ కార్యాలయంలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు హైడ్రామా చోటచేసుకుంది. విచారణ అనంతరం ఎక్సైజ్ అధికారులు నివేదిక రూపొందించారు. దీనిపై సంతకం చేయాలని జనార్దనరావును కోరారు. అయితే, నివేదికను పూర్తిగా చదివిన తర్వాతే సంతకం చేస్తానని జనార్దనరావు చెప్పారు. విచారణ నివేదికను చదివిన జనార్దనరావు సంతకం పెట్టేందుకు నిరాకరించారు. తాను చెప్పిన విధంగా కాకుండా మరోలా విచారణ నివేదిక తయారు చేశారని, తాను సంతకం పెట్టనని తేల్చిచెప్పారు. అంతేకాదు, కస్టడీ విచారణ రిపోర్టును మార్చారంటూ జడ్జికి ఫిర్యాదు చేస్తానని జనార్దనరావు హెచ్చరించారు. దీంతో ఎక్సైజ్ అధికారులు చివరకు జనార్దనరావు చెప్పిన విధంగా రిపోర్టును మార్చడంతో సంతకం చేశారు. కాగా, కస్టడీ విచారణ రిపోర్టులో దాసరిపల్లి జయచంద్రారెడ్డి, ఆయన బావమరిది గిరిధర్‌రెడ్డి పేర్లు ఉండడంతో సంతకం చేసేందుకు అద్దేపల్లి నిరాకరించినట్లు తెలిసింది.
మరో 14 రోజులు
ఐదుగురు నిందితుల కస్టడీతో పాటు రిమాండ్ గడువు కూడా ముగియడంతో సోమవారం మధ్యాహ్నం ఎక్సైజ్ పోలీసులు తంబళ్లపల్లె కోర్టులో వీరిని హాజరుపరిచారు. మరో 14 రోజులు రిమాండ్ పొడిగించడంతో మదనపల్లె సబ్‌జైలుకు తరలించారు. ఉదయం 10.30కే కస్టడీ గడువు ముగిసినా నిందితులను మధ్యాహ్నం 1.41కు కోర్టుకు తీసుకురావడంపై కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు జనార్దనరావు సన్నిహితులు తెలిపారు. ములకలచెరువు నకిలీ మద్యం కేసులో 33 మంది నిందితులుగా ఉన్నారు. వీరిలో దాసరిపల్లి జయచంద్రారెడ్డి, ఆయన బావమరిది గిరిధర్‌రెడ్డి మినహా 31 మందిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటి వరకు 23 మందిని కస్టడీకి తీసుకుని విచారించారు.