ఏసీబీ వలకు చిక్కిన డ్రైనేజీ శాఖ జూనియర్ అసిస్టెంట్
ABN , Publish Date - Aug 05 , 2025 | 01:13 AM
గుడివాడలోని డ్రైనేజీశాఖ ఈఈ కార్యాలయంపై ఏసీబీ అధికారులు సోమవారం దాడి చేశారు. కాంట్రాక్టర్ నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటున్న జూనియర్ అసిస్టెంట్ గరికిపాటి శ్రీనివాసరావును రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
-కాంట్రాక్టర్‌కు ఎం.బుక్ ఇచ్చేందుకు రూ.30 వేలు డిమాండ్
-రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ డీఎస్పీ
గుడివాడ, ఆగష్టు 4 (ఆంధ్రజ్యోతి):
గుడివాడలోని డ్రైనేజీశాఖ ఈఈ కార్యాలయంపై ఏసీబీ అధికారులు సోమవారం దాడి చేశారు. కాంట్రాక్టర్ నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటున్న జూనియర్ అసిస్టెంట్ గరికిపాటి శ్రీనివాసరావును రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే... బాపట్ల జిల్లా రేపల్లెకు చెందిన కాంట్రాక్టర్ తురకా రాజా వర్క్ డిపాజిట్ ఎం.బుక్ ఇవ్వాలని డ్రైనేజీశాఖ అధికారులను కోరారు. దీనికి గుడివాడలోని డ్రైనేజీ ఈఈ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న జూనియర్ అసిస్టెంట్ గరికిపాటి శ్రీనివాసరావు రూ.30 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో కాంట్రాక్టర్ రాజా ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ క్రమంలో సోమవారం రూ.30 వేలు నగదు జూనియర్ అసిస్టెంట్‌కు రాజా ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ బి.వి.సుబ్బారావు నేతృత్వంలో దాడి చేసి పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ మాట్లాడుతూ అదుపులోకి తీసుకున్న శ్రీనివాసరావును ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు వి.వి.సత్యనారాయణ, ఎం.వి.ఎస్.నాగరాజు, ఎస్‌ఐ పూర్ణిమ పాల్గొన్నారు.