Narsipatnam: మాస్క్‌లు ఇవ్వలేక హత్యలు చేసేవాళ్లు మెడికల్ కాలేజీల గురించి మాట్లాడటమా
ABN , Publish Date - Oct 10 , 2025 | 06:24 AM
మాజీ సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో నర్సీపట్నంలో డాక్టర్ సుధాకర్ ఫొటోతో ఫ్లెక్సీలు వెలిశాయి. పట్టణంలోని పలు కూడళ్లలో గుర్తుతెలియని వ్యక్తులు...
నర్సీపట్నంలో డాక్టర్ సుధాకర్ ఫొటోతో ఫ్లెక్సీలు.. జగన్ పర్యటన నేపథ్యంలో ఏర్పాటు
నర్సీపట్నం, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో నర్సీపట్నంలో డాక్టర్ సుధాకర్ ఫొటోతో ఫ్లెక్సీలు వెలిశాయి. పట్టణంలోని పలు కూడళ్లలో గుర్తుతెలియని వ్యక్తులు వీటిని ఏర్పాటుచేశారు. కరోనా సమయంలో డాక్టర్ సుధాకర్ నర్సీపట్నం ఆస్పత్రిలో ఎన్-95 మాస్క్‌ల కొరతపై ప్రభుత్వాన్ని నిలదీశారు. దీంతో ఆయన్ను సస్పెండ్ చేశారు. ఆ తర్వాత విశాఖలో రోడ్డుపై ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని చేతులు వెనక్కి విరిచి, ఆటోలో కేజీహెచ్‌కు, అక్కడ నుంచి మానసిక వైద్యశాలకు తరలించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఉదంతంపై సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో వంగలపూడి అనిత అప్పట్లో పిల్ వేశారు. కేసు విచారణలో ఉండగానే డాక్టర్ సుధాకర్ మరణించారు. గురువారం మాకవరపాలెంలో అసంపూర్తిగా ఉన్న మెడికల్ కళాశాల భవనాల పరిశీలనకు జగన్ వస్తున్న నేపథ్యంలో డాక్టర్ సుధాకర్ ఫొటోతో ఫ్లెక్సీలు వెలిశాయి. ‘వైఎస్సార్‌సీపీ నెవర్ ఎగైన్.. మాస్క్‌లు ఇవ్వలేక హత్యలు చేసేవాళ్లు మెడికల్ కాలేజీల గురించి మాట్లాడటమా?, ప్రజలారా తస్మాత్ జాగ్రత్త’ అనివాటిపై ముద్రించారు.