Share News

Visakhapatnam: ఐదేళ్ల క్రితమే డాక్టర్‌ నమ్రత అరెస్ట్‌

ABN , Publish Date - Aug 19 , 2025 | 04:54 AM

సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ ఎండీ డాక్టర్‌ నమ్రత అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.విశాఖపట్నం కేంద్రంగా ఐవీఎఫ్‌, సరోగసీ పేరుతో ఆమె గతంలోనూ అనేక అక్రమాలకు పాల్పడింది.

Visakhapatnam: ఐదేళ్ల క్రితమే డాక్టర్‌ నమ్రత అరెస్ట్‌

  • విశాఖలో ఆరుగురు శిశువుల విక్రయం కేసులో జైలుకు

  • ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న ‘సృష్టి’ ఎండీ ఆగడాలు

విశాఖపట్నం, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): ‘సృష్టి’ ఫెర్టిలిటీ సెంటర్‌ ఎండీ డాక్టర్‌ నమ్రత అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.విశాఖపట్నం కేంద్రంగా ఐవీఎఫ్‌, సరోగసీ పేరుతో ఆమె గతంలోనూ అనేక అక్రమాలకు పాల్పడింది. ఆరుగురు నవజాత శిశువుల విక్రయం కేసులో 2020లో నమ్రతను విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. ఆ కేసులో ఆమె మూడు నెలలపాటు జైలు జీవితాన్ని గడిపిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.‘సృష్టి’ పేరుతో సాగించిన అక్రమాలపై అప్పట్లో కొందరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహారాణిపేట పోలీసులు కేసు నమోదుచేసి విచారణ అనంతరం నమ్రతను అరెస్టు చేసి జైలుకు పంపారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని వి.మాడుగులలో యూనివర్సల్‌ సృష్టి పేరుతో ఒక సెంటర్‌ను ఏర్పాటుచేసి కొంతమంది చిన్నారులను అక్రమంగా విక్రయించినట్టు తేలింది.అవాంఛిత గర్భం దాల్చిన మహిళలకు అక్కడ ప్రసవం చేసి పుట్టిన పిల్లలను ఏజెంట్ల ద్వారా ఇతర ప్రాంతాల వారికి విక్రయించేవారు.అటువంటి మహిళలను గుర్తించేందుకు ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేసేవారు. దీనికోసం ఆమె ఆశా కార్యకర్తల సహకారం తీసుకునేవారు. అప్పటి కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది. 2020లో అరెస్టయి బయటకు వచ్చిన తర్వాత కూడా డాక్టర్‌ నమత్ర అడ్డగోలు వ్యవహారాలను ఆపలేదు.తన అక్రమాలకు విశాఖను అడ్డాగా మలచుకున్నారు. ఐవీఎఫ్‌, సరోగసీ కోసం సికింద్రాబాద్‌ సెంటర్‌కు వచ్చే వారి నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి, అవాంఛిత గర్భం దాల్చిన మహిళల నుంచి పిల్లలను సేకరించి వారికి అప్పగించేవారు. దీనికోసం ప్రభుత్వ ఆస్పత్రుల్లోని వైద్యులను కూడా ఆమె వినియోగించుకున్నారు. తాజా కేసులో నమ్రతతోపాటు 24 మంది అరెస్టయ్యారు. ఇందులో ఇద్దరు కేజీహెచ్‌ వైద్యులు, మరో ఆరుగురు ఏజెంట్లు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరో వైద్యురాలు ఉన్నారు.

Updated Date - Aug 19 , 2025 | 04:56 AM