Share News

Visakhapatnam: విశాఖ డ్రగ్స్‌ కేసులో వైద్యుడి అరెస్టు

ABN , Publish Date - Jul 07 , 2025 | 02:55 AM

విశాఖ నగరంలో కలకలం రేపిన డ్రగ్స్‌ కేసులో ఆదివారం త్రీటౌన్‌ పోలీసులు ఓ వైద్యుడిని అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టయిన వారిసంఖ్య మూడుకు పెరిగింది.

Visakhapatnam: విశాఖ డ్రగ్స్‌ కేసులో వైద్యుడి అరెస్టు

మద్దిలపాలెం (విశాఖపట్నం), జూలై 6 (ఆంధ్రజ్యోతి): విశాఖ నగరంలో కలకలం రేపిన డ్రగ్స్‌ కేసులో ఆదివారం త్రీటౌన్‌ పోలీసులు ఓ వైద్యుడిని అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టయిన వారిసంఖ్య మూడుకు పెరిగింది. ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో శనివారం కొకైన్‌తో పట్టుబడిన అక్షయ్‌కుమార్‌ వద్ద వైద్యుడు డ్రగ్స్‌ కొనుగోలు చేసినట్టు ఆరోపణలు రుజువయ్యాయి. త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఈస్ట్‌ ఏసీపీ లక్ష్మణమూర్తి, సీఐ పైడయ్య వివరాలు వెల్లడించారు. నగరంలోని కూర్మన్నపాలేనికి చెందిన కమ్మెళ్ల శ్రీకృష్ణచైతన్య వర్మ (34) ఎంబీబీఎస్‌ పూర్తిచేసి వైద్యుడిగా పనిచేస్తున్నాడు. ఆయనకు సీతమ్మధారకు చెందిన అక్షయ్‌కుమార్‌తో పరిచయం ఉంది. దీంతో డ్రగ్స్‌ కావాలని కోరుతూ అందుకోసం రూ.65వేలు చెల్లించాడు. విచారణలో అక్షయ్‌కుమార్‌ తెలిపిన వివరాల మేరకు వైద్యుడు శ్రీకృష్ణచైతన్యకు వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆయనను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా.. వైద్యుడితో పాటు రఘు, గౌతమ్‌ అనే ఇద్దరు వ్యక్తులకు కూడా డ్రగ్స్‌ విక్రయించానని అక్షయ్‌కుమార్‌ చెప్పడంతో వారికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించి, రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఏసీపీ తెలిపారు.

Updated Date - Jul 07 , 2025 | 02:58 AM