Pension Controversy: వీళ్లకేం తక్కువని
ABN , Publish Date - Aug 02 , 2025 | 04:59 AM
ఒకేఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచి... ఏదైనా కారణాలవల్ల నెలకో, రెండు నెలలకో మాజీ అయినా జీవితాంతం పింఛను పొందవచ్చు. అదే నేత... ఎంపీగా గెలిస్తే, మాజీ అయిన తర్వాత ఆ హోదాలో మరో పింఛను ఇస్తారు
అనేకమంది నేతలకు డబుల్ పెన్షన్లు
ఒకే నేత ఎమ్మెల్యే, ఎంపీగా చేసి మాజీ అయితే జీవితాంతం రెండేసి పెన్షన్‌లు
విడివిడిగా ఇస్తున్న కేంద్ర, రాష్ట్రాలు
ఒక్కరోజు ఎమ్మెల్యేగా చేసి మాజీ అయినా పెన్షన్
పదవిలో ఉండగా లక్షల్లో జీత భత్యాలు
ఉద్యోగులకు లేని వెసులుబాటు వీరికెందుకు?
మాజీల పింఛన్ పద్ధతిపై జనంలో చర్చ
ఆయన రాష్ట్రానికి చెందిన బడా పారిశ్రామికవేత్త! వందలకోట్ల ఆస్తిపరుడు! ఒకసారి ఎమ్మెల్యేగా పని చేశారు. మరోసారి ఎంపీ అయ్యారు. ప్రస్తుతం ‘మాజీ’ మాత్రమే! కానీ... ఆయనకు మాజీ ఎమ్మెల్యేగా ఒక పింఛను, మాజీ ఎంపీ హోదాలో మరో పింఛనూ ఇస్తున్నారు. ఈ ‘డబుల్ ధమాకా’ ఎందుకు?
ఒకప్పుడు అత్యంత సాధారణ జీవితం గడుపుతూ, ఆర్టీసీ బస్సుల్లోనే తిరిగే నేతలు ఎమ్మెల్యేలయ్యే వారు. ఇప్పుడు... ఎన్నికల్లో రూ.30 కోట్ల ఖర్చుకూ వెనుకాడకుండా ఎమ్మెల్యేలు అవుతున్న వారే ఎక్కువగా కనిపిస్తున్నారు. మాజీలు అయ్యాక రూ.30వేల పింఛను తీసుకుంటేగానీ వీరికి రోజు గడవదా?
-ఇవి సామాన్యులు సంధిస్తున్న ప్రశ్నలు!
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
ఒక వ్యక్తి తన ఉద్యోగ జీవితంలో ఎన్ని హోదాల్లో పనిచేసినా... రిటైరైన తర్వాత ఒకటే పెన్షన్!
ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాతే పెన్షన్ వస్తుంది. అయితే... నిర్దిష్ట సర్వీసు పూర్తి చేసుకోకుండా రాజీనామా చేస్తే పూర్తి పెన్షన్ రాదు. అందులో కోత పడుతుంది!
సామాజిక పింఛను దగ్గరికే వద్దాం! దంపతులిద్దరూ వృద్ధులే అయినా... వారిలో ఒకరికి మాత్రమే వృద్ధాప్య పింఛను వస్తుంది!
అలాగే ఇవ్వాలని ప్రజాప్రతినిధులు చట్టాలు చేశారు! కానీ... ఘనత వహించిన మన నేతల విషయంలో ఏం జరుగుతోందో తెలుసా?
ఒకేఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచి... ఏదైనా కారణాలవల్ల నెలకో, రెండు నెలలకో ‘మాజీ’ అయినా జీవితాంతం పింఛను పొందవచ్చు. అదే నేత... ఎంపీగా గెలిస్తే, మాజీ అయిన తర్వాత ఆ హోదాలో మరో పింఛను ఇస్తారు. మాజీ ఎమ్మెల్యేగా రాష్ట్ర ప్రభుత్వం రూ.30వేలు పింఛను ఇస్తే... మాజీ ఎంపీలకు కేంద్ర ప్రభుత్వం రూ.31వేలు జీవితాంతం చెల్లిస్తుంది.
ఇలా ఒకే వ్యక్తికి రెండేసి పింఛన్లు ఇవ్వడంలో హేతుబద్ధత ఏమిటో ఎవరికీ అర్థం కాదు. పార్లమెంటు చట్టం ప్రకారం మాజీ ఎంపీలకు, రాష్ట్ర శాసనసభ చట్టాల ప్రకారం మాజీ ఎమ్మెల్యేలకు పింఛన్లు ఇస్తున్నారు. కానీ... ఒకే వ్యక్తికి రెండు పింఛన్లు ఇవ్వకూడదనే చట్టం మాత్రం లేదు.
డబుల్ ధమాకా...
మాజీ ఎంపీగా, మాజీ ఎమ్మెల్యేగా పని చేసి రెండు పింఛన్లు తీసుకుంటున్న వారిలో మన రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. వీరిలో... వందలు, వేల కోట్ల వ్యాపారాలు చేసే బడా పారిశ్రామిక వేత్తలు, స్టార్లు, రాజకీయ వారసు లూ ఉన్నారు. మన రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఒక్కరోజు పని చేసి మాజీ అయినా జీవితాంతం రూ.30వేలు పింఛను వస్తుంది. పొరుగు రాష్ట్రం తెలంగాణలో మాజీ ఎమ్మెల్యేలకు రూ.50 వేలు పింఛను చెల్లిస్తున్నారు. ఇక... మాజీ ఎంపీలకు రూ.31 వేల పింఛను అందుతుంది. విచిత్రం ఏమిటంటే... ఒకే వ్యక్తి 2 పదవులు చేసి మాజీ అయ్యాక అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు పింఛన్లు ఇచ్చేస్తున్నాయి. ఏదేమైనా.. వాళ్లు దీనిని వదులుకోవడంలేదు. మిగిలిన వాళ్లు తమకు తెలియకుండానే రెండూ తీసుకుంటున్నారు.
అసలు అవసరమా?
రెండు పింఛన్ల సంగతి పక్కనపెడితే... అసలు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు పింఛన్లు ఇవ్వడం అవసరమా? అనే ప్రశ్నలూ తలెత్తుతున్నాయి. ఒకప్పుడు పూర్తిగా ప్రజా సేవకే అంకితమై, అత్యంత నిరాడంబర జీవితం సాగించే నేతలు కొందరు చట్ట సభల్లో అడుగు పెట్టేవారు. వారికి ఇతర వ్యాపకాలు, వ్యాపారాలూ ఉండేవి కావు. ఇలాంటి నేతలకు ‘మాజీ’ అయ్యాక పింఛను ఇవ్వడంలో అర్థముం ది. కానీ, ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచేందుకు ఒక్కో నియోజకవర్గానికి కనీసం రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఎమ్మెల్యేగా గెలవగానే ప్రతి నెలా రూ. 1.30 లక్షల జీతం అందుతుంది. ఇతర అలవెన్సుల రూ పంలో ప్రతినెలా రూ.లక్ష అందుతున్నాయి. ఎంపీకీ భారీ గా జీతం, భత్యాలు అందుతాయి. వారి కుటుంబ సభ్యుల కూ సౌకర్యాలు అందుతాయి. మాజీలు అయ్యాక పింఛను తీసుకోవడం ఒక ఎత్తైతే... మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే హోదాలో రెండు పింఛన్లు తీసుకోవడం మరో ఎత్తు.
పీ4కు వాడొచ్చు కదా...
పీ4 కింద పేదల కుటుంబాలను దత్తత తీసుకోవాలని... ‘మార్గదర్శులు’గా మారాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే పిలుపునిస్తున్నారు. మరి... రెండేసి పింఛన్లు తీసుకుంటున్న నేతలు ఒక పేద కుటుంబాన్ని దత్తత తీసుకోవచ్చు కదా? జీత, భత్యాలు, పింఛన్లతో అవసరంలేని ధనికులైన నేతలు... తమకు అందుతున్న మొత్తాన్ని ప్రజలకోసం వెచ్చించవచ్చు. ప్రస్తుతం... ‘పీ4’పై చంద్రబాబు పిలుపునకు స్పందిస్తున్న ప్రజా ప్రతినిధుల సంఖ్య పెద్దగా కనిపించడంలేదు. ఆ విషయం పక్కనపెడితే... రెండు పింఛన్లు తీసుకుంటున్న వారు, నైతిక బాధ్యతగా ఒకదానిని వదులుకోవాలనే వాదనా వినిపిస్తోంది. ప్రభుత్వమైనా ‘ఒక మాజీకి ఒకటే పింఛను’ చట్టం తేవాలి.