AP CM Chandrababu: డబుల్ ధమాకా
ABN , Publish Date - Sep 18 , 2025 | 03:23 AM
దేశంలో పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి ఇదే సరైన సమయమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సరైన నాయకత్వం దేశాన్ని నడిపిస్తోందన్నారు.
డబుల్ ఇంజన్ సర్కార్‌తో డబుల్ డిజిట్ గ్రోత్
పరిశ్రమల అభివృద్ధికి ఇదే సరైన సమయం
దేశాన్ని పటిష్ఠ నాయకత్వం నడిపిస్తోంది
జీసీసీలకు ప్రపంచ కేంద్రంగా భారత్
ఏపీలో పరిశ్రమలకు సత్వర అనుమతులు
లాజిస్టిక్ సౌకర్యాల పెంపుపై ప్రత్యేక ఫోకస్
ఆగస్టుకల్లా భోగాపురం విమానాశ్రయం రెడీ
గంటలో గమ్యం చేరేలా విమానాశ్రయాలు
సీఐఐ జీసీసీ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌లో సీఎం
జీసీసీలు అంటే గుర్తొచ్చేది భారతీయులే
అవి బ్యాక్ ఆఫీసులు కాదు.. ఫ్యూచర్‌రెడీ సెక్టార్
వీటి అభివృద్ధికి ఏపీ అనుకూలం: నిర్మల
విశాఖపట్నం, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): దేశంలో పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి ఇదే సరైన సమయమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సరైన నాయకత్వం దేశాన్ని నడిపిస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయడం వల్ల డబుల్ ఇంజన్ సర్కార్‌తో డబుల్ డిజిట్ గ్రోత్ సాధ్యమైందని చెప్పారు. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల(జీసీసీ)కు భారత్ ప్రపంచ కేంద్రంగా మారుతోందని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందన్నారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) నేతృత్వంలో విశాఖపట్నంలోని రాడిసన్ బ్లూ హోటల్‌లో బుధవారం నిర్వహించిన జీసీసీ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ప్రధాని మోదీ దేశానికి గొప్ప ఆస్తి అని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతీయులను గుర్తించడమే కాకుండా గౌరవిస్తున్నారని అన్నారు. తలసరి ఆదాయం ఎక్కువ సాధించే వారిలో ప్రపంచంలో భారతీయులే ఎక్కువగా ఉన్నారని చెప్పారు. 2047 నాటికి 2.5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీతో భారతదేశం ఆర్థికంగా మొదటి స్థానంలో నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రధాన ఆర్థిక వనరుగా వేయి కి.మీ. కోస్తా తీరం ఉందన్నారు. రాష్ట్ర విభజన తరువాత వచ్చిన ఇబ్బందులను అధిగమించినా, గత వైసీపీ ప్రభుత్వం వల్ల రాష్ట్రం చాలా అవకాశాలను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యతగల ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలో ఉందన్నారు. పరిశ్రమ ఏర్పాటుకు ఎవరైనా ముందుకువస్తే కేవలం రెండు నుంచి మూడు రోజుల్లోనే గ్రీన్‌సిగ్నల్ ఇస్తున్నామని తెలిపారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
విశాఖకు మెట్రోరైలు ప్రాజెక్టు
‘‘వచ్చే నెలలోనే విశాఖపట్నానికి గూగుల్ డేటా సెంటర్ వస్తుంది. అదేవిధంగా భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్ పోర్టులో వచ్చే ఆగస్టు నుంచి కార్యకలాపాలు మొదలవుతాయి. విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టు కూడా వస్తుంది. ఏపీలో విశాఖ బెస్ట్ నగరం. రాష్ట్రంలో ప్రతి 50 కి.మీ.కు ఒక పోర్టు నిర్మిస్తున్నాం. గంట ప్రయాణిస్తే సమీపంలోని నగరానికి చేరుకునేలా ఎక్కడికక్కడే విమానాశ్రయాలు నిర్మించాం.. ఇంకా కొన్ని నిర్మాణంలో ఉన్నాయి. హైదరాబాద్ కంటే మిన్నగా అమరావతిలో మరో విమానాశ్రయం నిర్మిస్తున్నాం. రహదారులు, రైళ్ల కనెక్టివిటీ కూడా పెంచుతున్నాం. అమరావతికి బుల్లెట్ రైలు తీసుకువచ్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. రాష్ట్రంలో లాజిస్టిక్స్ సౌకర్యాల పెంపుపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాం. అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా తీర్చిదిద్దుతున్నాం. అమరావతి చక్కటి గ్రీన్‌ఫీల్డ్ సిటీగా మారుతుంది. అంతా అక్కడకి వచ్చి సెటిల్ కావాలి. రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తున్నాం. ఆధార్ డేటాతో పథకాల పంపిణీకి మైక్రో ప్లానింగ్ చేస్తున్నాం. బిల్‌గేట్స్ ఫౌండేషన్ సాయంతో ‘సంజీవిని’ పథకం అమలు చేయబోతున్నాం. ప్రతి పౌరుడి ఆరోగ్య రికార్డ్ ప్రభుత్వం వద్ద ఉంటుంది. రియల్ టైమ్ డేటాతో పరిపాలన సాగుతోంది. వాట్సాప్ ద్వారా 725 సేవలు ప్రజలకు అందుబాటులోకి తెచ్చాం. ‘ఒక కుటుంబం.. ఒక ఉద్యోగం నినాదం’ నుంచి ‘ఒక కుటుంబం.. ఒక పారిశ్రామికవేత్త’కు మారాం. ఉద్యోగాలు కల్పించే స్థాయికి యువత ఎదగాలి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా కొత్త ఆలోచనలకు రూపం ఇస్తాం’’ అని సీఎం చెప్పారు. మహిళలకు భద్రత కల్పించే నగరాల్లో విశాఖపట్నం మొదటి స్థానాన్ని పొందిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తుచేశారు.
పెట్టుబడులపై ఫ్రాన్స్ బృందంతో సీఎం చర్చలు
ఫ్రాన్స్‌కు చెందిన ప్రతినిధులతో చంద్రబాబు విశాఖపట్నంలో భేటీ అయ్యారు. ఫ్రాన్స్ కౌన్సిల్ జనరల్ మార్క్‌లేమి బృందంతో పెట్టుబడులపై సీఎం చర్చిం చారు. ఏపీలో కీలక రంగాలైన ఏరోస్పేస్, రక్షణ, పునరుత్పాదక ఇంధన, పోర్టులు, మారీటైమ్ లాజిస్టిక్స్, ఉన్నత విద్య, కోల్డ్ చెయిన్, లైఫ్-సైన్సెస్, మెడికల్ టెక్నాలజీ రంగాలతో పాటు స్టార్టప్‌లు, ఇన్నోవేషన్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.
సొంత భూమిలోనూ ఐటీ పార్కులకు అనుమతి
రాష్ట్ర ఐటీ కార్యదర్శి కాటమనేని భాస్కర్
రాష్ట్రంలో ఎవరైనా వారి సొంత భూమిలో ఐటీ పార్కు ఏర్పాటు చేయడానికి ముందుకువస్తే ప్రభుత్వం అనుమతులు ఇస్తుందని ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ తెలిపారు. జీసీసీ బిజినెస్ సమ్మిట్‌లోని చర్చా కార్యక్రమంలో ఆ యన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం భాస్కర్ మాట్లాడుతూ, సొంత భూముల్లో ఐటీ పార్కుల ఏర్పాటును స్వాగతిస్తామన్నారు. కొంత ప్రైవేటు భూమి ఉండి, పక్కన ప్రభుత్వ భూమి కూడా అవసరమైతే దానిని కూడా సమకూరుస్తామన్నారు. జీసీసీలకు అవసరమైన పూర్తి సహకారం ఇస్తామన్నారు. జీసీసీ నిర్వాహకులు మాట్లాడుతూ, ఎయిర్ కార్గో ద్వారా రాష్ట్రంలోకి ఎలకా్ట్రనిక్స్‌ను దిగుమతి చేసుకోవడానికి అవకాశం కల్పించాలని కోరారు.