Share News

CM Chandrababu: మోదీ సంపూర్ణ సహకారంతో.. డబుల్‌ స్పీడ్‌

ABN , Publish Date - Oct 26 , 2025 | 04:26 AM

రాష్ట్రాభివృద్ధికి ప్రధాని మోదీ నుంచి సంపూర్ణ సహకారం లభిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో....

CM Chandrababu: మోదీ సంపూర్ణ సహకారంతో.. డబుల్‌ స్పీడ్‌

  • ఏడాదిలోనే సూపర్‌సిక్స్‌ అమలు చేశాం: సీఎం

  • డబుల్‌ ఇంజన్‌ సర్కారుతోనే సాధ్యమైంది

  • కేంద్రం చొరవతోనే ఆర్సెలార్‌ స్టీల్‌ ప్లాంట్‌

  • వచ్చే నెలలో శంకుస్థాపన చేస్తున్నాం

  • 16 నెలల్లో 10 లక్షల కోట్ల పెట్టుబడులు

  • మరో రూ.5 లక్షల కోట్లు రానున్నాయ్‌

  • బిహార్‌ ఎన్నికల్లో ఎన్డీయేదే గెలుపు

  • ఓ వార్తాసంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా

జీఎస్టీ సంస్కరణలు అటు వ్యాపారులకు.. ఇటు వినియోగదారులకూ ఆనందాన్నిచ్చాయి. ప్రజలకు సూపర్‌ సేవింగ్స్‌ అందుతుండగా, ఎంఎస్ఎంఈ రంగం, ఇతర వ్యాపారులు కూడా సంతోషంగా ఉన్నారు.

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రగతిశీల ప్రభుత్వం. సామాన్య ప్రజల ప్రయోజనం కోసం అనేక సంస్కరణలు తీసుకొస్తోంది. సామాన్యుల సాధికారతే లక్ష్యంగా పనిచేస్తోంది.

- ముఖ్యమంత్రి చంద్రబాబు

అమరావతి, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రాభివృద్ధికి ప్రధాని మోదీ నుంచి సంపూర్ణ సహకారం లభిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీలను అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అమలు చేయగలిగిందని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న డబుల్‌ ఇంజన్‌ పాలనే దీనికి కారణమన్నారు. తాజాగా ఓ ఆంగ్ల వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఆర్సెలార్‌ మిట్టల్‌ నిప్పన్‌ స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో మోదీ చొరవతో అవసరమైన అన్ని అనుమతులనూ శరవేగంగా సాధించగలిగామని, కేవలం రెండు నెలల్లో ఈ ప్రాజెక్టును తీసుకురాగలిగామని అన్నారు. 7.3 మిలియన్‌ టన్నుల ప్రారంభ సామర్థ్యంతో ఏర్పాటయ్యే ఈ స్టీల్‌ ప్లాంట్‌కు వచ్చే నెలలో శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. మోదీ రాజకీయ ప్రస్థానాన్ని ఆయన కొనియాడారు. ‘దేశంలో చాలా ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మోదీ 2000 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లో విజయం సాధించారు. గతంలో గుజరాత్‌ సీఎంగా పనిచేశారు. 2014 నుంచి 11 ఏళ్లుగా ప్రధానిగా ఉన్నారు. మరో నాలుగేళ్లు కొనసాగుతారు. ఈ దశాబ్దం ఆయనదేననడంలో సందేహం లేదు.’ అని పేర్కొన్నారు.


16 నెలల్లో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు

16నెలల్లో రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్లు విలువైన పెట్టుబడులు సాధించగలిగామని.. మరో 5 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని చంద్రబాబు తెలిపారు. ఏపీలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయన్నారు.

గ్రీన్‌ ఎనర్జీ, వ్యవసాయం, హార్టికల్చర్‌, లాజిస్టిక్స్‌, రాజధానిలో పెట్టుబడులకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. నవంబరులో జరగనున్న బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయేనే విజయం సాధిస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీయే నాయకులు ఎప్పుడు కోరినా బిహార్‌ వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

తెలుగు ప్రవాసులతో నెట్‌వర్క్‌

వివిధ దేశాల్లో ఉన్న తెలుగు వారందరినీ ఒక్కతాటిపైకి తెచ్చేందుకు కృషిచేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. ఇందులో భాగంగా ప్రవాస తెలుగు సమూహాలతో ఓ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. దీనిద్వారా తెలుగువారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ‘తెలుగు సమాజం భవిష్యత్‌లో ఒకనాటికి ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన, శక్తివంతమైన సమాజంగా నిలుస్తుంది’ అని స్పష్టం చేశారు.

Updated Date - Oct 26 , 2025 | 05:59 AM