Goods Wagon: కియ కార్ల తరలింపునకు డబుల్ డెక్కర్ గూడ్స్ రైలు
ABN , Publish Date - Aug 22 , 2025 | 05:17 AM
శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలోని కియ పరిశ్రమ నుంచి కార్ల తరలింపు కోసం ప్రత్యేకంగా డబుల్ డెక్కర్ గూడ్స్ రైలును ఏర్పాటు చేశారు.
పెనుకొండ రైల్వే స్టేషన్ నుంచి 264 కార్ల తరలింపు
పెనుకొండ రూరల్, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలోని కియ పరిశ్రమ నుంచి కార్ల తరలింపు కోసం ప్రత్యేకంగా డబుల్ డెక్కర్ గూడ్స్ రైలును ఏర్పాటు చేశారు. ఇక్కడ తయారైన కార్లను దేశ, విదేశాలకు తరలిస్తుంటారు. ఇప్పటి వరకూ ఒక విడతలో సింగిల్ వ్యాగన్‌ల ద్వారా వంద కార్లను తరలించేవారు. తాజాగా గురువారం పెనుకొండ రైల్వే జంక్షన్ మీదుగా డబుల్ డెక్కర్ గూడ్స్ వ్యాగన్ ద్వారా 264 కార్లను ఢిల్లీకి తరలించారు. పెనుకొండ వద్ద 2019లో కియ ఇండియా కార్ల ఉత్పత్తులను ప్రారంభించింది. ఇప్పటి వరకూ 17లక్షల కార్లను ఉత్పత్తి చేసినట్లు కియ ఇండియా పీఆర్‌ఓ హర్షవర్ధన్‌రెడ్డి తెలిపారు. ఏడాదికి 3లక్షల కార్ల చొప్పున తయారవుతున్నాయన్నారు. కియ కార్లకు భారతదేశంలో డిమాండ్ పెరిగిందని, వినియోగదారులకు సత్వరమే అందించేందుకు డబుల్ డెక్కర్ గూడ్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.