Share News

Double Decker Bus Tour: హాప్‌ హాప్‌.. టిప్‌ టాప్‌

ABN , Publish Date - Sep 06 , 2025 | 04:53 AM

రామకృష్ణా బీచ్‌ నుంచి తొట్లకొండ వరకు! మొత్తం పది పర్యాటక ప్రాంతాలు! ఎక్కడైనా ఎక్కొచ్చు... ఎక్కడైనా దిగొచ్చు! 24 గంటల్లో ఎన్నిసార్లైనా ప్రయాణించవచ్చు!

Double Decker Bus Tour: హాప్‌ హాప్‌.. టిప్‌ టాప్‌

  • రూ.250తో కులాసాగా విహారం

  • విశాఖలో ‘డబుల్‌ డెక్కర్‌’ టూర్‌

  • పది పర్యాటక ఆకర్షణల వీక్షణ

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

రామకృష్ణా బీచ్‌ నుంచి తొట్లకొండ వరకు! మొత్తం పది పర్యాటక ప్రాంతాలు! ఎక్కడైనా ఎక్కొచ్చు... ఎక్కడైనా దిగొచ్చు! 24 గంటల్లో ఎన్నిసార్లైనా ప్రయాణించవచ్చు! కూల్‌కూల్‌గా ఏసీ బస్సు! డబుల్‌ డెక్కర్‌లో పై వరుసలో కూర్చుని విశాఖ అందాలు వీక్షించవచ్చు! ఆయా ప్రాంతాల వివరాలు చెప్పేందుకు బస్సులోనే టూర్‌ గైడ్‌! విద్యుత్‌ వాహనంలో... చప్పుడు లేకుండా సుఖమైన ప్రయాణం! ఇన్ని సౌకర్యాలుంటే టికెట్‌ ఏ వెయ్యి రూపాయలో ఉంటుందనుకుంటున్నారా? కానే కాదు! కేవలం రూ. 250తో విశాఖ అందాలు చూసే ‘హాప్‌ ఆన్‌.. హాప్‌ ఆఫ్‌’ పర్యాటక బస్సు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం రెండు ‘హాప్‌’ బస్సులు తిరుగుతున్నాయి.

ఏమేం చూడొచ్చు...: ‘హాప్‌ ఆన్‌... హాప్‌ ఆఫ్‌’ బస్సు ప్రయాణం రామకృష్ణా బీచ్‌లో మొదలవుతుంది. అక్కడి నుంచి... టీయూ-142 విమాన మ్యూజియం, కురుసుర సబ్‌మెరైన్‌, సీ హ్యారియర్‌, యూహెచ్‌-3హెచ్‌ హెలికాప్టర్‌ మ్యూజియం, విశాఖ మ్యూజియం, వీఎంఆర్‌డీఏ పార్క్‌, రోప్‌వే (కైలాసగిరి వెళ్లేవారికి), తెన్నేటి పార్క్‌, సాగర్‌నగర్‌ బీచ్‌, ఇస్కాన్‌ టెంపుల్‌, రుషికొండ వెంకటేశ్వరస్వామి ఆలయం, రుషికొండ బీచ్‌ మీదుగా తొట్లకొండ వరకు వెళుతుంది. మొత్తం 16 కిలోమీటర్లు... పది పర్యాటక ప్రాంతాలు!


ఇదీ ప్రత్యేకత...

ఆయా పర్యాటక కేంద్రాల్లో నచ్చిన చోట దిగి.. తర్వాత... మళ్లీ వచ్చే ‘హాప్‌ ఆన్‌ హాప్‌ ఆఫ్‌’ బస్సు ఎక్కి.. మరో పర్యాటక ప్రాంతంలో దిగొచ్చు. ఇలా 24 గంటలపాటు ఎన్నిసార్లయినా.. ఎక్కడైనా ఎక్కి, దిగొచ్చు. ఒకసారి టికెట్‌ తీసుకుంటే చాలు. ఈ బస్సులు ఎక్కడున్నాయో తెలుసుకోవడానికి ప్రత్యేకంగా యాప్‌ తయారు చేస్తున్నారు. అది అందుబాటులోకి వచ్చే వరకు గైడ్ల మొబైల్‌ నంబర్లు ఇస్తున్నారు. వారికి ఫోన్‌ చేస్తే బస్సు ఎంతసేపట్లో వస్తుందో చెబుతారు. ఈ టికెట్లను బస్సులోనే తీసుకోవచ్చు. ఆయా పర్యాటక కేంద్రాల వద్ద టికెట్‌ కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు. పర్యాటకుల గుర్తింపు కార్డు చూసి టికెట్‌ ఇస్తారు.

ఈవీ బస్సులో... కూల్‌గా!

గతనెల 29న సీఎం చంద్రబాబు విశాఖలో ‘హాప్‌ ఆన్‌... హాప్‌ ఆఫ్‌’ బస్సులు ప్రారంభించారు. ఈ విద్యుత్‌ బస్సులు మూడు గంటలు చార్జింగ్‌ చేస్తే 170 కిలోమీటర్లు నడుస్తాయి. బస్సులో కిందా, పైనా కలిపి 100 సీట్లు ఉన్నాయి. సెంట్రలైజ్డ్‌ ఏసీ ఉండే ఈ బస్సుల్లో గైడ్‌ ఉంటారు. ఆయా ప్రాంతాల విశేషాలను పర్యాటకులకు వివరిస్తారు. ఈ టూర్‌కు తొలుత రూ.500 టికెట్‌ నిర్ణయించగా... సీఎం సూచనల మేరకు దానిని రూ.250కి తగ్గించారు. పిల్లలకు రూ.వంద మాత్రమే!.

త్వరలో ఓపెన్‌ టాప్‌ బస్సు

ప్రస్తుతం ఉన్న రెండు బస్సుల్లో ఒకటి విశాఖపట్నం పోర్టు, మరొకటి అశోక్‌ లేల్యాండ్‌ కంపెనీ సమకూర్చాయి. త్వరలో హెచ్‌పీసీఎల్‌ కంపెనీ మరొకటి ఇవ్వనుంది. అది ఓపెన్‌ టాప్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సు. బస్సులు వారాంతాల్లో ఫుల్‌ ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. మిగిలిన రోజుల్లో పర్యాటకుల సంఖ్య తక్కువగా ఉంటోంది. వచ్చే నెల నుంచి పర్యాటక సీజన్‌ మొదలైతే.. డిమాండ్‌ పెరుగుతుంది.

- జె.మాధవి, విశాఖ జిల్లా పర్యాటక శాఖ అధికారిణి

Updated Date - Sep 06 , 2025 | 04:57 AM