ప్రమాదం పొంచి ఉన్నా పట్టించుకోరా?
ABN , Publish Date - Sep 14 , 2025 | 10:47 PM
యండపల్లివలస- అరకు మార్గంలోని బురద గెడ్డ వంతెన అప్రోచ్ రోడ్డు ఒక వైపు గెడ్డలో జారిపడిపోయి ప్రమాదకరంగా ఉంది. రహదారిలో పావు వంతు భాగం గెడ్డలో జారిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
దెబ్బతిన్న బురద గెడ్డ అప్రోచ్ రోడ్డు
ఒక వైపు గెడ్డలోకి జారిపోవడంతో రాకపోకలకు అంతరాయం
పూర్తిగా కూలిపోతే అరకు నుంచి పాడేరుకు నిలిచిపోనున్న రవాణా సేవలు
పట్టించుకోని ప్రజా ప్రతినిధులు, అధికారులు
అరకులోయ, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): యండపల్లివలస- అరకు మార్గంలోని బురద గెడ్డ వంతెన అప్రోచ్ రోడ్డు ఒక వైపు గెడ్డలో జారిపడిపోయి ప్రమాదకరంగా ఉంది. రహదారిలో పావు వంతు భాగం గెడ్డలో జారిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఎదురెదురుగా వాహనాలు రాకపోకలు సాగే అవకాశం లేకుండాపోయింది. పెను ప్రమాదం జరిగే వరకు అధికారులు స్పందించరా? అని వాహనచోదకులు ప్రశ్నిస్తున్నారు.
యండపల్లివలస- అరకు మార్గంలో నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అరకులోయ నుంచి డుంబ్రిగుడ, హుకుంపేట మీదుగా పాడేరుకు ఇదే ప్రధాన రహదారి కావడంతో ఎమ్మెల్యేలు, కలెక్టర్, జేసీ, ఐటీడీఏ పీవో, ఆర్‌అండ్‌బీ అధికారులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఈ మార్గంలోని బురద గెడ్డ వంతెన అప్రోచ్ రోడ్డు మూడు నెలల క్రితం ఒక వైపు కూలిపోయి గెడ్డలోకి జారిపోయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. వాహనాలు ఎదురెదురుగా వచ్చే సమయంలో దాటి వెళ్లే అవకాశం లేక నిలిచిపోతున్నాయి. లారీ, బస్సులు రాకపోకలు సాగిస్తున్న క్రమంలో ఈ అప్రోచ్ రోడ్డు పూర్తిగా కూలిపోతే అరకు- పాడేరు మధ్య రాకపోకలు నిలిచిపోతాయి. మరో నెల రోజుల్లో పర్యాటక సీజన్ ప్రారంభంకానుండడంతో బస్సులో వచ్చే పర్యాటకులు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ రహదారికి మరమ్మతులు చేయించకపోతే పెను ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు.