Share News

విలువైన సమయం వృథా చేయొద్దు

ABN , Publish Date - Dec 05 , 2025 | 01:00 AM

విద్యార్థులు, యువత తమ విలువైన సమయాన్ని వృధా చేయవద్దని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. బందరు మండలం రుద్రవరంలోని కృష్ణా విశ్వవిద్యాలయంలో కృష్ణాతరంగ్‌, అంతర కళాశాలల యువజనోత్సవాలు- 2025 గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి.

విలువైన సమయం వృథా చేయొద్దు

- సోషల్‌ మీడియాకు బానిసలు కావొద్దు

- అవసరం మేరకే సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలి

- మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు

- కృష్ణా వర్సిటీలో ఘనంగా కృష్ణాతరంగ్‌-2025 ప్రారంభం

మచిలీపట్నం టౌన్‌, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు, యువత తమ విలువైన సమయాన్ని వృధా చేయవద్దని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. బందరు మండలం రుద్రవరంలోని కృష్ణా విశ్వవిద్యాలయంలో కృష్ణాతరంగ్‌, అంతర కళాశాలల యువజనోత్సవాలు- 2025 గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు మాట్లాడుతూ సెల్‌ఫ్లోను, సోషల్‌ మీడియాకు బానిసలు కావొద్దని చెప్పారు. అవసరం మేరకే సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలని సూచించారు. ఎక్కువ సమయం లక్ష్య సాధనకు నైపుణ్య అభివృద్ధి కోసం ఉపయోగించాలని హితవు పలికారు. యువతలో తగిన సమయంలో స్ఫూర్తిని నింపి మార్గనిర్దేశం చేస్తే దేశానికి గొప్ప సంపదగా తయారవుతారని చెప్పారు. విశ్వవిద్యాలయాలు విజ్ఞాన కేంద్రాలని, విద్యను మాత్రమే కాకుండా విజ్ఞానాన్ని బోధించాలని తెలిపారు. సంస్కారవంతమైన భారతీయులుగా తయారు చేయాలని పేర్కొన్నారు. తెలుగు రాషా్ట్రల్లో విద్యా వ్యవస్థలో సంస్కరణలు చేపట్టవలసిన అవసరం ఉందన్నారు. గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్‌ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు వివిధ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు జీవితం నేటి తరానికి ఆదర్శనీయమని కొనియాడారు. చట్ట సభల్లో ఆయన మాట్లాడిన తీరు ఎంతో హుందాగా ఉంటుందని గుర్తు చేశారు. జిల్లాకు ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయంలో మౌలిక వసతుల కల్పనకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆర్టీసీ చైర్మన్‌ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ తెలుగు భాషలోనే పాలనాపరమైన ప్రత్యుత్తరాలు జరగాలని ఆకాంక్షించారు. అవనిగడ్డ శాసన సభ్యుడు మండలి బుద్ధప్రసాద్‌ మాట్లాడుతూ జిల్లాలో కృష్ణా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు చేసిన కృషి, జిల్లా చరిత్ర, తెలుగు భాష, సంస్కృతి సంప్రదాయాల గొప్పతనాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో వీసీ కూన రాంజీ, రిజిసా్ట్రర్‌ ఉష, రెక్టార్‌ బసవేశ్వరరావు, ప్రోగ్రాం కన్వీనర్‌ దిలీప్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ బండి రామకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Dec 05 , 2025 | 01:00 AM