రీసర్వేలో రైతులకు అన్యాయం జరగనీయొద్దు
ABN , Publish Date - Apr 10 , 2025 | 11:58 PM
మంత్రాలయం నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీసర్వేలో రైతులకు అన్యాయం జరగకుండా సర్వే చేయాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, మంత్రాలయం ఆర్వో కె.అనురాధ అన్నారు.

స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె.అనురాధ
మంత్రాలయం, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): మంత్రాలయం నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీసర్వేలో రైతులకు అన్యాయం జరగకుండా సర్వే చేయాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, మంత్రాలయం ఆర్వో కె.అనురాధ అన్నారు. గురువారం తహసీల్దార్ కార్యాలయంలో రీసర్వే జరిగిన గ్రామాల్లో ఎదురైన సమస్యలు, భూసరిహద్దులు, ప్రభుత్వ భూములు, పట్టాదారులు, అనుభవం, కొలతల్లో తేడాలు వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రీసర్వే చేస్తున్న సర్వేయర్లపై ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా కొలతలు నిర్ధారించుకునేందుకు అవకాశం కల్పించాలని సూచించారు. గ్రామకంఠం ప్రభుత్వ భూములు, పట్టాదారుల్లో అనుభవదారులను గుర్తించి పక్కాగా కొలతలు నమోదు చేయాలని ఆదేశించారు. అధికారులు నిర్లక్ష్యం వహించకుండా రైతులను సంప్రదించి వారి సలహాలు కూడా తీసుకోవాలని సూచించారు. అనంతరం పైలట్ రీసర్వే గ్రామమైన చెట్నహల్లికి సంబంధించిన ఫైళ్లను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. సమావేశంలో తహసీల్దార్ ఎస్.రవి, డిప్యూటీ తహసీల్దార్ గురురాజరావు, సరస్వతి, ఆర్‌ఐ ఆదాం, మండల సర్వేయర్ అశోక్, జయరామిరెడ్డి, వీఆర్వోలు ఆనంద్, భీమన్నగౌడు ప్రభాకర్, శ్వేత, నరసప్ప, సర్వేయర్లు పాల్గొన్నారు.