బుసక తవ్వొద్దు!
ABN , Publish Date - Sep 05 , 2025 | 12:49 AM
మచిలీపట్నం నార్త్ మండలంలో బుసక తవ్వకాలపై మంత్రి కొల్లు రవీంద్ర సీరియస్ అయ్యారు. మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ(ముడా)కి చెందిన భూముల్లో బుసక తవ్వొద్దని టీడీపీ నాయకులను ఆదేశించారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమించి బుసక తవ్వకాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మైనింగ్ అధికారుల నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే సొంత భూముల నుంచి బుసక తవ్వకాలు చేసుకోవాలని స్పష్టం చేశారు.
- ముడా భూముల్లోకి వెళ్లొద్దు
- ప్రభుత్వానికి చెడ్డపేరు తేవొద్దు
- అక్రమాలకు పాల్పడుతున్న వారికి మంత్రి క్లాస్
- కరగ్రహారం, క్యాంప్‌బెల్‌పేట గ్రామస్థులతో ఇటీవల సమావేశం
- పలు అంశాలపై దిశానిర్దేశం.. హెచ్చరికలు జారీ
మచిలీపట్నం నార్త్ మండలంలో బుసక తవ్వకాలపై మంత్రి కొల్లు రవీంద్ర సీరియస్ అయ్యారు. మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ(ముడా)కి చెందిన భూముల్లో బుసక తవ్వొద్దని టీడీపీ నాయకులను ఆదేశించారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమించి బుసక తవ్వకాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మైనింగ్ అధికారుల నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే సొంత భూముల నుంచి బుసక తవ్వకాలు చేసుకోవాలని స్పష్టం చేశారు.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:
నియోజకవర్గంలో పలు గ్రామాలకు, సముద్రానికి మధ్యన ఉన్న బే ఆఫ్ బెంగాల్, ముడా భూముల్లో కొందరు ఇష్టారాజ్యంగా బుసక తవ్వకాలు చేస్తున్నారు. దీంతో సముద్ర జలాలు గ్రామాల్లోకి చొచ్చుకువచ్చే ప్రమాదం పొంచి ఉంది. దీనిపై ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బుసక తవ్వకాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయం మంత్రి కొల్లు రవీంద్ర దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం కరగ్రహారం, క్యాంప్‌బెల్‌పేట తదితర గ్రామాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులతో మంత్రి సమావేశం నిర్వహించారు. పలువురు గ్రామస్థులు మాట్లాడుతూ గ్రామాలకు, సముద్రానికి మధ్యన ఉన్న బే ఆఫ్ బెంగాల్, ముడా భూముల్లో వైసీపీ ప్రభుత్వంలో, ఇటీవల కాలంలోనూ బుసక తవ్వకాలు చేస్తున్నారని తెలిపారు. తుఫాన్లు సంభవించిన సమయంలో సముద్రపు అలలు పెద్ద ఎత్తున వస్తే గ్రామాల్లోకి నీరు రావడం ఖాయమన్నారు. కొందరు అక్రమార్కులు యంత్రాల ద్వారా సముద్రం ఒడ్డున సహజ సిద్ధంగా తయారైన బుసక మేటలను సైతం తవ్వేస్తున్నారని ఆరోపించారు. దీంతో సముద్ర తీర గ్రామాలకు ప్రమాదం పొంచి ఉందన్నారు. 1977, నవంబరు నెలలో సంభవించిన తుఫాన్ సమయంలో సముద్రం వెంబడి ఉన్న ఎత్తయిన బుసకమేట కారణంగా గ్రామాల్లోకి సముద్రపు నీరు చొచ్చుకు రాలేదని గుర్తు చేశారు. గ్రామాలకు రక్షణ కవచంగా ఉన్న బుసకమేటలను ప్రస్తుతం తవ్వేస్తుడటంపై ఆందోళన వ్యక్తం చేశారు. బుసకను తవ్వే అక్రమార్కులు ధనాపేక్షనే చూసుకుంటున్నారని, గ్రామాలకు పొంచి ఉన్న ముప్పును పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
చెడ్డపేరు తెస్తే ఉపేక్షించబోం
బుసక తవ్వకాలపై మంత్రి రవీంద్ర స్పందించారు. సముద్ర తీర గ్రామాల్లో కొందరు బుసకను తవ్వేస్తూ ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారని, అలాంటి వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. నాయకులు తమ తీరును మార్చుకోవాలని, లేకుంటే ఇబ్బందులు పడతారని హెచ్చరించారు. ప్రతిపక్ష నాయకులతో అంట కాగవద్దని చెప్పారు. ఎవరైనా ప్రభుత్వ భూముల్లో బుసక తవ్వకాలు చేస్తే గ్రామస్థులంతా ఐక్యంగా నిలబడి అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని సూచించారు.
గ్రామాల్లో జోరుగా బుసక తవ్వకాలు
మచిలీపట్నం నార్త్ మండలం పరిధిలోని కరగ్రహారం, క్యాంప్‌బెల్‌పేట, గోపువానిపాలెం, తపసిపూడి, మంగినపూడి, తాళ్లపాలెం తదితర గ్రామాల నుంచి వర్షాకాలంలోనూ ప్రభుత్వ భూముల నుంచి బుసకను తవ్వి విక్రయించేస్తున్నారు. సముద్ర తీరం వెంబడి పోర్టు నిర్మాణం కోసం రైతులు ముడాకు విక్రయించిన భూముల్లో నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా బుసకను తవ్వేస్తున్నారు. ముడా కార్యాలయంలో పనిచేసే సర్వేయర్‌లు చూపిన ముడా భూముల్లో అక్రమార్కులు రాత్రి, పగలు తేడా లేకుండా బుసక తవ్వేసి విక్రయాలు జరుపుతున్నారు. బుసక తవ్వకాలను పరిశీలించేందుకు వెళ్లిన ముడా అధికారులను సైతం ఇటీవల కాలంలో బెదిరించి మరీ, బుసక తవ్వకాలను మరింత విస్తృతం చేశారు. మైనింగ్ అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రతిరోజు వందలాది ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా బుసకను అడ్డు, అదుపు లేకుండా తరలించేస్తున్నారు. దీంతో ఈ అంశం వివాదాస్పదంగా మారింది. వైసీపీ ప్రభుత్వ హయాంలోనూ సముద్రతీరం వెంబడి గ్రామాల్లోని ప్రభుత్వ భూముల నుంచి బుసక తవ్వకాలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ, కూటమి నాయకులు కూడబలుక్కుని మరీ ప్రభుత్వ భూముల నుంచి బుసకను తవ్వి విక్రయించేస్తున్నారు. ఇటీవల కాలంలో బుసక తవ్వకాల అంశం వివాదాస్పదం కావడం, వర్షాకాలంలోనూ ముడా భూముల నుంచి బుసకను తవ్వి విక్రయించడం, ఈ అంశం తలనొప్పిగా మారడంతో మంత్రి రవీంద్ర సముద్రతీర గ్రామాల ప్రజలతో సమావేశం నిర్వహించి దిశానిర్ధేశం చేయడం గమనార్హం. కరగ్రహారం, క్యాంప్‌బెల్‌పేట గ్రామాలతో పాటు, గోపువానిపాలెం, తపసిపూడి గ్రామాల్లోనూ జోరుగా బుసకతవ్వకాలు జరుగుతున్నాయని, ఈ గ్రామాల్లోనూ బుసక తవ్వకాలను నిలిపివేస్తే తీరప్రాంత గ్రామాలను ప్రకృతి విపత్తుల నుంచి కాపాడినట్లవుతుందని సముద్రతీరం వెంబడి ఉన్న గ్రామాల ప్రజలు అంటున్నారు.