Share News

డోంట్‌ కేర్‌

ABN , Publish Date - Nov 28 , 2025 | 11:06 PM

సీసీఐ నిబంధన పత్తి రైతులను నానా ఇబ్బందిపెడుతోంది. పత్తిలో 8-12 శాతం తేమ ఉంటేనే కొంటామని సీసీఐ అధికారులు తేల్చి చెప్తున్నారు.

   డోంట్‌ కేర్‌
గ్రామాల్లో తక్కువ తూకాలతో జోరుగా పత్తి కొనుగోళ్లు

ఎవరెన్ని చెప్పినా మేం వినం

ఫ ప్రకృతి వైపరీత్యాలతో సంబంధం లేదంటున్న సీసీఐ అధికారులు

ఫ 8 నుంచి 12 శాతం తేమ ఉంటేనే పత్తి కొనుగోలు

ఫ కపాస్‌ కిసాన అవాంతరాలపై నోరు మెదపని సీసీఐ

ఫ ఇప్పటి దాకా సీసీఐ కొనుగోలు చేసింది 40 క్వింటాళ్లే..

ఫ వ్యాపారులు కొన్నది 5 లక్షల క్వింటాళ్ల పైమాటే

కర్నూలు అగ్రికల్చర్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): సీసీఐ నిబంధన పత్తి రైతులను నానా ఇబ్బందిపెడుతోంది. పత్తిలో 8-12 శాతం తేమ ఉంటేనే కొంటామని సీసీఐ అధికారులు తేల్చి చెప్తున్నారు. దీని మీద సీఎం మొదలుకుని మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌, జిల్లా ఉన్నతాధికారులు 14 శాతం తేమ ఉన్నా రైతుల నుంచి పత్తి కొనాలని ఆదేశించారు. పదే పదే ఉత్తర్వులు జారీ చేస్తున్నా సీసీఐ అధికారులు మాత్రం లక్ష్యపెట్టడం లేదు. ఎవరేం చెప్పినా మా నిబంధనల మేరకే పత్తిని కొంటామంటున్నారు. దీనికి తోడు కపాస్‌ కిసాన యాప్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకోవడం రైతులకు తలనెప్పిగా మారిపోయింది.

ఈ రైతు పేరు రాము. కల్లూరు మండలం గోకులపాడు గ్రామం. తనకున్న మూడెకరాల్లో ఖరీఫ్‌ పంటగా పత్తిని సాగు కోసం 60 వేల దాకా ఖర్చు పెట్టాడు. అధిక వర్షాల వల్ల ఎకరాకు 4 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చింది. చేతికందిన 15 క్వింటాళ్ల పత్తిని సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోడానికి కపాస్‌ కిసాన యాప్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకునేందుకు నానా తంటాలు పడ్డాడు. నెల రోజుల నుంచి స్లాట్‌ బుక్‌ కావడం లేదని, ఇంట్లోనే పత్తిని నిల్వ చేసుకుని అమ్ముకోలేకపోతున్నాని రాము ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ పరిస్థితి ఉమ్మడి జిల్లాలోని దాదాపు 3లక్షల మంది రైతులు ఎదుర్కొంటున్నారు.

ఫ రాష్ట్రంలోనే పత్తి సాగులోనే మొదటి స్థానం.. 7 లక్షల ఎకరాల్లో పత్తి సాగు :

కేంద్ర ప్రభుత్వం క్వింటం పత్తికి రూ.8,110 మద్దతు ధరను ప్రకటించింది. దీంతో రైతులు ఖరీఫ్‌లో పెద్ద ఎత్తున పత్తి పంటను సాగు చేశారు. కర్నూలు జిల్లాలో 6,71,064 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేయగా.. నంద్యాల జిల్లాలో మరో 30వేల ఎకరాల్లో పత్తి పంటను సాగు చేశారు. రాష్ట్రంలోనే కర్నూలు జిల్లా పత్తి సాగులో ఈసారి మొదటి స్థానంలో నిలిచింది. ముందస్తు వర్షాలకు రైతులు మే చివరి వారంలోనే పత్తిని సాగు చేశారు. ప్రస్తుతం పెద్ద ఎత్తున రైతుల వద్ద పత్తి నిల్వ ఉంది. 5 క్వింటాళ్ల దిగుబడి మేరకు 7 లక్షల ఎకరాలకు 35 లక్షల క్వింటాళ్ల పత్తి రైతులు ఈసారి పండించారు. సీసీఐ సంస్థ రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేయడంలో మొదటి నుంచి ఆటంకాలు పెడుతూనే వస్తుంది. రెండు నెలల క్రితమే రైతుల చేతికి పత్తి అందినా సీసీఐ అధికారులు మాత్రం అదిగో.. ఇదిగో అంటూ కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో తాత్సారం చేస్తూ వచ్చారు. చివరికి రైతుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో మంత్రులు, ఎమ్మెల్యేల ఒత్తిళ్ల మేరకు సీసీఐ కొనుగోలు కేంద్రాలను గత నెల ఏర్పాటు చేసింది. రాష్ట్రం మొత్తం మీద పత్తి కొనుగోలుకు సీసీఐ అధికారులు 30 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. అందులో 20 కేంద్రాలు ఉమ్మడి జిల్లాలోనే ఉన్నాయి. అయితే.. అవన్నీ కాగితాలకే పరిమితమైపోయాయి. కర్నూలు జిల్లాలో 20 కేంద్రాలకు గాను కేవలం 11 కొనుగోలు కేంద్రాలను మాత్రమే ఏర్పాటు చేశారు. ఆదోని మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరులో సీసీఐ అధికారులు పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుంచి పత్తి కొనుగోళ్లను ప్రారంభించారు. అయితే ఇంకా 9 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకుండానే చేతులెత్తేశారు. నంద్యాల జిల్లాలో కేవలం ఒకే ఒక్క కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

ఫ నామ మాత్రంగానే కొనుగోళ్లు:

రైతులు ఖరీప్‌లో పెద్ద ఎత్తున పత్తి పంటను సాగు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ యంత్రాంగం ముందుగానే అంచనా వేసింది. అయితే అంచనాలకు తగ్గట్లుగా సీసీఐ అధికారులు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేకపోయారు. కర్నూలు జిల్లాలో ఆదోని నియోజకవర్గంలో 73,271 ఎకరాల్లో పత్తి పంట సాగైంది. ఆలూరులో 19,635 ఎకరాలు, ఆస్పరిలో 50,743 ఎకరాలు, సీ.బెళగల్‌లో 25,568 ఎకరాలు, చిప్పగిరిలో 12,028 ఎకరాలు, దేవనకొండలో 54,659 ఎకరాలు, గోనెగండ్లలో 35,190 ఎకరాలు, గూడూరులో 20,116 ఎకరాలు, హాలహర్విలో 9,966 ఎకరాలు, హొళగుందలో 36,693 ఎకరాలు, కల్లూరులో 20,456 ఎకరాలు, కోడుమూరులో 18,055 ఎకరాలు, కోసిగిలో 30,348 ఎకరాలు, కౌతాళంలో 59,697 ఎకరాలు, క్రిష్ణగిరిలో 24,056 ఎకరాలు, కర్నూలు రూరల్‌లో 15,203 ఎకరాలు, మంత్రాలయంలో 28,891 ఎకరాలు, నందవరంలో 44,241 ఎకరాలు, ఓర్వకల్లులో 5,652, పత్తికొండలో 20,320 ఎకరాలు, పెద్దకడుబూరులో 24,276 ఎకరాలు, ఎమ్మిగనూరులో 39,657 ఎకరాలు, వెల్దుర్తిలో 8,847 ఎకరాలు మొత్తం కర్నూలు జిల్లాలో 6,71,064 ఎకరాల్లో పత్తి పంటను రైతులు సాగు చేశారు. నంద్యాల జిల్లాలో మరో 30వేల ఎకరాల్లో పత్తి పంట సాగైంది. ఎకరాకు 5 క్వింటాళ్ల చొప్పున 35 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి రాగా, ఇప్పటి దాకా సీసీఐ అధికారులు రైతుల నుంచి కొనుగోలు చేసింది కేవలం 40 వేల క్వింటాళ్ల పత్తిని మాత్రమే. సవాలక్ష ఆటంకాల మధ్య సీసీఐ కేంద్రాల్లో రైతులు పత్తిని అమ్ముకోలేకపోయారు. ఓ వైపు అప్పు ఇచ్చిన వాళ్ల ఒత్తిడి, ఇంకో వైపు అధిక వర్షాల కారణంగా.. మరో దారి లేక రైతులు గ్రామాల్లోని వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. దాదాపు 5లక్షల క్వింటాళ్ల పత్తిని అమ్ముకున్నారు..: రైతులు చాలా మంది సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుంటే.. ప్రభుత్వం నిర్ణయించిన క్వింటానికి రూ.8,100 నుంచి రూ.7,500 దాకా చేతికి లభిస్తుందని రైతులు ఇళ్లలోనే పత్తిని బస్తాల్లో నింపి దాచుకున్నారు.

ఫ కపాస్‌ కిసాన యాప్‌తో తంటాలు:

గత సంవత్సరం కేవలం ఈక్రాప్‌ యాప్‌లోనే రైతులు పత్తి వివరాలను నమోదు చేసి సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకున్నారు. ఈసారి ఏదో విధంగా రైతుల నుంచి తక్కువ మొత్తంలోనే పత్తిని కొనుగోలు చేయాలనే తలంపుతో సీసీఐ అదికారులు రైతులకు రకరకాల ఆటంకాలను సృష్టిస్తూ వచ్చారు. కొత్తగా కపాస్‌ కిసాన యాప్‌ను అమలులోకి తెచ్చారు. రైతులు నేరుగా కొనుగోలు కేంద్రాలకు పత్తిని తీసుకుని అమ్మే అవకాశం లేదని, ఈ యాప్‌లో ముందుగా స్లాట్‌ బుక్‌ చేసుకున్న తర్వాతే ఖరారు చేసిన తేదీలో కొనుగోలు కేంద్రానికి పత్తిని తీసుకెళ్లి అమ్మాలని అధికారులు ఆదేశించడంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల్లో సర్వర్‌ సక్రమంగా పని చేయకపోవడంతో అధికారులు నిర్ణయించిన సమయం ఉదయం 10 గంటలకు, కపాస్‌ కిసాన యాప్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకునే అవకాశం లేకుండా పోయింది. గ్రామ రైతు సేవా కేంద్రాల వద్ద రైతులు పనులు విడిచిపెట్టి కేంద్రాల వద్దే గంటల తరబడి కళ్లు కాయలు కాచేలా ఎదురు చూడాల్సి వస్తున్నది. కొన్నిసార్లు స్లాట్‌ బుక్‌ చేసుకున్నా కొనుగోలు కేంద్రాల వద్ద ఆ వివరాలను చూపిస్తే స్లాట్‌ బుక్‌ చేసినా రద్దయిందని, మళ్లీ వెళ్లి స్లాట్‌ బుక్‌ చేసుకోవాలని చెప్పారు. రవాణా ఖర్చులు భరించే శక్తి లేక అక్కడే ఉన్న జిన్నింగ్‌ మిల్లులో క్వింటం పత్తిని రూ.6వేల నుంచి రూ.6,500లకే అమ్ముకుని నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక్కోసారి కొనుగోలు కేంద్రాలు పని చేయకుండా ఉండటంతో రైతులు వెనుదిరిగి రాలేక కొనుగోలు కేంద్రాల వద్దే కాచుక్కూర్చున్న వ్యాపారులకు తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు.

ఫ సీఎం, ఉన్నతాధికారులు చెప్పినా డోంట్‌ కేర్‌ - సీసీఐ:

ముఖ్యమంత్రి చంద్రబాబు మొదలుకుని మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌ విజయసునీత, జిల్లా ఉన్నతాధికారులు ఎన్నోసార్లు రైతుల వద్ద ఉన్న పత్తి 14 శాతం తేమ ఉన్నా కొనుగోలు చేయాలని సీసీఐ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎవరెంత చెప్పినా తమ నిబంధనల మేరకే పత్తిని కొంటామని సీసీఐ అధికారులు భీష్మించడంతో రైతులు నష్టపోతున్నారు. సీసీఐ కేంద్రాల వద్ద ప్రస్తుతం పత్తిలో 8 నుంచి 12 శాతం తేమ ఉంటేనే కొనుగోలు చేస్తున్నారు. ప్రకృతి విపత్తులతో తమకు సంబంధం లేదని తేల్చి చెబుతున్నారు. కొన్ని కేంద్రాల్లో కలెక్టర్‌ ఆదేశాల మేరకు నామ్‌కే వాస్తేగా సీసీఐ అధికారులు 14 శాతం తేమ ఉన్నా రైతుల పరిస్థితిని అర్థం చేసుకుని కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం రైతుల వద్ద ఇంకా 30 లక్షల క్వింటాళ్ల మేర పత్తి నిల్వ ఉంది. సీసీఐ అధికారులు ప్రభుత్వ ఒత్తిడి మేరకు నిబంధనలను సడలించి తేమ శాతాన్ని 14 శాతం వరకు పరిగణనలోకి తీసుకుంటుందని, అప్పుడైనా పత్తిని అమ్ముకుని మద్దతు ధర పొందుదామని రైతులు ఇళ్లలోనే పత్తి సంచులు నిల్వ చేసి ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఫ 14 శాతం తేమ ఉన్నా కొనుగోలు చేస్తామని సీసీఐ చెప్పింది - నారాయణమూర్తి, ఏడీఎం:

అధిక వర్షాల వల్ల రైతులకు ఈసారి దిగుబడి బాగా తగ్గింది. కర్నూలు జిల్లాలో 11 కొనుగోలు కేంద్రాలు, నంద్యాల జిల్లాలో ఒకటి కేంద్రాన్ని సీసీఐ అధికారులు ఏర్పాటు చేశారు. 8 నుంచి 11 శాతం తేమ ఉంటే సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేశారు. ప్రభుత్వం ఒత్తిడి మేరకు ప్రస్తుతం 14 శాతం తేమ ఉన్నా రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. కపాస్‌ కిసాన యాప్‌ వల్ల రైతులు ఇబ్బందులు పడలేక వ్యాపారులకే ఎక్కువ మొత్తంలో పత్తిని అమ్ముకుంటున్నారు. త్వరలోనే ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు 14 శాతం తేమ ఉంటే కూడా పత్తిని కొనుగోలు చేసేందుకు సీసీఐ అధికారులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తక్కువ తూకాలు వేసి రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేసే వ్యాపారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తున్నాం.

Updated Date - Nov 28 , 2025 | 11:06 PM