Tirumala: టీటీడీకి భాష్యం కన్‌స్ట్రక్షన్స్ రూ.కోటి విరాళం
ABN , Publish Date - Nov 02 , 2025 | 05:22 AM
తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన భవనంలోని ప్రధాన వంటశాలలో దాదాపు రూ.కోటి వ్యయంతో అధునాతన వంట పరికరాలు ఏర్పాటుకానున్నాయి.
నెలలో వెంగమాంబ అన్నప్రసాద భవనానికి కొత్త పాత్రలు
తిరుమల, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన భవనంలోని ప్రధాన వంటశాలలో దాదాపు రూ.కోటి వ్యయంతో అధునాతన వంట పరికరాలు ఏర్పాటుకానున్నాయి. వంటశాలలో ప్రస్తుతం 22 స్టీమ్ బాయిలర్స్ ఉన్నాయి. దాదాపు 15 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన వీటి పనితీరు మందగించింది. పైగా నిత్యం మరమ్మతులకు గురవుతున్న క్రమంలో టీటీడీ నూతన వంటపాత్రల(వెసెల్స్) ఏర్పాటుకు నిర్ణయించింది. ఈ క్రమంలోనే భాష్యం కన్‌స్ట్రక్షన్స్ సంస్థ వీటి ఏర్పాటుకు ముందుకు వచ్చింది. 500 లీటర్ల వెసెల్స్ 8, రూ.300 లీటర్ల వెసెల్స్ 14 కొనుగోలుకు దాదాపు రూ.కోటి వరకు ఖర్చవుతుండగా, ఈ మొత్తాన్ని భాష్యం కన్‌స్ట్రక్షన్స్ విరాళంగా ప్రకటించడంతో పాటు ఆ సంస్థే తయారుచేసి టీటీడీకి అందజేయనుంది. ఇందులో భాగంగా టీటీడీ ఇంజనీరింగ్ విభాగం నుంచి ఇప్పటికే కొలతలు, అవసరమైన టెక్నాలజీ వంటి వివరాలను ఆ సంస్థ సేకరించి బెంగుళూరులో వెసెల్స్ ను తయారు చేయిస్తోంది. నెల రోజుల్లో నూతన వంటపాత్రలు టీటీడీకి అందనున్నాయి.
తొలుత తాత్కాలిక వంటశాల ఏర్పాటు
ప్రస్తుతం వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఉన్న ప్రధాన వంటశాలను రానున్న ఇరవై ఏళ్లకు ఉపయోగపడేలా ఆధునికీకరించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో అన్నప్రసాదాల వితరణకు ఆటంకం కలగకుండా భవనం వెలుపల తాత్కాలిక వంటశాల ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. నూతన వెసెల్స్‌ను తొలుత ఇందులో ఏర్పాటు చేసి, వాటి పనితీరు బాగుంటే ప్రధాన శాశ్వత వంటశాలలో ఏర్పాటు చేస్తారు.