Health Commissioner: డాక్యుమెంట్లే ముఖ్యం
ABN , Publish Date - Aug 06 , 2025 | 05:45 AM
నిటేషన్ కంపెనీలపై వచ్చిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకోమని, కేవలం టెండర్ బిడ్లలో దాఖలు చేసిన డాక్యుమెంట్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని ఆరోగ్యశాఖ కమిషనర్, ఏపీఎంఎస్ఐడీసీ ఇన్‌చార్జి ఎండీ వీరపాండియన్ స్పష్టం చేశారు.
కంపెనీలపై ఆరోపణలను పరిగణనలోకి తీసుకోలేం
శానిటేషన్ టెండర్లపై ఆరోగ్య కమిషనర్ వివరణ
అమరావతి, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): శానిటేషన్ కంపెనీలపై వచ్చిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకోమని, కేవలం టెండర్ బిడ్లలో దాఖలు చేసిన డాక్యుమెంట్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని ఆరోగ్యశాఖ కమిషనర్, ఏపీఎంఎస్ఐడీసీ ఇన్‌చార్జి ఎండీ వీరపాండియన్ స్పష్టం చేశారు. శానిటేషన్ టెండర్లపై భారీగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. డీఎంఈ, సెకండరీ హెల్త్ పరిధిలో ఉన్న 133 ఆస్పత్రుల్లో శానిటేషన్ పనులు చేసేందుకు టెండర్లు ఆహ్వానించామన్నారు. మొత్తం 6 ప్యాకేజీలకు టెండర్లు పిలవగా డీఎంఈకి 5 కంపెనీలు, సెకండరీ హెల్త్‌కు 5 కంపెనీలు అర్హత సాధించాయని తెలిపారు. టెండర్ నిబంధనలకు లోబడే బిడ్లను పరిశీలించి, కంపెనీలకు అర్హత కల్పించామని తెలిపారు. 2021లో టెండర్లు దక్కించుకున్న కంపెనీలే అర్హత సాధించాయని.. ప్రస్తుతం పనులు నిర్వహిస్తున్న కంపెనీలపై అనేక ఆరోపణలున్నాయని విలేకరులు ప్రస్తావించగా.. ప్రభుత్వం బ్లాక్‌లిస్ట్ చేసిన కంపెనీలే టెండర్లల్లో పాల్గొన్నాయన్న విషయం తమకు తెలియదన్నారు. కొన్ని కంపెనీలు కోర్టుల నుంచి స్టే తెచ్చుకున్నట్లు తెలిపారు. కొన్ని కంపెనీలు శానిటేషన్ వర్కర్లకు, సూపర్‌వైజర్లకు సక్రమంగా జీతాలు చెల్లించడం లేదని, దీనిపై కలెక్టర్లు ఫిర్యాదు చేశారని, అవే కంపెనీలకు టెండర్లు కట్టబెడితే వర్కర్ల జీతాలు, ఈఎస్‌ఐ, పీఎ్‌ఫ చెల్లించే విషయంలో ఎవరు బాధ్యత తీసుకుంటారని ప్రశ్నించగా.. అప్పటి పరిస్థితి ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పొరుగురాష్ట్రంలో టెర్మినేట్ అయిన, ఏపీలో సక్రంగా సేవలు అందించని సంస్థల బిడ్లను పరిగణనలోకి తీసుకోవడంపై స్పందిస్తూ.. టెండర్లు దక్కించుకున్న తర్వాత సేవలు సరిగా అందించలేరన్న ఆరోపణలపై ఏమీ చేయలేమని చెప్పారు. ఇప్పటి వరకూ కొన్ని కంపెనీలు ఇచ్చిన వివరణలు, ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని.. మరోసారి చెక్ చేసుకున్నామన్నారు. శానిటేషన్ టెండర్లలో పోటీ పెంచడానికే తొలుత టెండర్లు రద్దు చేశామని, సెక్యూరిటీ టెండర్లలో ఆ అవసరం రాలేదని ఆయన సమర్థించుకున్నారు.