Rice Pulling Scam: రైస్ పుల్లింగ్ పేరుతో వైద్యురాలికి టోకరా
ABN , Publish Date - Oct 25 , 2025 | 06:23 AM
రైస్ పుల్లింగ్ పేరుతో వైద్యురాలికి టోకరా వేసి రూ.1.5 కోట్లు కొల్లగొట్టిన ముగ్గురు కేటుగాళ్లను విశాఖ పోలీసులు అరెస్టు చేసి, రిమాండుకు తరలించారు.
రూ.1.5 కోట్లు కొల్లగొట్టిన కేటుగాళ్లు
ముగ్గురి అరెస్ట్.. రిమాండుకు తరలింపు
మిగిలిన నిందితుల కోసం గాలింపు
ఆరిలోవ (విశాఖపట్నం), అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): రైస్ పుల్లింగ్ పేరుతో వైద్యురాలికి టోకరా వేసి రూ.1.5 కోట్లు కొల్లగొట్టిన ముగ్గురు కేటుగాళ్లను విశాఖ పోలీసులు అరెస్టు చేసి, రిమాండుకు తరలించారు. ఈ వివరాలను ద్వారకా ఏసీపీ నరసింహమూర్తి శుక్రవారం ఆరిలోవ పోలీస్ స్టేషన్‌లో విలేకరులకు వివరించారు. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ ప్రియాంకకు సత్యసాయి జిల్లా పుట్టపర్తికి చెందిన ఒక మహిళ పరిచయమైంది. విశాఖలో తనకు తెలిసిన వారి వద్ద అద్భుతమైన చెంబు ఉందని, దాని విలువ విదేశాల్లో రూ.కోట్లలో ఉంటుందని, అత్యవసరంగా దానిని విక్రయిస్తున్నారని తెలిపింది. వైద్యురాలు విశాఖ వచ్చి జేపీ మోర్గాన్ సంస్థకు చెందిన సైంటిస్టు పేరుతో చలామణి అవుతున్న వ్యక్తి వద్ద చెంబును మెటల్ డిటెక్టర్‌తో పరీక్షించారు. అది బియ్యాన్ని ఆకర్షించడంతో ప్రియాంకకు నమ్మకం కుదిరింది. దీంతో ఆమె కేటుగాళ్ల బృందానికి దఫదఫాలుగా సుమారు రూ.1.5 కోట్లను చెల్లించారు. చెంబు తీసుకుని హైదరాబాద్ చేరుకున్న ఆమె దానికి ఎలాంటి మహిమలూ లేవని తెలుసుకుని, మోసపోయానని గ్రహించారు. ఈ నేపథ్యంలో కేటుగాళ్ల బృందం ఆరిలోవ ప్రాంతంలో మకాం వేసినట్టు తెలుసుకుని, ఈ నెల 19న ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాలతో కేసును ఛేదించేందుకు ఆరిలోవ సీఐ మల్లేశ్వరరావు బృందం రంగంలోకి దిగింది. పెందుర్తికి చెందిన వి.నివాస్, అరకులోయకు చెందిన కొర్రా బంగార్రాజును ఆరిలోవ డంపింగ్ యార్డు వద్ద, విజయవాడకు చెందిన కర్నాటి ప్రసాద్‌ను విమ్స్ ప్రధాన గేటు వద్ద అరెస్ట్ చేశారు. ఈ ముఠాలోని ప్రధాన నిందితుడు హరికృష్ణ కోసం గాలిస్తున్నామన్నారు నిందితుల నుంచి రూ.2.4 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని, వారి బ్యాంకు ఖాతాలను సీజ్ చేశామన్నారు.