Speaker Ayyanna Patrudu: అసెంబ్లీకి వచ్చి మాట్లాడే దమ్ము, ధైర్యం లేవా
ABN , Publish Date - Sep 09 , 2025 | 06:15 AM
అసెంబ్లీకి వచ్చి మాట్లాడే దమ్ము, ధైర్యం లేవా? అని వైసీపీ అధినేత జగన్‌ని, ఆ పార్టీ ఎమ్మెల్యేలను స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు.
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు స్పీకర్ అయ్యన్న ప్రశ్న
ప్రతిపక్షంగా గుర్తించే అధికారం నాకు లేదు
నర్సీపట్నం, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీకి వచ్చి మాట్లాడే దమ్ము, ధైర్యం లేవా? అని వైసీపీ అధినేత జగన్‌ని, ఆ పార్టీ ఎమ్మెల్యేలను స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ప్రతిపక్ష హోదా ఇచ్చే అధికారం స్పీకర్‌కు ఉందని వైసీపీ వాళ్లు అంటున్నారు. దేవాలయం వంటి అసెంబ్లీలో నేను పూజారి వంటి వాడిని. నాకు ఆ అధికారం లేదు. వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ప్రతిపక్ష హోదాకు ఆ సంఖ్య సరిపోదు. అసెంబ్లీ ఏర్పడి 15 నెలలు కావస్తోంది. జగన్ ఒక్కసారి కూడా అసెంబ్లీకి రాలేదు. రోజూ ప్రెస్‌లో మాట్లాడుతున్నట్టే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి. నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడతారనే ప్రజలు ఓట్లేసి ఆ 11 మందిని ఎన్నుకున్నారు. ప్రభుత్వం ఏమైనా తప్పులు చేస్తే అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే సరి చేసుకుంటుంది’ అని అయ్యన్న స్పష్టం చేశారు.