Andhra Pradesh Sports Authority: శాప్ పేరుతో ఫేక్ కాల్స్ నమ్మొద్దు
ABN , Publish Date - Aug 13 , 2025 | 06:50 AM
మెగా డీఎస్సీ-2025 అఽభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) నుంచి చేస్తున్నామంటూ కొన్ని నకిలీ ఫోన్ కాల్స్ వస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని...
డీఎస్సీ అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాలి
విజయవాడ(స్పోర్ట్స్), ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీ-2025 అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) నుంచి చేస్తున్నామంటూ కొన్ని నకిలీ ఫోన్ కాల్స్ వస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, దీనిపై అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని ఆ సంస్థ చైర్మన్ రవినాయుడు, ఎండీ అజయ్ జైన్ సూచించారు. అలాంటి కాల్స్‌పై సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు తమ దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటామని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌లో 3 శాతం స్పోర్ట్స్ రిజర్వేషన్ కింద 421 ఉపాధ్యాయ ఉద్యోగుల భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రాథమిక తాత్కాలిక ప్రాధాన్యతా జాబితా ఇప్పటికే విడుదలైందని వారు తెలిపారు. శాప్ నుంచి మాట్లాడుతున్నామని, పోస్టింగ్ కోసం ‘ఫార్మాలిటీస్’ ఇవ్వాలంటూ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కొంతమంది ఫోన్లు చేసి అడుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. డీఎస్సీ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతుందని, శాప్ నుంచిఎవరికీ, ఎలాంటి ఫోన్లు రావని స్పష్టం చేశారు.