Deputy CM DK Shivakumar: పోతే పొండి..
ABN , Publish Date - Sep 20 , 2025 | 07:06 AM
పారిశ్రామికవేత్తలు ఎవరైనా బెంగళూరును వీడాలని అనుకుంటే వెళ్లిపోవచ్చని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు
ఏపీలో జనం లేరు.. అందుకే పిలుస్తున్నారు: డీకే
బెంగళూరు, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): పారిశ్రామికవేత్తలు ఎవరైనా బెంగళూరును వీడాలని అనుకుంటే వెళ్లిపోవచ్చని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. నాసిరకం రహదారుల కారణంగా ఇబ్బంది పడుతున్నామని, బెంగళూరును వీడతామని బ్లాక్ బక్ కంపెనీ సీఈవో రాజేశ్ యబాది ఎక్స్‌లో పెట్టిన పోస్టు, తదనంతర పరిణామాలపై ఆయన గురువారం స్పందించారు. ‘ఇక్కడి పారిశ్రామికవేత్తలను ఏపీ ప్రభుత్వం తమ దగ్గరకు ఆహ్వానిస్తోంది కదా?’ అని విలేకరులు ప్రశ్నించగా, ఏపీలో జనం లేరని....అందుకే పిలుస్తున్నారని వ్యాఖ్యానించారు. ‘‘గుంతలు అనేవి పెద్ద సమస్య కాదు. వర్షం వస్తున్నందున ఇలాంటి సమస్య తలెత్తుతోంది’’ అని శివకుమార్ అన్నారు. ఈ అంశంపై సీఎం సిద్దరామయ్య శనివారం ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించనున్నారని తెలిపారు. వ్యాపారం చేయడం ద్వారా లాభాలు ఆర్జించేవారే బెంగళూరులో ఉంటారన్నారు. ‘‘బెంగళూరులోనే ఎందుకు మల్టీనేషన్ కం పెనీలు ఉన్నాయి..? కాలిఫోర్నియాలో ఇంజనీర్లు కేవలం రూ.13 లక్షలకు పనిచేస్తున్నారు.
కానీ బెంగళూరులో రూ.25 లక్షలు తీసుకుంటున్నారు. ఇక్కడ మౌలిక సదుపాయాలు, అన్ని సౌలభ్యాలూ ఉన్నందుకే ఇంతమంది ఉన్నారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. గుంతల విషయంలో కుట్రలు జరుగుతున్నాయని, విద్యార్థులతో కొందరు ప్రధానమంత్రికి లేఖలు రాయిస్తారని, ఇదో పెద్ద సమస్య అన్నట్లు వ్యవహరిస్తున్నారని తెలిపారు. కాగా, బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్డులో ప్రయాణం కష్టంగా ఉందని, ఇక్కడి నుం చి వెళ్లిపోతామని మూడు రోజుల క్రితం ఎక్స్‌లో పోస్టు పెట్టిన బ్లాక్ బక్ సీఈవో రాజేశ్ యూటర్న్ తీసుకున్నారు. బెంగళూరు తన సొంతూరు అని, ఇక్కడే మరో ప్రాంతానికి మారుతామని శుక్రవారం తెలిపారు.
మేం ‘బ్లాక్‌మెయిల్’గా చూడం: లోకేశ్
బెంగళూరులో గుంతల విషయంలో ప్రభుత్వాన్ని బెదిరించలేరంటూ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’లో స్పందించారు. ‘‘ఎవరైనా సమస్యలతో వస్తే ఇతరుల్లా మేం వ్యవహరించం. వాటిని ‘బ్లాక్‌మెయిల్’గా కొట్టివేయబోం. వారిని గౌరవించి, సమస్యలకు ప్రాధాన్యం ఇస్తాం’’ అని లోకేశ్ తెలిపారు.