దివ్యాంగులందరికీ యథావిధిగా పెన్షన్లు: సెర్ప్
ABN , Publish Date - Aug 27 , 2025 | 04:46 AM
దివ్యాంగులందరికీ సెప్టెంబరులో యథావిధిగా పెన్షన్లు అందుతాయని, దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సెర్ప్ అధికారులు స్పష్టం చేశారు.
13న ఇచ్చిన నోటీసులు నిలుపుదల
వారందరికీ మళ్లీ మెసేజ్‌లు.. స్పష్టత ఇచ్చిన సెర్ప్ అధికారులు
అమరావతి, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): దివ్యాంగులందరికీ సెప్టెంబరులో యథావిధిగా పెన్షన్లు అందుతాయని, దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సెర్ప్ అధికారులు స్పష్టం చేశారు. పింఛను నిలిపివేస్తున్నామంటూ పలువురు దివ్యాంగులకు ఇటీవల నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో.. ‘ఆందోళన వద్దు, పెన్షన్ వస్తుంది’ అని భరోసా ఇస్తూ మంగళవారం నుంచి వారందరికీ మెసేజ్‌లు పంపుతున్నారు. దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించి ఇటీవల సదరం సర్టిఫికెట్లు రీవెరిఫికేషన్ చేశారు. అందులో 40 శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్న వారికి సెప్టెంబరు నుంచి పెన్షన్ నిలిపేస్తున్నట్లు నోటీసులు ఇచ్చారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరగడంతో సెర్ప్ అధికారులతో సీఎం చంద్రబాబు చర్చించారు. సెప్టెంబరులో యథావిధిగా పెన్షన్లు పంపిణీ చేయాలని సీఎం ఆదేశించడంతో ఆమేరకు అధికారులు చర్యలు తీసుకున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం దివ్యాంగుల పింఛన్లపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ చైర్మన్ నారాయణస్వామి ఆరోపించారు.
బోగస్ దివ్యాంగ పింఛన్ల ఏరివేత మంచిదే: షర్మిల
దివ్యాంగుల ముసుగులో తీసుకుంటున్న బోగస్ పింఛన్లను గుర్తించి ఏరివేయడం మంచిదేనని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. అయితే, ఈ రీ-వెరిఫికేషన్ పేరిట అర్హులను సైతం అనర్హులుగా పరిగణించి, వారి పొట్టకొట్టడం దుర్మార్గమని మంగళవారం ఆమె ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం నోటీసులు ఇచ్చిన లక్షా ఇరవై వేల మందిలో అర్హులే ఎక్కువమంది ఉన్నారని తెలుస్తోందని షర్మిల తెలిపారు. అనర్హులుగా గుర్తించిన జాబితాపై మళ్లీ వెరిఫికేషన్ చేయాలని డిమాండ్ చేశారు. దొంగ సర్టిఫికెట్లు తీసుకున్న వాళ్లపైనా, సర్టిఫికెట్లు జారీ చేసిన వైద్యులపైనా కఠిన చర్యలు తీసుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు.
