Weather Alert: బలహీనపడిన దిత్వా తుఫాన్
ABN , Publish Date - Dec 01 , 2025 | 04:54 AM
మూడు రాష్ట్రాలను దడ పుట్టించిన ‘దిత్వా’ తుఫాన్ బలహీనపడింది. ఉత్తర దిశ నుంచి వీస్తున్న పొడి చలిగాలులు, సముద్రంలో తుఫాన్ పరిసరాల్లో ఉన్న మేఘాలు...
అయినా పూర్తిగా తొలగని ముప్పు
ఉత్తర తమిళనాడుకు సమీపంలో తీవ్ర వాయుగుండంగా కేంద్రీకృతం
నేడు దక్షిణ కోస్తాంధ్రకు వచ్చి మరింత బలహీనం
కోస్తా, సీమలకు భారీ వర్ష సూచన
నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు రెడ్ అలర్ట్
అన్నదాతల్లో ఆందోళన
దక్షిణ కోస్తా రేవుల్లో 3వ నంబరు హెచ్చరిక
అమరావతి, విశాఖపట్నం, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): మూడు రాష్ట్రాలను దడ పుట్టించిన ‘దిత్వా’ తుఫాన్ బలహీనపడింది. ఉత్తర దిశ నుంచి వీస్తున్న పొడి చలిగాలులు, సముద్రంలో తుఫాన్ పరిసరాల్లో ఉన్న మేఘాలు విచ్ఛిన్నం కావడంతో ఆదివారం సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. శనివారం రాత్రి నుంచి తమిళనాడుకు సమాంతరంగా పయనించి ఆదివారం మధ్యాహ్నానికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరికి చేరువగా వచ్చింది. ఆ తరువాత వాతావరణం అనుకూలించకపోవడంతో మధ్యాహ్నం నుంచి జోరు తగ్గింది. అయితే తుఫాన్ ఆవరించిన ప్రాంతం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరికి మరింత చేరువై వాయుగుండంగా మారుతుందని భారత వాతావరణశాఖ తెలిపింది. ఈ క్రమంలో తీవ్ర వాయుగుండంగా మారి సాయంత్రానికి పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 90, చెన్నైకు దక్షిణ ఆగ్నేయంగా 140 కి.మీ.ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఆదివారం రాత్రి లేదా సోమవారం ఉదయానికి పుదుచ్చేరికి 20, చెన్నైకు 40 కి.మీ. దూరంలో సముద్రంలోకి రానున్నదని తెలిపింది. ఉత్తర దిశ నుంచి తుఫాన్ వైపుగా పొడి చలిగాలులు రావడం, తుఫాన్ పరిసరాల్లో మేఘాలు విచ్ఛిన్నం కావడంతో దాని తీవ్రత తగ్గిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆదివారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడిందని ఇస్రో వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. తీవ్ర వాయుగుండం సోమవారం ఉదయానికి వాయుగుండంగా బలహీనపడినా... చెన్నైకు చేరువగా రానున్నందున మేఘాలు ఉత్తర తమిళనాడు, దానికి ఆనుకుని దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ వైపుగా రానున్నాయి. దీంతో వర్షాలు పెరగనున్నాయి. రానున్న 24గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
చలిగాలులు.. చిరుజల్లులు
తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మేఘాలు ఆవరించి చలిగాలులు వీస్తున్నాయి. ఆదివారం ఉదయం నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ ఉత్తర తమిళనాడుకు మరింత చేరువగా రానున్న నేపథ్యంలో రాత్రి నుంచి వర్షాలు పెరుగుతాయని, సోమవారం ఉదయం 8గంటల వరకు కోస్తా, రాయలసీమలో అనేకచోట్ల వర్షాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడా కుంభవృష్టి వర్షాలు, బాపట్ల, తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాల్లో అతిభారీ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, నంద్యాల, శ్రీసత్యసాయి, నంద్యాల, అనంతపురం జిలాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ, విపత్తుల నిర్వహణ శాఖలు తెలిపాయి. మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లరాదని, రైతులు పంటల ఉత్పత్తుల రక్షణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణశాఖ సూచించింది. కృష్ణపట్నం, నిజాంపట్నం, ఓడరేవు, మచిలీపట్నం ఓడరేవుల్లో మూడో నంబరు, కోస్తాలో మిగిలిన రేవుల్లో రెండో నంబరు భద్రతా సూచికలు ఎగురవేశారు. కాగా, ఆదివారం ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు కావలిలో 103.5, కావలి దరి అరుంధతి పురంలో 84.5, జలదంకిలో 66.25, చామదాలలో 63.0 మి.మీ.ల వర్షపాతం నమోదైంది.
మరో 48 గంటలు అలర్ట్‌గా ఉండాలి: హోంమంత్రి అనిత
అమరావతి, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): దిత్వా తుఫాన్ పట్ల ఆది, సోమవారాల్లో అధికారులు మరింత అలర్ట్‌గా ఉండాలని హోం మంత్రి అనిత స్పష్టం చేశారు. ఆదివారం రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ నుంచి తుఫాన్ పరిస్థితిని మంత్రి సమీక్షించారు. తుఫాన్ ప్రభావం ఉండే నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘తుఫాన్ వల్ల ప్రాణ నష్టం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిది. క్షేత్రస్థాయిలో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి. ప్రమాదకర ప్రదేశాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులను నియమించాలి. విద్యుత్ అంతరాయం కలిగితే వెంటనే పునరుద్ధరించాలి’ అని ఆదేశించారు. కాగా, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని అధికారులు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కోరారు. దిత్వా తుఫాను నేపథ్యంలో ఆదివారం ఆయన దక్షిణ కోస్తా, రాయలసీమ విద్యుత్తు శాఖ అధికారులతో టెలికాన్ఫెరెన్స్ నిర్వహించారు. అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరించాలన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని ఆదేశించారు.