Share News

చెదిరిన కలలు

ABN , Publish Date - Jul 02 , 2025 | 01:32 AM

వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఇద్దరు కష్టపడి చదువుకున్నారు. పీజీ పట్టాలు అందుకుని ఫార్మా కంపెనీలో కొలువులు సాధించారు. విఽధుల్లో ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. జీవితాంతం ఒక్కటిగా ఉండాలని భావించారు. పెద్దల అనుమతితో పెళ్లి పీటలు ఎక్కాలనుకున్నారు. వారు నిరాకరించడంతో కొద్దిరోజుల కిందటే తిరుపతిలో వివాహం చేసుకున్నారు. తిరువూరు ఎమ్మెల్యే చొరవతో చివరకు పెద్దలను ఒప్పించారు. ఆషాఢం తర్వాత విందు కార్యక్రమాలు అనుకోవడంతో ఆనందంగా ఉన్నారు. వీరి ఆనందాన్ని తెలంగాణలోని పాశమైలారంలో సిగాచి ఫార్మా కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాదం ఆవిరి చేసింది. నవ దంపతులను పొట్టన పెట్టుకుంది. ఇరు కుటుంబాల్లో విషాదం నింపింది.

చెదిరిన కలలు

హైదరాబాద్‌లోని సిగాచి ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం

ప్రేమ వివాహం చేసుకున్న నవ దంపతులు దుర్మరణం

ఎన్టీఆర్‌ జిల్లా పుట్రేలలో విషాదం

కంటతడి పెట్టుకున్న ఎమ్మెల్యే కొలికపూడి

వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఇద్దరు కష్టపడి చదువుకున్నారు. పీజీ పట్టాలు అందుకుని ఫార్మా కంపెనీలో కొలువులు సాధించారు. విఽధుల్లో ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. జీవితాంతం ఒక్కటిగా ఉండాలని భావించారు. పెద్దల అనుమతితో పెళ్లి పీటలు ఎక్కాలనుకున్నారు. వారు నిరాకరించడంతో కొద్దిరోజుల కిందటే తిరుపతిలో వివాహం చేసుకున్నారు. తిరువూరు ఎమ్మెల్యే చొరవతో చివరకు పెద్దలను ఒప్పించారు. ఆషాఢం తర్వాత విందు కార్యక్రమాలు అనుకోవడంతో ఆనందంగా ఉన్నారు. వీరి ఆనందాన్ని తెలంగాణలోని పాశమైలారంలో సిగాచి ఫార్మా కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాదం ఆవిరి చేసింది. నవ దంపతులను పొట్టన పెట్టుకుంది. ఇరు కుటుంబాల్లో విషాదం నింపింది.

విజయవాడ/తిరువూరు/విస్సన్నపేట, జూలై 1 (ఆంధ్రజ్యోతి):

ఎన్టీఆర్‌ జిల్లా విస్సన్నపేట మండలం పుట్రేల దక్షణ మాలపల్లికి చెందిన శ్రీరమ్య, కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన నికిల్‌రెడ్డి ఫార్మా కంపెనీ మంటల్లో మరణించారు. శ్రీరమ్య తల్లిదండ్రులు రామాల నారయ్య, పద్మ దంపతులు వ్యవసాయ కూలీలు. పెద్దకుమార్తె జోత్స్న భర్తతో కలిసి హైదరాబాద్‌లో ఉంటోంది. చిన్న కుమార్తె శ్రీరమ్య తిరుపతిలోని పద్మావతి యూనివర్సిటిలో ఎమ్మెస్సీ పూర్తి చేసింది. హైదరాబాద్‌కు వెళ్లి సిగాచి ఫార్మా కంపెనీలో ఉద్యోగం సంపాదించింది.

విధుల్లో కలిసిన మనస్సులు

కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన నిఖిల్‌రెడ్డి ఎమ్మెస్సీ చేసి ఇదే కంపెనీలో కెమిస్ట్‌గా చేరాడు. శ్రీరమ్య, అతడు కలిసి ల్యాబ్‌లో పనిచేసేవారు. అలా పెరిగిన పరిచయం ప్రేమగా మారింది. కలిసి పనిచేస్తున్న ఇద్దరూ వివాహ జీవితంలోనూ కలిసే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ తల్లిదండ్రులను ఒప్పించి ఒక్కటవ్వాలని భావించారు. ఈ ప్రేమ విషయాన్ని ఇద్దరూ వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దీనికి ఇద్దరు తల్లిదండ్రులు అంగీకరించలేదు. ఎప్పటికీ అంగీకరించబోమని తేల్చి చెప్పారు. దీంతో ఏం చేయాలో తెలియని ఇద్దరూ చివరికి పెద్దల నిర్ణయాన్ని వ్యతిరేకించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తిరుపతిలో కొద్దిరోజుల క్రితమే పెళ్లి చేసుకున్నారు. అక్కడి నుంచే తాము పెళ్లి చేసుకున్నామన్న విషయాన్ని ఇంట్లో పెద్దలకు ఫోన్‌ ద్వారా చెప్పారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్‌ వెళ్లిపోయారు.

తిరువూరు ఎమ్మెల్యే చొరవతో ఒప్పుకున్న తల్లిదండ్రులు

పెద్దల నిర్ణయాన్ని ఎదిరించి పెళ్లి చేసుకోవడంతో గొడవలు జరిగే అవకాశం ఉందని భావించిన నిఖిల్‌రెడ్డి, శ్రీరమ్య అక్కడే ఉంటున్న తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును ఆశ్రయించారు. దిల్‌సుఖ్‌నగర్‌లో ఉంటున్న ఆయన ఇంటికి వెళ్లి జరిగిన విషయం చెప్పారు. ఎమ్మెల్యే దంపతులు నవ జంటకు నూతన వసా్త్రలను బహూకరించారు. తర్వాత నిఖిల్‌రెడ్డి, శ్రీరమ్య కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి ఇంటికి పిలిపించారు. రెండు కుటుంబాలను కూర్చోబెట్టి మాట్లాడారు. జరిగిన విషయాన్ని వదిలిపెట్టి పిల్లలు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాలని రెండు కుటుంబాలను ఒప్పించారు. దీంతో ఆషాఢం వెళ్లిన తర్వాత విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలని రెండు కుటుంబాలు భావించాయి. ఇరు కుటుంబాలు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా తాము తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించడంతో నిఖిల్‌రెడ్డి, శ్రీరమ్య ఆనందంలో మునిగిపోయారు. ప్రమాదం జరిగిన రోజున శ్రీరమ్య ఉదయం పది గంటల షిఫ్టునకు వెళ్లాల్సి ఉండగా తెల్లవారుజామున ఐదు గంటల షిఫ్టునకు వెళ్లింది. అప్పటికే నిఖిల్‌రెడ్డి విధుల్లో ఉన్నాడు. ఆ ఇద్దరు ఎక్కడ కలుసుకుని ఒక్కటయ్యారో అక్కడే జరిగిన ప్రమాదంలో ఇద్దరూ సజీవ దహనమవ్వడం అందరిని కలచివేసింది. కాగా, ప్రమాదం విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కొలికపూడి వెంటనే హైదరాబాద్‌ బయలుదేరి వెళ్లారు. యువజంట మరణంపై కన్నీరు పెట్టుకుంటూ ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారు.

Updated Date - Jul 02 , 2025 | 01:33 AM