Share News

జిల్లా టీడీపీ సారథి వహీద్‌?

ABN , Publish Date - Dec 17 , 2025 | 12:05 AM

టీడీపీ జిల్లా రథసారథుల కసరత్తు కొలిక్కి వచ్చింది. సామాజికవర్గాలు, రాజకీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకుని తుది జాబితాను మంగళవారం సిద్ధం చేసింది.

జిల్లా టీడీపీ సారథి వహీద్‌?

జిల్లా అధ్యక్షుల జాబితా సిద్ధం చేస్తున్న అధిష్ఠానం

ముస్లిం కోటాలో అవకాశం

టీడీపీ నేతల్లో తీవ్ర అసంతృప్తి

కర్నూలు, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): టీడీపీ జిల్లా రథసారథుల కసరత్తు కొలిక్కి వచ్చింది. సామాజికవర్గాలు, రాజకీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకుని తుది జాబితాను మంగళవారం సిద్ధం చేసింది. అధిష్ఠానం నియమించిన త్రిసభ్య కమిటీ ప్రతిపాదించిన పేర్లను కాదని, ముస్లిం మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన షేక్‌ వహీద్‌ హుస్సేన పేరును దాదాపుగా ఖరారు చేసినట్లు సమాచారం. అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నంద్యాల జిల్లాకు చెందిన వహీద్‌ కర్నూలులో ఓ ప్రైవేట్‌ షోరూం నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా వహీద్‌ను ఎంపిక చేసినట్లు వార్తలు రావడంతో సీనియర్‌ నాయకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అధిష్ఠానం రాష్ట్ర వ్యాప్తంగా 25 పార్లమెంట్‌ అధ్యక్షుల జాబితాలో ముస్లిం మైనార్టీకి చెందిన ఏకైక వ్యక్తి వహీద్‌ కావడం విశేషం. నంద్యాల జిల్లా గోస్పాడు మండలం యాళ్లూరు గ్రామానికి చెందిన వహీద్‌ కుటుంబం మొదటి నుంచి టీడీపీలోనే కొనసాగుతోంది. ఆయన తండ్రి షేక్‌ ఖాజా హుస్సేన రైస్‌ మిల్లు వ్యాపారంలో రాణిస్తున్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వహీద్‌ కుటుంబానికి గుర్తింపు ఉంది. 2002లో వహీద్‌ హుస్సేన గోస్పాడు మండల పరిషత టీడీపీ కో-ఆప్షన సభ్యుడిగా, ఆయన సోదరుడు షేక్‌ అత్తర్‌ హుస్సేన యాళ్లూరు వైస్‌ ప్రెసిడెంట్‌గా పని చేశారు. తరువాత వైసీపీకి చెందిన మాజీ మంత్రి శిల్పా మోహనరెడ్డికి సన్నిహితంగా ఉంటూ వచ్చారు. 23 ఏళ్ల క్రితం వ్యాపార రిత్యా కర్నూలుకు వచ్చిన వహీద్‌ ఇక్కడే స్థిరపడ్డారు. ఓ ప్రైవేట్‌ సంస్థ ట్రాక్టర్స్‌ షోరూం డీలరుగా కొనసాగుతున్నారు. గత ఎన్నికల ముందు శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం పార్టీ పరిశీలకుడిగా పని చేశారు.

త్రీమెన కమిటీ సిఫార్సులు బుట్టదాఖలు

కర్నూలు పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడి ఎంపిక కోసం రాష్ట్ర మంత్రి రాంప్రసాద్‌రెడ్డి, హిందూపురం ఎంపీ పార్థసారథి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ నక్కా ఆనందబాబులతో త్రీమెన కమిటీని ఏర్పాటు చేసింది. ఆగస్టు 26న కర్నూలులోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన హాల్‌లో పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. మాజీ డిప్యూటీ సీఎం, పొలిట్‌ బ్యూరో సభ్యుడు కేఈ కృష్ణమూర్తి, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత, ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, ఎమ్మెల్యేలు కేఈ శ్యాంబాబు, బొగ్గుల దస్తగిరి, బీవీ జయనాగేశ్వరరెడ్డి, కేడీసీసీబీ చైర్మన విష్ణువర్ధనరెడ్డి, కుడా చైర్మన సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్‌ మాజీ ఎంపీ డాక్టర్‌ ఎస్‌.సంజీవకుమార్‌ సహా కార్పొరేషన్ల చైర్మన్లు, నియోజకవర్గం ఇనచార్జిలు, ముఖ్య నాయకులు హాజరయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు పి.తిక్కారెడ్డితో సహా నాయకులు కేఈ జగదీశ గౌడ్‌, నాగరాజుయాదవ్‌, షేక్‌ వహీద్‌ హుసేన, మహిళా నాయకురాలు అరుణ కుమారి అధ్యక్ష స్థానానికి దరఖాస్తు చేసుకున్నారు. త్రీమెన కమిటీ సభ్యులు వ్యక్తిగతంగా అభిప్రాయాలు తీసుకున్నారు. ఫైనల్‌గా తిక్కారెడ్డి, కేఈ జగదీశ గౌడ్‌, నాగరాజు యాదవ్‌ పేర్లు అధిష్ఠానానికి పంపినట్లు త్రీమెన కమిటీ సభ్యుడు ఎంపీ బీకే పార్థసారథి అప్పట్లోనే తెలిపారు. అయితే ఆ త్రీమెన కమిటీ సిఫార్సులను అధిష్ఠానం బుట్ట దాఖలు చేసినట్లు తెలుస్తోంది. త్రీమెన కమిటీ సిఫార్సుకు విరుద్ధంగా షేక్‌ వహీద్‌ హుస్సేన వైపు మొగ్గు చూపడం కొసమెరుపు. ఈయన ఎంపికపై పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్‌ నాయకులు, కార్పొరేషన్ల చైర్మన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ అభిప్రాయాలను తీసుకోకుండా అధిష్ఠానం నిర్ణయం తీసుకుందని ఓ వైపు అసహనంతో ఉన్నప్పటికీ పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తామంటూ చెబుతున్నారు.

ఫ తిక్కారెడ్డికి ఏమిస్తారో?

టీడీపీ జిల్లా అధ్యక్షుడు పి.తిక్కారెడ్డి మంత్రాయలం నియోజకవర్గం నుంచి 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్టో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. 2019 ఎన్నికల్లో ఓటమి చెందినా ఐదేళ్లు టీడీపీ నియోజకవర్గం ఇనచార్జిగా కొనసాగారు. గత ఎన్నికల్లో చివరి వరకు అయనకే టీడీపీ టికెట్‌ ఖాయమని భావించారు. అయితే రాజకీయ, సామాజిక సమీకరణల్లో భాగంగా వాల్మీకి సామాజికవర్గానికి చెందిన మాధవరం ఎన.రాఘవేంద్రరెడ్డికి టికెట్‌ ఇచ్చారు. టికెట్‌ త్యాగం చేసిన తిక్కారెడ్డి ఎమ్మెల్సీ పదవిని ఆశించారు. అది కుదరకపోవడంతో జిల్లా అధ్యక్ష పదవిని పార్టీ కేటాయించింది. 18 నెలలుగా జిల్లా అధ్యక్షుడిగా పని చేసిన ఆయనను తప్పించి మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన వహీద్‌ను తెరపైకి తీసుకురావడం కొసమెరుపు. జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి తిక్కారెడ్డి తప్పిస్తే ఆయనకు ఏ బాధ్యతలు అప్పగిస్తారోనన్న చర్చ పార్టీలో సాగుతోంది.

Updated Date - Dec 17 , 2025 | 12:05 AM