Justice Prashant Kumar Mishra: జిల్లా న్యాయవ్యవస్థ అత్యంత కీలకం
ABN , Publish Date - Dec 22 , 2025 | 05:36 AM
న్యాయవ్యవస్థలో జిల్లా జ్యుడీషియరీ వ్యవస్థ మూల స్థంభం అని, ప్రతి వ్యక్తి మొదటగా జిల్లా న్యాయ వ్యవస్థ వద్దకే వస్తారని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా అన్నారు.
న్యాయం కోసం అందరూ మొదట అక్కడికే వెళ్తారు
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా
గుంటూరు, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): న్యాయవ్యవస్థలో జిల్లా జ్యుడీషియరీ వ్యవస్థ మూల స్థంభం అని, ప్రతి వ్యక్తి మొదటగా జిల్లా న్యాయ వ్యవస్థ వద్దకే వస్తారని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా అన్నారు. ఆదివారం గుంటూరు జిల్లాలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలోని జ్యుడీషియల్ అకాడమీలో నిర్వహించిన ‘రాజ్యాంగ ధృక్కోణం-జిల్లా న్యాయ వ్యవస్థ పాత్ర’ అనే అంశంపై జరిగిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా కీలక ఉపన్యాసం చేశారు. రాజ్యాంగంలో జిల్లా న్యాయ వ్యవస్థకు ఉత్తమ స్థానం కల్పించారని పేర్కొన్నారు. ఉత్తమ న్యాయం అందించడమే న్యాయవ్యవస్థ ప్రధాన విధిగా గుర్తించాలని సూచించారు. కోర్టుల్లో జరిగే విచారణ సామాన్యుడికి సైతం అర్థం కావాలని, అప్పుడే న్యాయవ్యవస్థపై ప్రజలకు విశ్వాసం, నమ్మకం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. తీర్పులు ఇవ్వడం ఒక్కటే న్యాయ వ్యవస్థ ప్రక్రియ కాదని, ఆ తీర్పులో నిబద్ధత ఉండాలని అన్నారు. న్యాయం అనేది మానవతా దృక్పథంపై ఆధారపడి ఉంటుందన్నారు.
రాజీలేని న్యాయ వ్యవస్థను నిర్వహించాలి: జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీ పాట్రన్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ జీవించే హక్కు కలిగి ఉండడం అంటే.. వ్యక్తి జీవించడం ఒక్కటే కాదని, మంచి జీవనాన్ని గడిపే హక్కు కలిగి ఉండటమని స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థ పనితీరులో ఏమాత్రం అశ్రద్ధ ఉన్నా ఆర్టికల్ 14, 15 ప్రకారం న్యాయాన్ని సక్రమంగా వెలువరించడం సాధ్యం కాదని చెప్పారు. రాజీలేని న్యాయ వ్యవస్థను నిర్వహించడంలో ప్రతి ఒక్కరూ ప్రముఖ పాత్ర పోషించాలని కోరారు.
పౌర హక్కులకు రక్షణ కల్పించాలి: జస్టిస్ రవినాథ్ తిల్హారి
ఏపీ హైకోర్టు న్యాయమూర్తి, జ్యుడీషియల్ అకాడమీ బోర్డు ఆఫ్ గవర్నర్స్ అధ్యక్షుడు జస్టిస్ రవినాథ్ తిల్హారి మాట్లాడుతూ రాజ్యాంగం ప్రతి వ్యక్తికి పౌర హక్కులు ఇచ్చిందని, వీటికి జిల్లా న్యాయవ్యవస్థ పటిష్ట రక్షణ కల్పించాలన్నారు. మహిళలు, చిన్నారులపై వచ్చే వివాదాలు చాలావరకు సున్నితమైనవని, వాటిని సరైన ప్రక్రియ ద్వారా పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్ చింతలపూడి పురుషోత్తం కుమార్, జిల్లా ప్రధాన న్యాయమూర్తులు, వివిధ జిల్లాల న్యాయాధికారులు పాల్గొన్నారు.