జిల్లా సారథి ధర్మవరం సుబ్బారెడ్డి!
ABN , Publish Date - Dec 17 , 2025 | 12:13 AM
జిల్లాలో గత కొన్ని నెలలుగా టీడీపీ అధ్యక్ష పీఠంపై నెలకొన్న ఉత్కంఠ వీడింది. సామాజికవర్గాలు, రాజకీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకుని టీడీపీ హైకమాండ్ మంగళవారం తుది జాబితాను సిద్ధం చేసింది.
ఎంపిక చేసిన టీడీపీ అధిష్ఠానం
అధికారిక ప్రకటన లాంఛనమే
మళ్లీ ఎనఎండీ ఫీరోజ్‌కే కార్యదర్శి పదవి
త్వరలో 40 మందితో జిల్లా కమిటి జాబితా
నంద్యాల, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గత కొన్ని నెలలుగా టీడీపీ అధ్యక్ష పీఠంపై నెలకొన్న ఉత్కంఠ వీడింది. సామాజికవర్గాలు, రాజకీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకుని టీడీపీ హైకమాండ్ మంగళవారం తుది జాబితాను సిద్ధం చేసింది. అందులో నంద్యాల జిల్లా అధ్యక్షుడిగా సీడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన చైర్మన ధర్మవరం సుబ్బారెడ్డిని దాదాపుగా ఖరారు చేసింది. అయితే అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఈ ఏడాది ఆగస్టులో త్రిసభ్య కమిటీ ఆశావహుల నుంచి అధ్యక్ష పీఠం కోసం దరఖాస్తులు స్వీకరించి సమగ్ర నివేదికను పార్టీ పెద్దలకు అందజేసింది. వివిధ కారణాల నేపథ్యంలో జిల్లాల వారిగా అధ్యక్ష పదవులు ఖరారు అంశం పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. అయితే తాజాగా సీఎం చంద్రబాబునాయుడు సైతం మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా త్రిసభ్య కమిటీ సభ్యులతో సమీక్షించి జిల్లాల వారీగా అధ్యక్ష పదవులను ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో నంద్యాల జిల్లా అధ్యక్ష స్థానానికి ధర్మవరం సుబ్బారెడ్డిని పేరును చంద్రబాబు ఫైనల్ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎనఎండీ ఫిరోజ్‌కు మరోసారి అవకాశం దక్కనుంది. నేడో, రేపో అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా త్వరలో 40 మందితో కూడిన జిల్లా కమిటీ జాబితా విడుదల కానుంది.
సుబ్బారెడ్డి వైపే చంద్రబాబు
పోలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, గుంటూరు మేయర్ కోవెలమూడి నాని, ఏపీఎస్ ఆర్టీసీ కడప జోన చైర్మన పూల నాగరాజుతో కూడిన త్రిసభ్య కమిటీ ఈ ఏడాది ఆగస్టు 24న నంద్యాల జిల్లా నేతలతో అభిప్రాయాలను సేకరించింది. అధ్యక్ష పదవి కోసం 12 దరఖాస్తులు వచ్చాయి. వీరిలో ప్రధానంగా ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన ధర్మవరం సుబ్బారెడ్డి, ఆళ్లగడ్డకు చెందిన హైకోర్టు న్యాయవాది గోగిశెట్టి నరసింహరావు, నంద్యాల పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది రామచంద్రరావు, ప్రస్తుత జిల్లా ప్రధాన కార్యదర్శి, మంత్రి కుమారుడు ఎనఎండీ ఫీరోజ్, మార్క్‌ఫెడ్ డైరెక్టర్ తులసి రెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి మధ్య పోటీ నెలకొంది. అయితే సుబ్బారెడ్డి వైపే చంద్రబాబు మొగ్గుచూపినట్లు సమాచారం.
అధినేత మెచ్చిన నేత
డోన మండలం ధర్మవరం గ్రామానికి ధర్మవరం పుల్లారెడ్డి, పుల్లమ్మ దంపతుల కుమారుడు ధర్మవరం సుబ్బారెడ్డి. వీరిది వ్యవసాయ కుటుంబం. ఈయన మొదల్లో కాంగ్రెస్‌లో ఉండేవారు. తర్వాత వైసీపీలో చేరారు. ఆ పార్టీ విధానాలు, జగన వ్యవహారిశైలి నచ్చక ఆయనతో విభేదించి 2017 మే11న పదివేలమందితో కలిసి టీడీపీలో చేరారు. 2021లో డోన నియోజవర్గ ఇనచార్జిగా బాధ్యతలు స్వీకరించారు. 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా టీడీపీ అధిష్ఠానం సుబ్బారెడ్డికే దాదాపు ఖరారు చేసింది. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో కోట్ల సూర్యప్రకాశ రెడ్డికి టికెట్ కేటాయించారు. అయితే పార్టీ నిర్ణయాన్ని శిరసావహించిన సుబ్బారెడ్డి కోట్ల గెలుపులో క్రియాశీలకంగా పనిచేశారు. పార్టీ విధేయతను గుర్తించిన చంద్రబాబు తొలిదశ నామినేటెడ్ పదవుల జాబితాలో సీడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన చైర్మనగా నియమితులయ్యారు. మళ్లీ చంద్రబాబు మనసును గెలిచిన ఆయనకు ఇప్పుడు జిల్లా అధ్యక్ష స్థానం అవకాశం దక్కించుకుంటున్నారు.