Share News

డిమాండ్‌కు అనుగుణంగా ఎరువుల పంపిణీ

ABN , Publish Date - Sep 04 , 2025 | 12:46 AM

ఉమ్మడి కృష్ణా జిల్లాలో డిమాండ్‌కు తగినట్టుగా ఎరువుల సరఫరా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. బుధవారం రాత్రి సీఎం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నిల్వ ఉన్న ఎరువుల వివరాలను ప్రకటించారు.

డిమాండ్‌కు అనుగుణంగా ఎరువుల పంపిణీ

- వెల్లడించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

విజయవాడసిటీ , సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి కృష్ణా జిల్లాలో డిమాండ్‌కు తగినట్టుగా ఎరువుల సరఫరా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. బుధవారం రాత్రి సీఎం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నిల్వ ఉన్న ఎరువుల వివరాలను ప్రకటించారు. ముఖ్యమంత్రి పేర్కొన్న వివరాల ప్రకారం....

ఎన్టీఆర్‌ జిల్లాలో...

ఎన్టీఆర్‌ జిల్లాలో 94,931 హెక్టార్ల భూమి ఉండగా, అందులో 86,643 హెక్టార్లలో ఈ ఏడాది ఖరీఫ్‌ సాగు జరుగుతోంది. 24,305 మెట్రిక్‌ టన్నుల యూరియా కావాల్సి ఉందని అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. కిందటి ఏడాది కంటే ఈ ఏడాది సాగు విస్తీర్ణం అనూహ్యంగా పెరిగి ఎరువుల ఆవశ్యకతను పెంచిందన్నారు. దీంతో 29,032 టన్నుల యూరియా కావాలని అధికారులు రెండో దఫా నివేదిక ఇచ్చారు. అందులో ఇప్పటి వరకు 25,558 మెట్రిక్‌ టన్నుల యూరియాను 103 పీఏసీఎస్‌లు, 227 రైతు శిక్షణా కేంద్రాలు, 229 మంది ప్రవేటు డీలర్ల ద్వారా విక్రయించారు. ప్రస్తుతం జిల్లాలో 3,474 మెట్రిక్‌ టన్నుల యూరియా నిల్వ ఉంది. దీంతో పాటు 1,311 మెట్రిక్‌ టన్నుల డీఏపీ, 1,246 మెట్రిక్‌ టన్నల ఎంవోపీ, 12,948 మెట్రిక్‌ టన్నుల ఎనపీకే, 2,195 మెట్రిక్‌ టన్నుల ఎస్‌ఎస్‌పీ, 83 మెట్రిక్‌ టన్నుల కంపోస్ట్‌, 30 మెట్రిక్‌ టన్నుల ఎఫ్‌వోఎం నిల్వలు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ నెల ఆరోవ తేదీ నుంచి 10వ తేదీ మధ్యలో జిల్లాకు 3,650 మెట్రిక్‌ టన్నుల యూరియాను సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

- కృష్ణాజిల్లాలో..:

కృష్ణాజిల్లా వ్యాప్తంగా 1,67,667హెక్టార్లలో ఈ ఏడాది 1,49,817 హెక్టార్‌లలో ఖరీఫ్‌ సాగు జరుగుతోంది. దీని కోసం 35,529 మెట్రిక్‌ టన్నుల యూరియా కావాలని అధికారులు నివేదిక ఇవ్వగా 30,546 మెట్రిక్‌ టన్నుల యూరియా వచ్చింది. దీనిలో ఇప్పటి వరకు 27,677 మెట్రిక్‌ టన్నులను రైతులకు 194 పీఏసీఎస్‌లు, 340 మంది ప్రవేటు డీలర్‌లు, 300 రైతు శిక్షణ కేంద్రాల ద్వారా సరఫరా చేశారు. ప్రస్తుతం 2,870 మెట్రిక్‌ టన్నుల యూరియా రైతులకు అందుబాటులో ఉంది. ఈ నెల 10వ తేదీ లోపు జిల్లాకు మరో 2,150 మెట్రిక్‌ టన్నుల యూరియా సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

- ముగ్గురు అక్రమార్కులపై కేసులు నమోదు:

ఎరువులను అక్రమంగా నిల్వ ఉంచి అధిక ధరలకు విక్రయిస్తున్న ముగ్గురిపై ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ యంత్రాంగం కేసులు నమోదు చేసింది. పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌.వి.రాజశేఖరబాబు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎరువుల దుకాణాలను పోలీసులు తనిఖీ చేశారు. తిరువూరు, గంపలగూడెం, ఎ.కొండూరులో కృత్రిమ కొరత సృష్టిస్తున్న వారిని గుర్తించారు. ఆయా దుకాణాల్లో నిల్వ ఉన్న ఎరువులు, రికార్డుల్లో నమోదు చేసిన లెక్కలు తేడా ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. అక్రమంగా ఎరువులు నిల్వ ఉంచిన వారిపై ఆయా పోలీస్‌ స్టేషనలలో కేసులు నమోదు చేశారు. ఎరువుల దుకాణాలపై పోలీసుల తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, కృత్రిమ కొరత సృష్టించినా, రికార్డులు సక్రమంగా లేకపోయినా, అధిక ధరలకు విక్రయించినా కేసులు నమోదు చేస్తామని ఈ సందర్భంగా పోలీస్‌ యంత్రాంగం హెచ్చరిక చేసింది.

Updated Date - Sep 04 , 2025 | 12:46 AM