Share News

Distinctive Politics: విలక్షణ రాజకీయం

ABN , Publish Date - Sep 01 , 2025 | 04:34 AM

ఎవరైనా రాజకీయాల్లో గెలుస్తుంటారు.. ఓడిపోతుంటారు. మళ్లీ ప్రజాదరణ పొంది అధికార పీఠం అధిష్ఠిస్తారు. అయితే చంద్రబాబు అలా కాదు. సంక్షోభాల నుంచి ప్రపంచ స్థాయికి వెళ్లడం.. ఓటమితో చతికిలబడడం.. ఆ తర్వాత ఆకాశమే హద్దుగా ఎదగడం ఆయన రాజకీయ శైలి.

Distinctive Politics: విలక్షణ రాజకీయం

  • చంద్రబాబు జీవితంలో ఎన్నో మలుపులు.. మరెన్నో మజిలీలు

  • సంక్షోభాల నుంచి ప్రపంచ స్థాయికి ఎదిగిన వైనం

  • పాతాళానికి పడినా.. తర్వాత ఆకాశమే హద్దుగా ఎదిగే తత్వం

వరైనా రాజకీయాల్లో గెలుస్తుంటారు.. ఓడిపోతుంటారు. మళ్లీ ప్రజాదరణ పొంది అధికార పీఠం అధిష్ఠిస్తారు. అయితే చంద్రబాబు అలా కాదు. సంక్షోభాల నుంచి ప్రపంచ స్థాయికి వెళ్లడం.. ఓటమితో చతికిలబడడం.. ఆ తర్వాత ఆకాశమే హద్దుగా ఎదగడం ఆయన రాజకీయ శైలి. ఆయనది ఆది నుంచీ విలక్షణమైన రాజకీయ జీవితం. మలుపులు.. మజిలీలు ఎన్నెన్నో ఉన్నాయి. అతి సాధారణ కుటుంబంలో జన్మించి.. విద్యార్థి దశలోనే గెలుపోటములు ఒంటబట్టించుకున్నారు. 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై.. అంజయ్య హయాంలో మంత్రివర్గంలో చేరారు. టీడీపీలోకి వచ్చాక చాలాకాలం మంత్రి కావాలన్న ఆలోచనే చేయలేదు. 1983లో ఎన్టీఆర్‌ మొదటిసారి సీఎం అయ్యాక చంద్రబాబు టీడీపీలోకి వచ్చారు. 1984 ఆగస్టు సంక్షోభంలో తాను మామ చాటు అల్లుడిని కాదని.. నాయకత్వ పటిమ పదునుగా ఉందని నిరూపించుకున్నారు. 1985లో మళ్లీ ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక.. అవకాశమున్నా.. ఎమ్మెల్యే, మంత్రి పదవుల జోలికి వెళ్లలేదు. కానీ రాష్ట్ర గతినే ఒక మలుపుతిప్పిన కర్షక పరిషత్‌ చైర్మన్‌గా దాదాపు ముఖ్యమంత్రికి ఉన్నంత అధికారాన్ని ఆయనకు కట్టబెట్టారు. దీంతో 1989లో టీడీపీ ఓడిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు ఈయనే టార్గెట్‌ అయ్యారు. ఎన్ని రకాలుగా వేధించాలో.. ఎన్ని విధాలుగా మానసిక క్షోభ కలిగించాలో అన్నీ చేశారు. 1994లో టీడీపీ అప్రతిహత విజయంతో మళ్లీ అధికారంలోకి వచ్చాక.. 1995 సెప్టెంబరు వరకు ఆయన కల్లోల దశనే ఎదుర్కొన్నారు. పేరుకు మంత్రిగా ఉన్నప్పటికీ లక్ష్మీపార్వతి ప్రభావం పడింది. అప్పుడే సరికొత్త రాజకీయ సంక్షోభం నుంచి ఆయన వినూత్న నాయకుడిగా రూపాంతరం చెందారు. అదే.. 1995 సెప్టెంబరు 1న ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం..!


ఎవరైనా ముఖ్యమంత్రి అయితే మహా ఆనందపడిపోతారు. ఆయన మాత్రం తీవ్ర విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. ఎన్టీఆర్‌ నుంచి అధికారం లాగేసుకున్నారన్న అపఖ్యాతి చుట్టుముట్టింది. కానీ 1999 ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుకు జైకొట్టడంతో విమర్శకుల నోళ్లు మూతపడ్డాయి.

ఊహకు అందని ఆలోచనలు..

1995లో ముఖ్యమంత్రి అయిన తర్వాత టెక్నాలజీ వైపు చూసిన చంద్రబాబు 1999 తర్వాత దానిని కొత్త పుంతలు తొక్కించారు. ప్రపంచస్థాయి నేతలతో పరిచయాలు పెంచుకోవడం, ఆ పరిచయాలను రాష్ట్రం కోసం ఉపయోగించడం ద్వారా.... ఎవరు అవునన్నా...కాదన్నా చంద్రబాబు ఈ విషయంలో గ్రేట్‌ అని చంద్రబాబు బద్ద విరోధులు సైతం ప్రశంసించేలా చేసుకోగలిగారు. అందరూ ఒక దిశలో ఆలోచిస్తే.. ఆయన అందుకు భిన్నకోణంలో ఆలోచించి.. ఊహకు అందనంత దూరంలో ప్రణాళికలు రూపొందించేవారు. అందులో కొన్ని ప్రజలకు సరైన రీతిలో దక్కకపోవడంతో 2004లో ఓటమి పాలయ్యారు. వరుసగా పదేళ్లు అధికారం కోల్పోయినా.. ఎక్కడా నిరుత్సాహపడకుండా 2014లో నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రి అయ్యారు. రాజధాని గానీ, చెప్పుకోదగ్గ పరిశ్రమలు గానీ ఏవీ లేని విభజిత రాష్ట్రాన్ని నిలబెట్టే క్రమంలో ఆయన చేసిన ప్రయోగాలు ప్రజలకు రుచించలేదు. దాంతో మళ్లీ ఓటమి పాలయ్యారు.


ఆ ఐదేళ్లూ వేధింపులు.. కక్షసాధింపులు

2019లో అధికారంలోకి వచ్చింది జగన్‌ కావడంతో వేధింపులు, సాధింపుల స్థానంలో కక్ష సాధింపులు మొదలయ్యాయి. చంద్రబాబు చుట్టూ మనుషులు లేకుండా చేయాలన్న జగన్‌ ప్రయత్నం కొంత వరకు ఫలించింది. అధికారంలో ఉన్నప్పుడు వీరుడు, శూరుడు, విక్రమార్కులు అన్నవారు సైతం ఇంట్లో పెళ్లికి కార్డు ఇవ్వడానికి కూడా చంద్రబాబు వద్దకు వెళ్లలేదు. ఎంత కిందకు పడితే అంత పైకి లేస్తారనే పేరున్న చంద్రబాబును మరింత కఠినంగా తొక్కేయడం కోసం జగన్‌ తన ఒరిజినల్‌ రూపాన్ని బయటపెట్టుకున్నారు. 70 ఏళ్లు పైబడిన వ్యక్తి అని చూడకుండా అమానుష పద్ధతిలో తప్పుడు కేసులో అరెస్టు చేశారు. 53 రోజుల పాటు జైలు జీవితం గడిపిన చంద్రబాబు.. ఒక్కసారిగా ప్రజల గుండెల్లోకి దూసుకుపోయారు. కళ్లుదిరిగే మెజారిటీతో 2024లో ఘన విజయం సాధించారు. ఒక వ్యక్తి అధికారం కోల్పోవడం, మళ్లీ తిరిగి రావడం సాధారణం.. కానీ ఇన్ని సార్లు అధికారం పోయినా మళ్లీ మళ్లీ రెట్టింపు ఉత్సాహంతో విజయతీరాలకు చేరుకోవడం అసాధారణ విషయం. ఇది చంద్రబాబుకే చెల్లింది.


ఎక్కడున్నా కింగ్‌ మేకర్‌....

చంద్రబాబు ఎక్కడున్నా కింగ్‌మేకరే. అటల్‌ బిహారీ వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఎన్డీయే కన్వీనర్‌గా వ్యవహరించిన ఆయన.. ప్రఖ్యాత క్షిపణి శాస్త్రవేత్త అయిన ఏపీజే అబ్దుల్‌ కలాంను రాష్ట్రపతిగా ఎంపిక చేయడంలో కీలక భూమిక పోషించారు. అదే విధంగా ప్రముఖ జన్యు శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌ను, డీఆర్‌డీవో మాజీ చైర్మన్‌ సతీశ్‌రెడ్డి లాంటి వారిని సలహాదారులుగా నియమించుకోవడం ద్వారా.. శాస్త్ర సాంకేతిక రంగాల పరిజ్ఞానాన్ని రాష్ట్రప్రభుత్వం వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు. ప్రపంచ స్థాయి కార్పొరేట్‌ దిగ్గజాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఆహ్వానించి రాష్ట్ర ప్రతిష్ఠను ఇనుమడింపజేశారు. అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ ఏపీకి రావడం చంద్రబాబు వల్లే సాధ్యమైంది. కర్షక పరిషత్‌ చైర్మన్‌గా ఉన్నప్పుడు.. క్షీర విప్లవ పితామహుడు వర్గీస్‌ కురియన్‌ను పిలిపించి పాడి ఉత్పత్తిలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత కూడా ఆయనదే.


పడిపడి లేచిన బాబు..

పడి.. లేవడం చంద్రబాబు నైజం. నాలుగు సార్లు సీఎంగా పనిచేసిన ఆయన.. ప్రతిపక్ష నేతగానూ సుదీర్ఘకాలం పనిచేశారు. 2004, 09ల్లో వరుస పరాజయాలతో పదేళ్లు ప్రతిపక్షంలోనే కూర్చున్నారు. 2014లో కొత్త రాష్ట్రాన్ని నిలబెట్టేందుకు అనుభవజ్ఞుడు కావాలని జనం ఆశించి ఆయనకే పట్టం కట్టారు. మళ్లీ 2019లో ఓడిపోయి ఐదేళ్లూ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. అయితే ఈ ఐదేళ్లలో ఆయన రాజకీయ నాయకత్వానికే సవాల్‌ ఎదురయ్యే అనుభవాలు ఎదురయ్యాయి. ప్రజల్లోకి వెళ్లకుండా నాటి సీఎం జగన్‌ ఆయన్ను కట్టడి చేశారు. ఇంట్లో నుంచి బయటకే రానివ్వలేదు. ఆయన సహచరులను తప్పుడు కేసుల్లో ఇరికించి జైళ్లకు పంపారు. చివరకు చంద్రబాబును సైతం అక్రమ కేసులో ఇరికించి.. అక్రమంగా అరెస్టు చేసి జైలు పాల్జేశారు. అదే జగన్‌కు అశనిపాతమైంది. 30 ఏళ్లు రాష్ట్రాన్ని ఏకఛత్రాధిపత్యంతో ఏలతానని కలలుగన్న జగన్‌కు జనం కర్రుగాల్చి వాతపెట్టారు. కనీసం ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేశారు. చంద్రబాబును మళ్లీ సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు. ఇలా ఎన్ని సార్లు ఆయన కింద పడినా.. మళ్లీ జనం అండతో పైకి లేస్తూనే ఉన్నారు.


పది నిమిషాలిస్తే..

ఒక చిన్న అవకాశం దొరకాలే గాని.. దానినెలా సద్వినియోగం చేసుకోవాలో చంద్రబాబుకు తెలిసినంత మరెవరికీ తెలియదేమో? అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ను హైదరాబాద్‌కు రప్పించడమే అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. దటీజ్‌ చంద్రబాబు అని దేశమంతా ప్రశంసించింది. ఆ సమయంలోనే మరో విశేషం చోటుచేసుకుంది. అంతటి క్లింటన్‌ వచ్చినప్పుడు అలా వచ్చి ఇలా వెళ్లిపోతే మనకేముంటుంది.. మనమేంటో, మనకేం కావాలో చెప్పుకోవాలని చంద్రబాబుకు అనిపించింది. ఎవరెవరినో పట్టుకున్నారు.. క్లింటన్‌తో పది అంటే పదే నిమిషాలు విడిగా మాట్లాడేందుకు అనుమతి పొందారు. సాధారణంగా అమెరికా అధ్యక్షుడు ఎంత సమయమిస్తే ఆ సమయానికి కార్యక్రమం ముగిసిపోవాలి. కానీ చంద్రబాబుతో పది నిమిషాల కోసం కూర్చుంటే వారి చర్చలు ఏకంగా 40 నిమిషాలు కొనసాగాయి. అమెరికా నుంచి వచ్చిన క్లింటన్‌ భద్రతా సిబ్బంది కూడా ఆశ్చర్యపోయారు. మహా అయితే ఐదు నిమిషాలు ఎక్కువ కొనసాగవచ్చు.. అరగంట ఎక్కువ సేపు మాట్లాడడం వారినే కాదు, అమెరికా పారిశ్రామికవేత్తలనూ విస్మయపరిచింది.


హుద్‌హుద్‌.. బుడమేరు ముంపు.. కుదుటపడ్డాకే తిరిగి వెళ్లింది..!

రాష్ట్రంలో ఏదైనా విపత్కర పరిస్థితి తలెత్తితే చంద్రబాబు అది తన ఇంట్లో జరిగినట్లుగా భావిస్తారు. ముఖ్యంగా తుఫాన్లు, వరదలొస్తే హెలికాప్టర్‌లో ఓ రౌండ్‌ వేసి వచ్చే ముఖ్యమంత్రులను చూస్తాం. కానీ ఆ ప్రాంతాల్లోనే తిష్ఠ వేసి.. పనులను పర్యవేక్షించే ముఖ్యమంత్రి బహుశా ఈయనొక్కరే కావొచ్చు. 2014 అక్టోబరులో విశాఖలో హుద్‌హుద్‌ తుఫాను సంభవించినప్పుడు.. తిరిగి సాధారణ పరిస్థితి నెలకొనే దాకా ఆయన అక్కడి నుంచి కదల్లేదు. సరిగ్గా ఏడాది కిందట బుడమేరు వరదకు విజయవాడలోని కొన్ని ప్రాంతాలు ముంపునకు గురైనప్పుడు కలెక్టర్‌ కార్యాలయంలోనే కూర్చుని దాదాపు వారం రోజుల పాటు ముంపు ప్రాంతాల్లో తిరిగి.. సహాయ పునరావాస కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షించి.. పరిస్థితులు పూర్తిగా చక్కదిద్దిన తర్వాతు ఇంటికి వెళ్లారు. సొంత ఇంట్లో సమస్యలు వస్తే స్పందిస్తారో తెలియదు గానీ.. ఇలాంటి పరిస్థితుల్లో మాత్రం చంద్రబాబు ‘ది బెస్ట్‌’ అనిపించుకుంటారు.


15 నెలల్లో 9 లక్షల కోట్లు

ఓ వైపు రాష్ట్ర ప్రతిష్ఠను పెంచుతూనే.. పెట్టుబడులను ఆకర్షించడంలో చంద్రబాబు కృషి అనిర్వచనీయం. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలోనూ ఆయన చతురత మరువలేనిది. ముఖ్యమంత్రిగా ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ కేంద్రంలో మంత్రులను కలవడం.. రాష్ట్ర సమస్యలను ఏకరువు పెట్టడం.. కేంద్ర పెద్దల వద్ద తన పరపతి ఉపయోగించి నిధులు తీసుకురావడంలో ఆయన చాణక్యమే వేరు. ఏ ముఖ్యమంత్రి కూడా ఢిల్లీకి ఇన్ని సార్లు వెళ్లి ఉండరు. ఆయనకు వాక్చాతుర్యం, ఆంగ్ల భాషాపరిజ్ఞానం అంతగా లేదు. కానీ తనకున్నంత పరిజ్ఞానంతోనే ఎంతటి వారినైనా కన్విన్స్‌ చేయగల సామర్థ్యం ఆయనకుందని రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు సైతం అంటారు. 2019-24 నడుమ జగన్‌ ఏలుబడిలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ఉన్న పరిశ్రమలనూ తరిమివేశారు. కొన్నిటిని సొంతం చేసుకున్నారు. కొత్తగా పెట్టుబడి ఆనవాళ్లే లేకుండా చేశారు. కానీ చంద్రబాబు గత ఏడాది మళ్లీ సీఎంగా వచ్చాక పెట్టుబడులను ఆకర్షించే పనిలో పడ్డారు. ఇందుకోసం రాత్రింబవళ్లూ కృషిచేస్తున్నారు. ఏడాదిన్నర కాకముందే రూ.9 లక్షల కోట్లకుపైగా పెట్టుబడుల కోసం కంపెనీలతో ఎంవోయూలు కుదుర్చుకున్నారు. ఇవన్నీ సాకారమైతే యువతకు లక్షల ఉద్యోగాలు లభిస్తాయి.పెట్టుబడులు రావాలంటే శాంతిభద్రతలు పటిష్ఠంగా ఉండాలని చంద్రబాబు ప్రగాఢంగా విశ్వసిస్తారు. తనను, టీడీపీ కార్యకర్తలను ఐదేళ్లపాటు ఎనలేని వేధింపులు, ఆస్తుల ధ్వంసం, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులతో వేధించిన వైసీపీ నేతలపై చట్టప్రకారమే చర్యలు తీసుకోవాలన్నది ఆయన విధానం. అధికారం ఉందని ప్రత్యర్థులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడడం ఆయన సహించరు. ఇలాంటి చర్యలతో పెట్టుబడిదారులు పరిశ్రమల స్థాపనకు ముందుకు రారన్నది ఆయన ఉద్దేశం. అందుకే జగన్‌ హయాంలో జరిగిన కుంభకోణాల విషయంలోనూ చట్టపరంగానే ముందుకెళ్తున్నారు. పకడ్బందీగా దర్యాప్తు జరిపిస్తూ.. అన్ని ఆధారాలూ దొరికాకే అరెస్టుల వరకు వెళ్తున్నారు. టీడీపీ శ్రేణులు, నేతలకు ఈ విషయంలో అసంతృప్తి ఉన్నా.. ఆయన చెప్పిందీ వాస్తవం కావడంతో సమాధానపడుతున్నారు.


అభివృద్ధి, సంక్షేమంలో ఆయనకు సాటిలేరు!

అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాల అమల్లో దేశంలో ఏ ముఖ్యమంత్రీ చంద్రబాబుకు సాటిరారంటే అతిశయోక్తి కాదు. ఏదో కంటితుడుపుగా ఇస్తున్న పెన్షన్‌ను మొదట రూ.500కు, ఆ తర్వాత రూ.వెయ్యికి, అనంతరం రూ.2,000కి, గత ఏడాది రూ.4 వేలకు పెంచి రాష్ట్రంలో వృద్ధులకు పెద్దకొడుకుగా భరోసాగా నిలిచారు. సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యమిస్తూ ముందుకు నడుస్తున్నారు.

పోలవరం, రాజధాని, విశాఖ ఉక్కుకు నిధులు..

గత ఏడాది గద్దెనెక్కాక చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుకు ముందస్తు నిధులు సాధించారు. అంతకుముందు రాష్ట్రప్రభుత్వం ఖర్చుచేస్తే కేంద్రం రీయింబర్స్‌ చేసేది. అయితే రాష్ట్రం అప్పుల పాలై ఆర్థిక సంక్షోభంలో ఉన్నందున.. అడ్వాన్సుగా నిధులిచ్చేలా కేంద్రాన్ని ఒప్పించారు. రాజధాని నిర్మాణానికి కూడా ఎప్పటికప్పుడు నిధులు రప్పిస్తున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి కేంద్రం వేల కోట్ల ఆర్థిక సాయం అందించేలా చేశారు. విభజన హామీ విశాఖ రైల్వేజోన్‌ను సాకారం చేస్తున్నారు. రామాయపట్నం వద్ద బీపీసీఎల్‌ రూ.వేల కోట్లతో ఆయిల్‌ రిఫైనరీ పెట్టబోతోంది.


బాబు కృషితోనే ఏపీలో ముంపు మండలాల విలీనం

చంద్రబాబు కార్యదక్షత, పట్టుదల ఎనలేనివని ఆయన రాజకీయ జీవితం తెలిసిన వారందరికీ ఎరుకే. పట్టుబడితే సాధించే దాకా వెనుదీయరు. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో 2014లో టీడీపీ గెలిచాక ఆయన పదవీ బాధ్యతలు చేపట్టడానికి 23 రోజులు ఆలస్యమైయింది. విభజిత ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి నాడు ఆయన ముందు నాడు సవాళ్లు నిలిచాయి. రాజధాని నిర్మాణం, పోలవరం. ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలంటే తెలంగాణలోని ముంపు మండలాలను ఆంధ్రలో విలీనం చేయాలి. లేకపోతే అంతర్రాష్ట్ర సమస్యల సుడిగుండంలో పడుతుంది. అందుకే ముంపు మండలాలను విలీనం చేసేదాకా సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనని చంద్రబాబు భీష్మించారు. మే 16న ఎన్నికల ఫలితాలు వెలువడగా.. మోదీ ప్రభుత్వం స్పందించి విలీనంపై రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ద్వారా ఆర్డినెన్స్‌ విడుదల చేయించే వరకు ఆయన ప్రమాణ స్వీకారం చేయలేదు. విలీనానికి గ్రీన్‌సిగ్నల్‌ వచ్చాక జూన్‌ 8న పదవీప్రమాణం చేశారు.

Updated Date - Sep 01 , 2025 | 04:40 AM