Village Conflict :చివరి మజిలీకీ కష్టాలే
ABN , Publish Date - Sep 06 , 2025 | 04:12 AM
శ్మశానంలో దహన సంస్కారాల విషయమై రెండు గ్రామాల మధ్య తలెత్తిన వివాదంతో మృతదేహం..
శ్మశానవాటికపై రెండు గ్రామాల మధ్య రగడ
సాయంత్రం వరకు రోడ్డుపైనే మృతదేహం
మృతుడు ఒకప్పుడు కోట్ల ఆస్తులకు వారసుడు
చివరికి అనాథలా అంతిమ సంస్కారాలు
కొత్తవలస, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): శ్మశానంలో దహన సంస్కారాల విషయమై రెండు గ్రామాల మధ్య తలెత్తిన వివాదంతో మృతదేహం శుక్రవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు నడిరోడ్డు మీదే ఉండిపోయింది. చివరకు పెద్దల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. విజయనగరం జిల్లా జామి మండలం అలమండలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కాకర్లపూడి చిరంజీవిరాజు ఒకప్పుడు రూ.వందల కోట్ల ఆస్తులకు వారసుడు. తండ్రికి ఈయన ఒక్కడే కొడుకు. సుమారు 400 ఎకరాల విస్తీర్ణంలో మిస్సమ్మ బంజరులో వాటాదారు. కాలక్రమంలో ఆస్తులన్నీ కరిగిపోయి. భూములు కూడా పోయాయి. ఒంటరిగా మిగిలిపోయిన చిరంజీవిరాజు గురువారం ఆయన మృతి చెందగా, అంతిమ సంస్కారాలకు కొంతమంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. చిరంజీవిరావు మృతదేహాన్ని తమ్మన్న మెరక శశ్మాన వాటికకు తీసుకెళ్లడానికి యత్నించగా.. తమ శ్మశానంలో చేయడానికి వీలు లేదంటూ తమ్మన్నమెరక గ్రామస్థులు అడ్డుకున్నారు. చివరికి రెండు గ్రామాల పెద్దలు మాట్లాడుకున్న తర్వాత చిరంజీవిరాజు మృతదేహానికి తమ్మన్న మెరక శ్మశానంలో అంత్యక్రియలు నిర్వహించారు.