Share News

Real Estate Dispute: 400 కోట్ల భూమి కోసం రెండు శాఖల సిగపట్లు

ABN , Publish Date - Aug 12 , 2025 | 06:22 AM

భూమి కోసం రెండు శాఖల సిగపట్లు కబ్జాదారులకు కలసివస్తోంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో రూ. 400 కోట్లు విలువ చేేస 24.49 ఎకరాల భూమి తమదంటే, తమదంటూ పంచాయతీరాజ్‌, దేవదాయ శాఖలు కోర్టులో...

 Real Estate Dispute: 400 కోట్ల భూమి కోసం రెండు శాఖల సిగపట్లు

  • తాడేపల్లిలో ఖరీదైన ప్రాంతంలో 24.49 ఎకరాలు

  • 150 ఏళ్ల క్రితం లోకల్‌ బోర్డుకు కేటాయింపు

  • కాలక్రమంలో పంచాయతీరాజ్‌ చేతిలోకి

  • నాటి ఉత్తర్వుల్లో ‘నిత్య అన్నదాన సత్రం’ పదం

  • రంగంలోకి దేవదాయ శాఖ.. భూమి తమదేనంటూ నోటీసులు

  • 2001లో కోర్టులో కేసు.. నేటికీ తేలలేదు

  • ఇదే అదనుగా భూమిలో కబ్జాదారుల పాగా

(గుంటూరు సిటీ-ఆంధ్రజ్యోతి)

భూమి కోసం రెండు శాఖల సిగపట్లు కబ్జాదారులకు కలసివస్తోంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో రూ. 400 కోట్లు విలువ చేేస 24.49 ఎకరాల భూమి తమదంటే, తమదంటూ పంచాయతీరాజ్‌, దేవదాయ శాఖలు కోర్టులో పోరాటం చేస్తున్నాయి. ఇదే అదనుగా ఆక్రమణదారులు ఆ భూమిని కొంచెం కొంచెం కలిపేసుకుంటున్నారు. అయినా కూడా రెండు శాఖలకు అదేమీ పట్టటం లేదు. గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని సర్వే నంబర్‌ 63, 74, 75లో 24.49 ఎకరాలు ఉంది. హైవేకు పక్కన ఉండటం, భూమికి దగ్గరలో అపార్టుమెంట్‌లు కూడా కట్టడంతో ఇటీవల ఆ భూమి విలువ బాగా పెరిగింది. ప్రస్తుతం అక్కడ ఎకరం విలువ రూ. 18 కోట్ల నుంచి రూ. 20 కోట్ల వరకు పలుకుతోంది. సదరు భూమిని 1874లో అప్పటి కృష్ణా జిల్లా కలెక్టర్‌ లోకల్‌ బోర్డుకు కేటాయించారు. అప్పట్లో గుంటూరు కూడా కృష్ణా జిల్లాలోనే ఉండేది. 1904లో గుంటూరు జిల్లా రూపుదిద్దుకోవటంతో 24.49 ఎకరాల భూమిని లోకల్‌ బోర్డుకు బదలాయించారు. అప్పటి నుంచి లోకల్‌ బోర్డు ఆధ్వర్యంలోనే ఆ భూమి ఉంది. దానిని కౌలుకి ఇస్తూ వచ్చిన ఆదాయాన్ని కూడా లోకల్‌ బోర్డు తీసుకునేది. జిల్లా పరిషత్‌లు ఆవిర్భవించిన తర్వాత తాడేపల్లి భూమి వ్యవహారం అంతా పంచాయతీ రాజ్‌ అధికారులు చూసుకుంటున్నారు.


ఆ భూమిని లోకల్‌ బోర్డుకు కేటాయించిన ఉత్తర్వుల్లో నిత్య అన్నదాన సత్రం అనే మాట వాడటంతో 2001లో మొట్టమొదటి సారి దేవదాయ శాఖ స్పందించింది. సత్రం అన్న మాట ఉంది కాబట్టి భూమి దేవదాయ శాఖకు చెందుతుంది అంటూ జిల్లా పరిషత్‌కు నోటీసులు ఇవ్వటంతో గొడవ ఆరంభమైంది. భూమి తమకే చెందుతుందని దేవదాయ శాఖ కమిషనర్‌ కూడా ఆర్డర్‌ ఇవ్వటంతో జిల్లా పరిషత్‌ అధికారులు గుంటూరు కోర్టును ఆశ్రయించారు. అక్కడ విచారణ తర్వాత జిల్లా పరిషత్‌కు వ్యతిరేకంగా కోర్టు తీర్పు వచ్చింది. దీంతో 2005లో జిల్లా పరిషత్‌ హైకోర్టును ఆశ్రయించింది. వంద సంవత్సరాలకు పైబడి తమ అనుభవంలో ఉన్న భూమి తమదే అంటూ జిల్లా పరిషత్‌ చేసిన వాదనను హైకోర్టు సమర్థించింది. 2015లో జిల్లా పరిషత్‌కు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. ఆ వివాదం ఇంకా కోర్టు పరిధిలో ఉంది. దేవదాయ శాఖ కూడా కేసును విత్‌డ్రా చేసుకోవడానికి ముందుకు రావడంలేదని చెబుతున్నారు. దీంతో కోర్టు చుట్టూ అధికారులు తిరుగుతున్నారు.


ఏటా రూ. 1.20 లక్షలే ఆదాయం!

రెండు ప్రభుత్వ శాఖలు భూమి కోసం కొట్లాడుకొంటూ ఉండటం కొంతమందికి అనుకూలంగా మారింది. వాస్తవంగా ఉండాల్సిన 24.49 ఎకరాల భూమిలో కొంత ఆక్రమణకు గురైనట్లు తెలుస్తోంది. ఉన్న భూమికి కూడా అతి తక్కువ కౌలు చెల్లించి కొందరు నేతలు ఏళ్ల తరబడి అనుభవిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం అంత విస్తీర్ణం ఉన్న భూమికి ఏటా కేవలం రూ. 1.20 లక్షలు మాత్రమే కౌలు వస్తోంది. అంటే ఒక ఎకరాకు ఏటా కేవలం రూ. ఐదు వేలు కౌలు మాత్రమే ఇస్తున్నారు. అదే భూమిలో ప్రభుత్వం నిర్మాణాలు చేపడితే ఏటా కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అధికారులు అంటున్నారు.

కూటమి వచ్చాక కదలిక..

కూటమి అధికారంలోకి వచ్చిన తరవాత తాడేపల్లి భూమి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం దృష్టి పెట్టింది. జిల్లాకు చెందిన ఓ ముఖ్యనేత సమక్షంలో అధికారులు భేటీ కూడా అయ్యారు. వివాదం విషయాలు తెలుసుకున్న ఆ ముఖ్యనేత త్వరలోనే పరిష్కారం చూపిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఆ భూమిలో రాష్ట్రస్థాయి శిక్షణ కేంద్రం నిర్మించాలని డిప్యూటీ సీఎం యోచిస్తున్నట్లు సమాచారం. మరోనేత మాత్రం అక్కడ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు అనువైన భవనాలు నిర్మిేస్త బాగుంటుందన్న ప్రతిపాదనను తెరపైకి తెచ్చారని అధికారులు చెబుతున్నారు.

Updated Date - Aug 12 , 2025 | 06:22 AM