PVN Madhav: చర్చలతో సమస్యలకు పరిష్కారం
ABN , Publish Date - Sep 06 , 2025 | 05:34 AM
మంచి ఆలోచనలు, చర్చల ద్వారా ఎటువంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. గురువారం ఉదయం విజయవాడలో చాయ్ పే చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
అభివృద్ధా? అరాచక పాలనా? అన్నదానిపై ప్రజలు చర్చించాలి
విజయవాడలో చాయ్ పే చర్చా కార్యక్రమంలో మాధవ్
కృష్ణలంక, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): మంచి ఆలోచనలు, చర్చల ద్వారా ఎటువంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. గురువారం ఉదయం విజయవాడలో చాయ్ పే చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘ప్రజలను నేరుగా కలసి వారి అభిప్రాయాలను, ఆలోచనలు, సూచనలు తెలుసుకోవడం ద్వారా ఆ ప్రాంతానికి, రాష్ర్టానికి ఇంకా మంచి చేసే అవకాశం ఉంటుంది. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఈ ప్రాంతం బాగా దెబ్బతింది. కూటమి ప్రభుత్వంలో అమరావతి రాజధాని అభివృద్ధి చెందుతుంది. కేంద్రం సహకారంతో వేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. జీఎస్టీ తగ్గించి పేద, మధ్యతరగతి ప్రజలకు మోదీ ఉపశమనం కలిగించారు. గత ఏడాది ఈ రాష్ర్టానికి రూ.10 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. అన్ని రకాల పరిశ్రమలు రాష్ట్రంలో ఏర్పాటు అవుతున్నాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగడం ద్వారా ప్రజల ఆదాయ వనరులు పెరుగుతున్నాయి. మన ప్రాంతాల్లో తయారయ్యే ఉత్పత్తులను మనం కొనుగోలు చేయాలి. మళ్లీ దేశవ్యాప్తంగా స్వదేశీ ఉద్యమం ప్రారంభం కావాలి. ఆరాచక పాలన కావాలా? అభివృద్ధి పాలన కావాలా? అన్న అంశంపై చర్చ పెట్టాలి. ఎవరి హయాంలో ఈ దేశానికి, రాష్ర్టానికి మంచి జరిగిందో ప్రజలే ఆలోచించాలి, ఆత్మనిర్భర్ భారత్ కోసం అందరం కలిసి అడుగులు వేద్దాం’ అని మాధవ్ పిలుపునిచ్చారు.