Nimmagadda Ramesh: రెండో విడత భూసమీకరణపై చర్చావేదిక
ABN , Publish Date - Jul 31 , 2025 | 06:12 AM
రాజధాని అమరావతికి రెండో విడత భూసమీకరణపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో త్వరలో ఒక చర్చా వేదికను ఏర్పాటు చేయనున్నట్లు...
ఏకాభిప్రాయ సాధనకు ఇదోమార్గం: నిమ్మగడ్డ రమేశ్
అమరావతి, జూలై 30(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతికి రెండో విడత భూసమీకరణపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో త్వరలో ఒక చర్చా వేదికను ఏర్పాటు చేయనున్నట్లు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల కమిషన్ మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ‘జూలై 27న సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో విజయవాడలో ఒక సదస్సు జరిగింది. దానిలో సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు, మాజీ అడ్వొకేట్ జనరల్ డీవీ సీతారామ్మూర్తి... రెండో విడత భూసమీకరణపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని పేర్కొన్నారు. అంత పెద్దఎత్తున రెండో విడత భూసేకరణ, సమీకరణ అవసరమా? అనే అంశంపై స్పష్టత లేదు. గతంలో సేకరించిన భూమిని అభివృద్ధి చేసి, ఆ ఫలితాలను లబ్ధిదారులకు అందజేసిన తర్వాతనే రెండో విడత భూసేకరణ చేయవచ్చునన్న భావనలు ఒక వైపున వ్యక్తమవుతుండగా, అమరావతిలోనే ఇంత పెద్దఎత్తున భూసేకరణ చేయడం ప్రాంతీయ అభివృద్ధికి, సమతౌల్యానికి వ్యతిరేకమనే వాదనలు కూడా మరో వైపున వినిపిస్తున్నాయి.