Share News

స్పోర్ట్స్‌ స్కూల్‌పై వివక్ష

ABN , Publish Date - Nov 28 , 2025 | 11:21 PM

రెండేళ్లుగా స్పోర్ట్స్‌ స్కూల్‌లో విద్యార్థుల ప్రవేశాలు నిలిపివేశారు. మూడు నెలల్లో చదువు పూర్తి చేసుకునే సమయంలో ప్రవేశాలు కోరడంతో తల్లిదండ్రుల నుంచి పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

   స్పోర్ట్స్‌ స్కూల్‌పై వివక్ష
నెరవాడ మెట్ట సమీపంలోని ఏపి గురుకుల స్పోర్ట్స్‌ పాఠశాల

విద్యా సంవత్సరం చివరిలో ప్రవేశాల కోసం దరఖాస్తులా?

విద్యార్థులు జీవితాలతో చెలగాటం

నిధులు లేక నిలిచిన ప్రవేశాలు

కరువైన కనీస వసతులు

కనపడని మైదానాలు

క్రీడల్లో ప్రాక్టీసు చేసేదేలా?

రెండేళ్లుగా స్పోర్ట్స్‌ స్కూల్‌లో విద్యార్థుల ప్రవేశాలు నిలిపివేశారు. మూడు నెలల్లో చదువు పూర్తి చేసుకునే సమయంలో ప్రవేశాలు కోరడంతో తల్లిదండ్రుల నుంచి పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్రీడాకారులకు అవసరమైన వసతులు, నిఽధులు, క్రీడా పరికరాలు, క్రీడా మైదానాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2017లో టీడీపీ, 2021లో వైసీపీ పలు చోట్ల గిరిజన స్పోర్ట్స్‌ స్కూళ్లను ప్రారం భించాయి. వాటిని అభివృద్ధి చేయడంలో వెనుకడుగు వేశాయి. 2021 పిబ్రవరిలో ప్రా రంభించిన పాఠశాలల్లో 2022-23లో ప్రవేశాలు నిలిపివేశారు. మళ్లీ 2023-24 ఆగస్టులో ప్రవేశాలు నిర్వహించారు. 2024- 25లో మళ్లీ ప్రవేశాలు నిలిపివేశారు. ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభంలో ప్రవేశ పరీక్షలు నిర్వహించాల్సిన ఏపీ గురుకుల పాఠశాలల సంస్థ విద్యాసంవత్సరం చివరిలో ప్రవేశ పరీక్షలు నిర్వహించి ఎంపిక చేయడానికి దరఖాస్తులు కోరడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పాణ్యం, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): గిరిజన స్పోర్ట్స్‌ స్కూళ్లపై ప్రభుత్వం వివక్ష చూపుతోంది. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోంది. సమయం సందర్భం లేకుండా 2025-26 విద్యా సంవత్సరం పూర్తి కావస్తున్న సమయంలో క్రీడా పాఠశాలలకు దరఖాస్తు కోరడం విడ్డూరంగా ఉందన ్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈనెల 27వ తేదీ లోపల బాలురు, 28వ తేదీ లోపు బాలికల స్పోర్ట్స్‌ స్కూల్స్‌కు దరఖాస్తు చేసుకోవాలని ఐటీడీఏ శ్రీశైలం పీవో వెంకటశివప్రసాద్‌ ప్రకటించారు. 2017లో టీడీపీ ప్రభుత్వం విశాఖ ఏజన్సీ లోని అరకులో గిరిజన విద్యార్థులను క్రీడారంగంలో ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలనే ఉద్ధేశంతో ప్రత్యేకంగా గిరిజన విద్యార్థులకు స్పోర్ట్స్‌ స్కూల్‌ ఏర్పాటు చేసింది. దీంతో గిరిజన విద్యార్థులు క్రీడా రంగంలో రాణించడానికి మంచి అవకాశమేర్పడింది. కాగా ఈపాఠశాలకు దీటుగా మరిన్ని పాఠశాలలను ఏర్పాటు చేయడానికి వైసీపీ ప్రభుత్వం 2021 పిబ్రవరి 11న రాష్ట్ర వ్యాప్తంగా ఆరు ప్రాంతాల్లో స్పోర్ట్స్‌ స్కూల్స్‌ను ఏర్పాటు చేసింది.

సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ..

సమీకృత గిరిజనాభివృద్ధ్ది సంస్థ (పీటీజీ చెంచు) శ్రీశైలం పరిధిలో అనంతపురం, కృష్ణా, కర్నూలు, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, నంద్యాల జిల్లాల విద్యార్థినులకు నంద్యాల జిల్లా పాణ్యం మండలం బలపనూరు పరిధిలోని నెరవాడ మెట్ట వద్ద గల ఏపీ గిరిజన గురుకుల బాలికల పాఠశాలను క్రీడా పాఠశాలగా 6, 7, 8 తరగతులను ఏర్పాటుచేసింది. క్రీడలపై ఆసక్తి గల బాలికలను 73మందిని క్రీడల్లో ఎంపిక చేసి 37 మందికి ప్రవేశం కల్పించారు. పాఠశాలలు ప్రారంభించే సమయంలో వాటి అభివృద్ధికి రూ.30లక్షలతో ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. ఒక్కపైసా కూడా రాలేదు. టీడీపీ హయాంలో విశాఖ ఏజన్సీ ప్రాంతంలోని అరకులో గిరిజన విద్యార్థులను క్రీడల్లో అభివృద్ది చేయాలన ్న లక్ష్యంతో క్రీడా పాఠశాలను ఏర్పాటు చేసింది. దీని కంటే మిన్నగా ఆరు పాఠశాలలను వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినా అనుకున్న లక్ష్యం నెరవేరలేదన్న ఆరోపణలున్నాయి.

ప్రత్యేక నిధులు కేటాయించకుండానే..

క్రీడా పాఠశాలకు ప్రత్యేక నిధులు కేటాయించకుండానే పాఠశాలలు ఏర్పాటు చేయడం ఎంత వరకు సబబు అని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. స్పోర్ట్స్‌ స్కూల్‌కు ఎంపికైన బాలికలకు రోజూ రూ.125లు కేటాయించాలి. సాధారణ బాలికలకు కేటాయించే రూ.47లోనే క్రీడా విద్యార్థులను సరిపుచ్చుతున్నారు. క్రీడాకారులు శారీరక ధృడత్వాన్ని పొందలేక క్రీడల్లో రాణించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో క్రీడాపాఠశాలలో చేరే విద్యార్థులు పాఠశాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. క్రీడలకు అనువైన క్రీడా మైదానం లేకపోవడంతో ఇతర పాఠశాలల క్రీడామైదానాలపై ఆధారపడవలసిన దుస్థితి ఏర్పడింది. క్రీడలకు సరైన ప్రోత్సాహం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. . గతంలో పాఠశాలలో చేరిన క్రీడాకారులు రెండేళ్లపాటు క్రీడా శిక్షణకు దూరమయ్యారు. ఈ ఏడాది ఎంపిక చేసిన విద్యార్థినులకు అదే పరిస్థితి కొనసాగితే లక్ష్యంతో చేరిన విద్యార్థుల ప రిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది.

సరైన సమయం కాదు :

స్పోర్ట్స్‌ స్కూల్‌లో ప్రవేశాలు, బ్యాక్‌లాగ్‌ కల్పించడం సంతోషించదగ్గ విషయమే కానీ ఈ విద్యా సంవత్సరం సగ భాగం పూర్తయిన తర్వాత అడ్మిషన కోరడం సరైంది కాదు. స్పోర్ట్స్‌ స్కూల్‌కు అన్ని ఏర్పాట్లు ఏప్రిల్‌, మే మాసంలో పూర్తిచేసి ఉంటే బాగుండేది.

ఫ సిమియోన, పీఆర్‌టీయూ రాష్ట్ర కౌన్సిలర్‌

గురుకుల కమిషనర్‌ ఆదేశాల మేరకే..

రాష్ట్ర గురుకుల పాఠశాలల సంస్థ కమిషనర్‌ ఆదేశాల మేరకే స్పోర్ట్స్‌ స్కూళ్లలో అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహిస్తున్నాం. ఈఏడాదిగానీ, వచ్చే సంవత్సరానికి గానీ విద్యార్థులను పాఠశా లల్లో చేర్చుకోవచ్చు. ఇప్పటివరకు అడ్మిషన్లకు మాత్రమే ఆదేశాలు అందాయి. విద్యార్థులకు ఎటువంటి నిధులు గానీ, వ్యాయామ ఉపాధ్యాయులనుగానీ కేటాయించలేదు.

ఫ వెంకట శివప్రసాద్‌, పీవో, ఐటీడీఏ శ్రీశైలం

Updated Date - Nov 28 , 2025 | 11:21 PM