Share News

Power Sector: డిస్కంలకు రూ.2,555 కోట్ల టారిఫ్‌ సబ్సిడీ విడుదల

ABN , Publish Date - Jul 12 , 2025 | 04:34 AM

రాష్ట్ర విద్యుత్‌ సంస్థలు ప్రస్తుతం రూ.12,225.14 కోట్ల అప్పుల్లో కూరుకుపోయాయి. ఇందులో డిస్కంలు రూ.7,225,14 కోట్లు.. రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థలు రూ.5,000 కోట్లు రుణపడ్డాయి.

Power Sector: డిస్కంలకు రూ.2,555 కోట్ల టారిఫ్‌ సబ్సిడీ విడుదల

డిస్కంల అప్పులు రూ.7,225 కోట్లు

అమరావతి, జూలై 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విద్యుత్‌ సంస్థలు ప్రస్తుతం రూ.12,225.14 కోట్ల అప్పుల్లో కూరుకుపోయాయి. ఇందులో డిస్కంలు రూ.7,225,14 కోట్లు.. రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థలు రూ.5,000 కోట్లు రుణపడ్డాయి. ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాల వాయిదాలను చెల్లించాల్సిందేనని ప్రతి నెలా పదో తేదీలోగా కేంద్రం గతంలోనే డిస్కంలకు స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ కన్సల్టెన్సీ సంస్థ ‘ప్రాప్తి’ పోర్టల్‌ అందించిన వివరాల ప్రకారం.. గత నెలలో డిస్కంలు చెల్లించాల్సిన వాయిదా రూ.2,661.77 కోట్లు కాగా.. ఈ నెల వాయిదా రూ.4.563.37 కోట్లు కలిపి మొత్తం రూ.7,225.14 కోట్లుకు వాటి రుణాలు చేరాయి. నెలనెలా వాయిదాల బకాయిలు పెరిగిపోతుండటంతో డిస్కంలు ప్రభుత్వ సాయం కోరుతున్నాయి. అదేవిధంగా రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థలు బొగ్గు పంపిణీ సంస్థలతోపాటు ఆర్థిక సంస్థలకు రూ.5,000 కోట్లు వరకు చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం ఇవ్వకపోతే.. వాటి మనుగడ కష్టమని జెన్కో అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇంకోవైపు.. డిస్కంలకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి టారిఫ్‌ సబ్సిడీ కింద రూ.2,555 కోట్లను విడుదల చేస్తూ రాష్ట్ర ఇంధన శాఖ బాధ్యతలు కూడా చూస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గృహ, పారిశ్రామిక, వ్యవసాయ, ఎస్సీ, ఎస్టీ విద్యుత్‌ వినియోగదారులకు సబ్సిడీ కింద రూ.13,000 కోట్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Updated Date - Jul 12 , 2025 | 08:35 AM