Disaster Risk Reduction: విపత్తు ప్రమాద తగ్గింపు ముఖ్యం
ABN , Publish Date - Oct 14 , 2025 | 04:58 AM
విపత్తుల ముందు ప్రమాద తగ్గింపు, నష్ట నివారణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
డీఎంఏ ఎండీ ప్రఖర్‌జైన్
అమరావతి, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): విపత్తుల ముందు ప్రమాద తగ్గింపు, నష్ట నివారణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. సోమవారం అంతర్జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు దినోత్సవం సందర్భంగా తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ(డీఎంఏ) కార్యాలయంలో యూనిసెఫ్ ఆధ్వర్యంలో ‘ఏపీలో సంసిద్ధత, భాగస్వామ్యంతో సామర్థ్యంకల కమ్యూనిటీల నిర్మాణం’ అనే అంశంపై వర్చువల్‌గా వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండీ ప్రఖర్ జైన్ మాట్లాడుతూ... ‘విపత్తులను ఎదుర్కొనేందుకు సంసిద్ధత, అప్రమత్తత ముఖ్యం. విపత్తు ప్రమాదాలపై ముందుగా టెక్ట్స్ మెస్సేజ్‌లు, వాట్సాప్ మెస్సేజ్‌లు, మీడియా, సోషల్ మీడియా, అధికార యంత్రాంగం ద్వారా ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నాం. క్షేత్రస్థాయిలో చివరి వ్యక్తి వరకు ఈ హెచ్చరికలు చేరేలా స్వచ్ఛంద, కార్పొరేట్ సంస్థలు కృషి చేయాలి. విపత్తు తర్వాత పునరుద్ధరణకు ఎక్కువ ఖర్చు చేయడం కన్నా.. ముందుగా ప్రమాద తగ్గింపునకు నిధులు కేటాయించడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించవచ్చు. జీవనోపాధిని కాపాడవచ్చు’ అని పేర్కొన్నారు. వర్క్‌షా్‌పలో విపత్తుల సంస్థ ఈడీ వెంకట దీపక్, యునిసెఫ్ ప్రతినిధులు మహేంద్ర, రాజారామ్, ప్రసాద్, ఎన్‌ఐడీఎం నుంచి బాలు, ఎస్‌డీఎంఏ నుంచి హరీశ్ నాయుడు, బస్వంత్‌రెడ్డి పాల్గొన్నారు.