AP Govt: విపత్తుల్లో.. నిశ్చింతగా
ABN , Publish Date - Oct 09 , 2025 | 05:19 AM
అగ్ని ప్రమాదాలు జరిగితే... వరదలు సంభవిస్తే.. ఇంకా అనుకోని ఘటనలు జరిగితే మనకు వెంటనే గుర్తొచ్చేది.. విపత్తుల నిర్వహణ శాఖ. దానిలో భాగమైన అగ్నిమాపక శాఖ. హారన్ మోగించుకుంటూ రోడ్డుపై నీళ్ల కారు వెళ్లిందంటే..
పక్కా ప్రణాళికతో విపత్తుల శాఖ అభివృద్ధి
కొత్త ఫైర్ స్టేషన్లు.. ఫైరింజన్లు, పరికరాలకు నిధులు
సిబ్బందికి అంతర్జాతీయస్థాయి శిక్షణ
అమరావతిలో అధునాతన కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
అగ్ని ప్రమాదాలు జరిగితే... వరదలు సంభవిస్తే.. ఇంకా అనుకోని ఘటనలు జరిగితే మనకు వెంటనే గుర్తొచ్చేది.. విపత్తుల నిర్వహణ శాఖ. దానిలో భాగమైన అగ్నిమాపక శాఖ. హారన్ మోగించుకుంటూ రోడ్డుపై నీళ్ల కారు వెళ్లిందంటే.. ఎక్కడో అగ్ని ప్రమా దం జరిగిందని అంతా అనుకుంటాం. ఆ ప్రమాదం గురించిన ఆలోచనలే మనలో మెదులుతూ ఉంటాయి. ఆ వాహనం... సం బంధిత శాఖ అంతలా సమాజంతో పెనవేసుకుపోయాయి. దీంతోపాటు వరదలు, ఉప్పెనలు సంభవించినప్పుడు విపత్తుల నిర్వహణ శాఖ స్పందించి రంగంలోకి దిగుతుంది. అటువంటి శాఖను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో కొత్తగా ఫైర్ స్టేషన్లు నిర్మించి, పాతవాటికి మరమ్మతులు చేయించి, కొత్తగా ఫైరింజన్లు కొనుగోలు చేసి, సిబ్బందికి అధునాతన శిక్షణ ఇచ్చి, ఆధునిక పరికరాలు సమకూర్చి విపత్తుల నిర్వహణను పటిష్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమయ్యింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో అవసరమైన నిధులు కూడా విడుదల చేసింది. ఈమేరకు రూ.252.87కోట్ల నిధుల విడుదలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మొదటి విడతలో రూ.62.92కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం.. మిగతా మూడు విడతల నిధులకు పాలనాపరమైన అనుమతులు ఇవ్వడంతో అగ్నిమాపక శాఖలో అభివృద్ధి పరుగులు తీయనుంది.
ఆధునిక ఫైర్‌స్టేషన్లు, ఫైరింజన్లు
రాష్ట్రంలో తరచూ అగ్నిప్రమాదాలు సంభవిస్తున్న ప్రాంతాల్లో అగ్నిమాపక స్టేషన్ల ఆవశ్యకతను గుర్తించిన ఆ శాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అందులో అత్యవసరమైన ప్రాంతాల్లో రూ.75.82కోట్ల ఖర్చుతో ఫైర్ స్టేషన్లు నిర్మించబోతున్నారు. ఎలాంటి ప్రమాదాన్నైనా నివారించగలిగే అధునాతన ఫైరింజన్లు కొనుగోలు చేయనున్నారు. ప్రస్తుతం అగ్నిమాపక శాఖలో ఉన్న ఫైరింజన్లలో ఎక్కువగా కాలం చెల్లినవే ఉన్నాయి. వాటి స్థానంలో అడ్వాన్స్ ఫైరింజన్లు కొనుగోలు చేస్తున్నారు. నీటితోపాటు ఎమర్జెన్సీ లైటింగ్, జనరేటర్, వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు బోట్లు ఇలా రెస్క్యూ టీమ్‌కు అవసరమైనవి అన్నీ ఇందులో ఉంటాయి. ఇటీవల విశాఖపట్నం, పరవాడ పరిశ్రమల్లో జరిగిన అగ్ని ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని హజ్మత్ (హజార్డస్ మెటీరియల్) వాహనాన్ని కూడా సమకూర్చుకొంటున్నారు. ఇందులో నీటితోపాటు ఫోమ్, పౌడర్, కార్బన్ డయాక్సైడ్ ఉంటాయి. అగ్ని ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఎలా రిస్క్యూ చేయాలనే దానిపై మన రాష్ట్రంలో కొన్నేళ్లుగా థియరిటికల్ శిక్షణ తప్ప క్షేత్రస్థాయిలో లేదు. రాష్ట్ర విభజన తర్వాత మనకు శిక్షణా కేంద్రం లేకపోవడంతో అప్పుడప్పుడు పారిశ్రామిక వాడ ల్లో ప్రదర్శన చేయడం మినహా సరైన శిక్షణ లేదు. ఈ సమస్యను అధిగమించేందుకు అంతర్జాతీయ స్థాయి శిక్షణా కేంద్రాన్ని నిర్మించబోతున్నారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు పారిశ్రామికవాడల్లో ఎలా నివారించాలి.. కమర్షియల్ కాంప్లెక్స్‌ల్లో ఎలా కట్టడి చేయాలి, అపార్ట్‌మెంట్లు, ఆస్పత్రులు, విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు, ఫంక్షన్ హాళ్లు ఇలా ప్రతిచోటా ఎటువంటి మెళకువలు అవలంబించాలనే దానిపై సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు.
సెంట్రల్ కమాండ్ కంట్రోల్..ప్రతి ఫైరింజన్‌కూ కెమెరా
రాష్ట్రంలో ఎక్కడ ప్రకృతి విపత్తు, అగ్ని ప్రమాదం సంభవించినా ఫైర్ స్టేషన్‌కు ఫోన్ కాల్ వచ్చిన వెంటనే కమాండ్ కంట్రోల్‌కు చేరేలా అమరావతిలో అధునాతన కమాండ్ కంట్రోల్ భవనాన్ని నిర్మించబోతున్నారు. అమరావతిలో రెండెకరాల విస్తీర్ణంలో రూ.22కోట్లతో నిర్మించే ఈ కమాండ్ కంట్రోల్ భవనం నుంచి రాష్ట్రంలోని అన్ని ఫైరింజన్లకు జీపీఎ్‌సతోపాటు కెమెరాతో అనుసంధానిస్తారు. దీంతో ప్రమాదాల తీవ్రతను ఇక్కడి నుంచే వీక్షించి వేగంగా, కచ్చితత్వంతో స్పందించేలా సిబ్బందికి అనుభవజ్ఞులు సూచనలు ఇస్తారు. ఫోన్ కాల్ అందుకున్న సమయం నుంచి ప్రమాద స్థలికి చేరుకునే వరకూ జీపీఎస్ ద్వారా ఫైరింజన్‌ను పర్యవేక్షిస్తారు. ఈ వ్యవస్థ ద్వారా ప్రమాదాలను త్వరగా అదుపు చేసి ప్రాణ, ఆస్తి నష్టాన్ని బాగా తగ్గించవచ్చని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు.