Digital Crop Survey: డిజిటల్ సర్వే నుంచి సాగు కాని భూముల మినహాయింపు
ABN , Publish Date - Oct 20 , 2025 | 05:08 AM
సాగులో లేని భూములతోపాటు మరికొన్నింటికి డిజిటల్ పంటల సర్వే నుంచి కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించినట్లు వ్యవసాయశాఖ డైరెక్టర్ మనజీర్ జిలానీ వెల్లడించారు.
రాష్ట్రంలో 55శాతం డిజిటల్ పంటల సర్వే పూర్తి
అమరావతి, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): సాగులో లేని భూములతోపాటు మరికొన్నింటికి డిజిటల్ పంటల సర్వే నుంచి కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించినట్లు వ్యవసాయశాఖ డైరెక్టర్ మనజీర్ జిలానీ వెల్లడించారు. ఈ-పంట నమోదులో కాలువలు, రోడ్లు, భవనాలతో పాటు బీడు భూములు, సర్వేకు వీలు కాని ఆక్వా, వ్యవసాయేతర భూ కమతాలకు సర్వే నుంచి మినహాయింపు ఇచ్చినట్లు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సవరించిన మార్గదర్శకాల ప్రకారం ఈనెల 30లోగా ఖరీఫ్-2025లో ఈ-పంట నమోదు ప్రక్రియను ముగించాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. గడువు సమీపిస్తున్నందున 100 శాతం ఈ- పంట నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 2.91 కోట్ల ల్యాండ్ ప్యాకెట్స్ ఉండగా, శనివారం నాటికి 1.59 కోట్ల సర్వే(55ు)జరిగినట్లు తెలిపారు. మిగిలిన 1.33 కోట్ల భూ కమతాల్లో ఎక్కువ భాగం సర్వేకు సాధ్యం కాని కమతాలు ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు సాగులో లేని, వ్యవసాయేతర భూ కమతాలను నిలుపుదల చేసుకునే అవకాశం కేంద్రం కల్పించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన సర్వేలో ప్రకాశం, కాకినాడ, అనంతపురం జిల్లాలు మొదటి మూడు స్థానాల్లో ఉండగా, చివరి స్థానంలో విశాఖ, అల్లూరి, అనకాపల్లి జిల్లాలు ఉన్నట్లు ఆయన వివరించారు.