Share News

SCIFI Chairman Raju Vegesna: డిజిటల్‌ ప్లంబింగ్‌తో విస్తృత పెట్టుబడులు

ABN , Publish Date - Oct 13 , 2025 | 05:45 AM

డిజిటల్‌ ప్లంబింగ్‌తో విశాఖపట్నానికి విస్తృత స్థాయిలో విదేశీ పెట్టుబడులు వస్తాయని సిఫీ టెక్నాలజీస్‌ చైర్మన్‌ రాజు వేగేశ్న తెలిపారు. రుషికొండ ఐటీ పార్కులో ఏఐ ఎడ్జ్‌ డేటా సెంటర్‌కు ఆదివారం శంకుస్థాపన..

SCIFI Chairman Raju Vegesna: డిజిటల్‌ ప్లంబింగ్‌తో విస్తృత పెట్టుబడులు

  • బెంగళూరుతో పోటీ పడేలా విశాఖ అభివృద్ధి

  • ‘ఆంధ్రజ్యోతి’తో సిఫీ చైర్మన్‌ రాజు వేగేశ్న

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

‘‘డిజిటల్‌ ప్లంబింగ్‌’’తో విశాఖపట్నానికి విస్తృత స్థాయిలో విదేశీ పెట్టుబడులు వస్తాయని సిఫీ టెక్నాలజీస్‌ చైర్మన్‌ రాజు వేగేశ్న తెలిపారు. రుషికొండ ఐటీ పార్కులో ఏఐ ఎడ్జ్‌ డేటా సెంటర్‌కు ఆదివారం శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. విశాఖ కాస్మోపాలిటన్‌ నగరమని, ప్రస్తుతం ఐటీలో ద్వితీయ శ్రేణి (టైర్‌-2) నగరంగా ఉందని, త్వరలో ప్రథమ శ్రేణి నగరాలతో పోటీ పడుతుందని చెప్పారు.

ప్రశ్న: డిజిటల్‌ ప్లంబింగ్‌ అంటే..?

రాజు వేగేశ్న: సముద్రం అంతర్భాగం నుంచి తీసుకువచ్చే సబ్‌మెరైన్‌ కేబుళ్లతో విశాఖలోని సిఫీ ఏఐ ఎడ్జ్‌ డేటా సెంటర్‌ను అనుసంధానం చేస్తాం. ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న సమాచారాన్ని ఇక్కడికి తీసుకొస్తాం. అవసరమైన రాష్ట్రాలకు, దేశాలకు పంపిస్తాం. ఇలా డేటాని పంపింగ్‌ చేయడాన్ని ‘డిజిటల్‌ ప్లంబింగ్‌’గా వ్యవహరిస్తాం. ఇందులో విశాఖ అగ్రస్థానంలో నిలవనుంది. డిజిటల్‌ ప్లంబింగ్‌ వల్ల మరిన్ని డేటా సెంటర్లు వస్తాయి. త్వరలోనే ఒక గిగావాట్‌, రెండు గిగావాట్‌ సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లు ఏర్పాటవుతాయి. విదేశీ పెట్టుబడులు వస్తాయి. ఎకో సిస్టమ్‌ అభివృద్ధి చెందుతుంది.


భారీగా ఉద్యోగాలు వస్తాయా?

ఇంజనీరింగ్‌, మెడికల్‌ కాలేజీలు ఎలాగైతే ఇంజనీర్లను, డాక్టర్లను తయారు చేసి సమాజానికి అందిస్తున్నాయో.. డేటా సెంటర్లు కూడా ఆ విధంగానే పనిచేస్తాయి. వీటివల్ల ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్నా.. పరోక్షంగా ఎకో సిస్టమ్‌ అభివృద్ధి చెంది పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుంది. ఐటీలో అగ్రస్థానంలో ఉన్న బెంగళూరుతో పోటీ పడేలా విశాఖ ఎంతో అభివృద్ధి సాధిస్తుంది.

ఈ రంగంలో మీకున్న అనుభవం ఏమిటి?

భారత్‌లో 25ఏళ్ల క్రితమే డేటా సెంటర్లను సిఫీ ప్రారంభించింది. ముంబైలో 250 మెగావాట్లు, నోయిడాలో 130 మెగావాట్లు, చెన్నైలో మరో 130 మెగావాట్ల డేటా సెంటర్లు నిర్వహిస్తున్నాం. నాస్డాక్‌లో నమోదైన రెండు కంపెనీల్లో ఒకటి ఇన్ఫోసిస్‌ అయితే రెండోది సిఫీ. డేటా సెంటర్‌ ఆపరేషన్లు రెండేళ్లలో ప్రారంభించాలనే లక్ష్యంతో విశాఖ వచ్చాం. నేనూ ఏపీకి చెందినవాడినే. మంత్రి లోకేశ్‌ చాలాకాలం నుంచి తెలుసు. విశాఖ కాస్మోపాలిటన్‌ నగరం. ఇక్కడ అన్ని ప్రాంతాల వారు ఎటువంటి భేదభావాలు లేకుండా కలిసి మెలిసి ఉంటారు. ఇక్కడ అందమైన బీచ్‌లు ఉన్నాయి. పర్యాటకంగా అభివృద్ధి చెందుతోంది. వీటన్నింటి కంటే మంచి పాలసీలు, పూర్తి సహకారం అందించే ప్రభుత్వం ఉండటం వల్లనే ముందుకొచ్చాం.

Updated Date - Oct 13 , 2025 | 05:46 AM