Share News

AP CM Chandrababu Naidu: సంజీవనిలో డిజిటల్‌ హెల్త్‌ రికార్డులు

ABN , Publish Date - Dec 17 , 2025 | 05:14 AM

రాష్ట్ర ప్రజల డిజిటల్‌ హెల్త్‌ రికార్డులను సంజీవని ప్రాజెక్టు ద్వారా రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

AP CM Chandrababu Naidu: సంజీవనిలో డిజిటల్‌ హెల్త్‌ రికార్డులు

  • ఏడాదిలోగా సిద్ధం చేస్తాం: ముఖ్యమంత్రి

  • ప్రజారోగ్య పరిరక్షణకు మెరుగైన విధానాలు

  • అంతర్జాతీయ నిపుణులు సలహాలివ్వాలి

  • సమీక్షలో చంద్రబాబు స్పష్టీకరణ

అమరావతి, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రజల డిజిటల్‌ హెల్త్‌ రికార్డులను సంజీవని ప్రాజెక్టు ద్వారా రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఏడాదిలోగా డిజిటల్‌ హెల్త్‌ రికార్డులను సిద్ధం చేస్తామన్నారు ప్రజారోగ్య పరిరక్షణకు మెరుగైన విధానాలతో సేవలు అందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ఆరోగ్యశాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. గేట్స్‌ ఫౌండేషన్‌తో కలిసి ఆరోగ్య రంగంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంజీవని సహా వివిధ ప్రాజెక్టులపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకోవడంతో పాటు నిపుణుల సలహాలను తీసుకోవాలని సూచించారు. గేట్స్‌ ఫౌండేషన్‌ సహకారంతో కుప్పం, చిత్తూరు జిల్లాల్లో డిజిటల్‌ నెర్వ్‌ సెంటర్‌ ద్వారా ఈ వివరాలను సేకరించి ఇంటిగ్రేట్‌ చేశామని, రియల్‌ టైమ్‌లోనే వారి వివరాలు తెలుసుకునేలా సంజీవని ప్రాజెక్టు పని చేస్తుందని చెప్పారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా దీనిని అమలు చేస్తామన్నారు. ‘ఆరోగ్య సమస్యల పరిష్కారానికి యోగాతో పాటు నేచురోపతిని ప్రోత్సహించాలి. ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు పెద్దఎత్తున పెరగాలి. మెడ్‌టెక్‌ పార్కు ద్వారా అధునాతన వైద్య పరికరాలను రూపొందిస్తున్నాం. వ్యాధులను నివారించే విధానాలపై దృష్టి పెడితే ప్రజల వైద్య ఖర్చులు చాలా వరకూ తగ్గుతాయి. వారి ఆరోగ్యం కూడా బాగుంటంది. వైద్యారోగ్య రంగంలో మరింత వినూత్నంగా ప్రాజెక్టులు చేపట్టేందుకు అత్యున్నత స్థాయి నిపుణుల బృందం సలహాలివ్వాలని కోరుతున్నాం. ముంబైలో త్వరలో గ్లోబల్‌ ఏఐ కన్వెన్షన్‌ జరుగనుంది. ఇందులో వైద్యారోగ్యంలో టెక్నాలజీ వినియోగంపై ప్రభుత్వం రూపొందిస్తున్న విధానాలను ప్రదర్శించాలని ఆలోచన చేస్తున్నాం. దీనికి అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేయాలని నిపుణులను కోరుతున్నా’ అని చెప్పారు.


వర్చువల్‌గా నిపుణుల బృందం హాజరు: రాష్ట్రంలో మెరుగైన ప్రజారోగ్య నిర్వహణకు గేట్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జాతీయ, అంతర్జాతీయ వైద్య నిపుణులతో కూడిన 10 మంది సభ్యుల బృందాన్ని నియమించిన సంగతి తెలిసిందే. యూఎన్‌ఎయిడ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పీటర్‌ పాయిట్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థ సీనియర్‌ శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్‌, ఎఐజీ చైర్మన్‌ డి.నాగేశ్వర్‌ రెడ్డి, సింగపూర్‌ నేషనల్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ఇక్‌ ఇంగ్‌ టియో, రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఆర్తి అహుజా, సైటెస్‌ చైర్‌ పర్సన్‌ రిజ్వాన్‌ కొయిటా, కోస్లా ల్యాబ్స్‌ వ్యవస్థాపకుడు శ్రీకాంత్‌ నాదముని, గేట్స్‌ ఫౌండేషన్‌ జినోమిక్స్‌ అండ్‌ ఎపిడమాలజీ డైరెక్టర్‌ గగన్‌దీప్‌ కాంగ్‌, పబ్లిక్‌హెల్త్‌ నిపుణురాలు మార్గరెట్‌ ఎలిజిబెత్‌, ఢిల్లీ ఎయిమ్స్‌ ఎండోక్రైనాలజీ విభాగాధిపతి నిఖిల్‌ టాండన్‌ వీరిలో ఉన్నారు. వీరు వర్చువల్‌గా సీఎం సమీక్షకు హాజరయ్యారు. ఆరోగ్య రంగంలో నర్సులు, వైద్యులు అందుబాటులో ఉండడం, పౌష్టికాహారం ముఖ్యమని సౌమ్య సూచించారు.


మరిన్ని విషయాలు

  • ఏపీ సెంటర్‌ ఫర్‌ డిజిటల్‌ హెల్త్‌ కేర్‌ కేంద్రంగా తయారవుతోందని, వైద్య విద్యార్థులు, నర్సులవంటి వారికి డిజిటల్‌ హెల్త్‌ కేర్‌లో శిక్షణ అందించాలని రిజ్వాన్‌ సూచించారు.

  • అన్ని వ్యాధులకు ఒకే రకమైన విధానాలను అనుసరించలేమని, క్లినికల్‌ మేనేజ్‌మెంట్‌ అసె్‌సమెంట్‌ ద్వారా వేర్వేరు రకాలుగా వైద్యారోగ్య శాఖ చర్యలు చేపట్టాలని నిఖిల్‌ టాండన్‌ అన్నారు.

  • హెల్త్‌ ఎడ్యుకేషన్‌ నుంచే హెల్త్‌ కేర్‌ సాధ్యమవుతుందని నాగేశ్వరరెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రజారోగ్య పర్యవేక్షణకు హెల్త్‌ సెక్రటేరియట్‌ ఏర్పాటు చేసుకుని పర్యవేక్షించేలా కార్యాచరణ రూపొందిస్తామని గేట్స్‌ ఫౌండేషన్‌ ఇండియా డైరెక్టర్‌ అర్బనా వ్యాస్‌ అన్నారు.

  • నిపుణుల సలహాలను మరింత లోతుగా చర్చించి వాటిని అమలు చేస్తామని మంత్రి సత్యకుమార్‌ తెలిపారు. చంద్రబాబు నిరంతరం ప్రజారోగ్యం రంగాన్ని ఎలా పటిష్ఠపరచాలన్న అంశంపైనే ఆలోచన చేస్తారని చెప్పారు.

  • ఇకపై ఏడాదిలో రెండుసార్లు నిపుణుల బృందంలో భేటీ అవ్వాలని సీఎం సూచించారు. వారి సలహాలు, సూచనలను క్రోడీకరించి కార్యాచరణ ప్రణాళిక తయారు చేసే బాధ్యతను అర్చనా వ్యాస్‌కు అప్పగించారు.

Updated Date - Dec 17 , 2025 | 05:15 AM