Share News

కష్టాలూ.. నష్టాలూ

ABN , Publish Date - Nov 20 , 2025 | 12:04 AM

ఏడాదంతా మాకు కష్టాలూ.. నష్టాలే.. ప్రభుత్వం నుంచి మాకు సహాయ సహకారాలు అందితేనే వాటి నుంచి బయట పడుతాం..

  కష్టాలూ.. నష్టాలూ
ఉల్లి రైతులు చిన్న నాగన్న, అమానుల్లాతో మాట్లాడుతున్న కేంద్ర బృందం అధికారులు

కేంద్ర బృందం ముందు కన్నీళ్లు పెట్టుకున్న రైతులు

కేంద్రం సహకరించాలి- కర్నూలు మార్కెట్‌ యార్డు సెలక్షన గ్రేడ్‌ సెక్రటరీ జయలక్ష్మి

కర్నూలు అగ్రికల్చర్‌, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఏడాదంతా మాకు కష్టాలూ.. నష్టాలే.. ప్రభుత్వం నుంచి మాకు సహాయ సహకారాలు అందితేనే వాటి నుంచి బయట పడుతాం.. లేకపోతే ఇలా పస్తులతోనే ఉండాల్సి వస్తుందని ఉల్లి రైతులు కేంద్ర బృందానికి కన్నీళ్లతో తమ బాధలు చెప్పుకున్నారు. బుధవారం ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర బృందంలోని ఉన్నతాధికారులు ఉల్లి రైతుల సమస్యలు తెలుసుకోవడానికి కర్నూలు మార్కెట్‌ యార్డులో ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు గడిపారు. మార్కెట్‌ యార్డులోకి ప్రవేశించగానే ముందుగా గంట సేపు కర్నూలు మార్కెట్‌ కమిటీ యార్డు సెలక్షన గ్రేడ్‌ సెక్రటరీ జయలక్ష్మితో పాటు ఉద్యాన శాఖ జిల్లా అధికారి కృష్ణారెడ్డి, మార్కెటింగ్‌శాఖ ఏడీఎం నారాయణమూర్తి తదితర జిల్లా అధికారులతో దాదాపు గంట సేపు ఉల్లి రైతుల సమస్యలపై చర్చించారు. కేంద్ర బృందం అధికారులతో సెక్రటరీ జయలక్ష్మి జిల్లాలో ఉల్లి రైతుల స్థితిగతులను వివరించారు. రాష్ట్రంలో ఉల్లి సాగులో ఉమ్మడి జిల్లా మొదటి స్థానంలో ఉందని, అందులో భాగంగా కర్నూలు మార్కెట్‌ కమిటీ యార్డులోనే ఉల్లి క్రయవిక్రయాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ఏడాదిలో ఖరీఫ్‌, రబీ సీజన్లలో ఉల్లి పంటను రైతులు సాగు చేస్తున్నారని, ఈ సంవత్సరం అధిక వర్షాలతో పాటు బంగ్లాదేశ, మలేషియా, దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలకు కర్నూలు నుంచి ఎగుమతి చేసే అవకాశాలు తప్పిపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందన్నారు. సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో రైతులు పెద్ద ఎత్తున ఉల్లిని కర్నూలు యార్డుకు విక్రయానికి తెచ్చారని, ప్రతి రోజూ 10వేల నుంచి 20వేల క్వింటాళ్ల దాకా కర్నూలు మార్కెట్‌ యార్డు కిటకిటలాడిందని వివరించారు. మార్క్‌ఫెడ్‌ ద్వారా క్వింటానికి రూ.1,200 రైతులకు చెల్లించేలా నిర్ణయం తీసుకోవడంతో పాటు ఒక హెక్టారుకు ఉల్లి పంటను సాగు చేసిన రైతులకు రూ.50వేల పరిహారాన్ని అందించేందుకు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఈ సందర్బంగా కేంద్రం ఉద్యాన శాఖ డిప్యూటీ కమిషనర్‌ బీజే బ్రహ్మ, వ్యాపారులు, ఉద్యాన శాఖ అధికారులు, మార్కెటింగ్‌ శాఖ ఉన్నతాధికారులతో చర్చించారు. అనంతరం జిల్లా ఉల్లి రైతులను ఆదుకునేందుకు కేంద్రం తీసుకోవాల్సిన చర్యలపై సెలక్షన గ్రేడ్‌ సెక్రటరీ జయలక్ష్మి కేంద్ర బృందం అధికారులకు నివేదికను అందజేశారు. కేంద్ర బృందంలో బీజే బ్రహ్మతో పాటు మనోజ్‌, రాజీవ్‌ కుహార్‌, హేమంగ భార్గవ్‌, శరవణన, రాష్ట్ర ఉన్నతాధికారి జమదగ్ని, జిల్లా ఉద్యాన శాఖ అధికారి రాజా కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2025 | 12:04 AM