తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌కు డీజిల్ కష్టాలు
ABN , Publish Date - May 18 , 2025 | 11:01 PM
గర్భిణులు, బాలింతలను ఇండ్లకు చేర్చే ‘తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలకు డీజిల్ కష్టాలు ఎదురయ్యాయి.
ఎక్కడికక్కడే నిలిచిన వాహనాలు
ఇబ్బందులు పడ్డ బాలింతలు
ఆదోని, మే18(ఆంధ్రజ్యోతి): గర్భిణులు, బాలింతలను ఇండ్లకు చేర్చే ‘తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలకు డీజిల్ కష్టాలు ఎదురయ్యాయి. డీజిల్ లేక వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. స్థానిక ప్రభుత్వ స్ర్తీల, చిన్నపిల్లల ఆస్పత్రిలో ఏడు‘తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ ’ వాహనాలు ఉన్నాయి. వాటికి ప్రతి రోజు 30 నుంచి 35 లీటర్ల వరకు డీజల్ సంబంధిత కాంట్రాక్టర్ వేయిస్తున్నారు. ఆదివారం డీజిల్‌కు సంబంధించి పెట్రోల్ బంక్ యజమానికి ఫోన రాకపోవడంతో డీజిల్ వేయలేదు. దీంతో ఆస్పత్రిలోనే వాహనాలు ఉండిపోయాయి.
హొళగుందకు చెందిన బేబీ అనే బాలింత ‘తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్’ డ్రైవర్ దగ్గరకు వెళ్లి వేడుకుంది. ఆయన మాత్రం స్పందించలేదు. బేబితో పాటు పలువురు బాలింతలది ఇదే పరిస్థితి. ఈవిషయంపై డాక్టర్ మమతను ఆంధ్రజ్యోతి వివరణ కోరగా, బాలింతలను సురక్షితంగా వారిని ఇళ్లకు వదిలేందుకు ఉన్న ‘తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహన డ్రైవరులు డీజిల్ లేదని బాలింతలతో అన్నట్లు సమాచారం ఇచ్చింది. అయితే డ్రైవర్లతో మాట్లాడదామని పిలిపించిన వారు వాహనాల దగ్గర లేకుండా వెళ్లిపోయినట్లు సిబ్బంది చెబుతున్నారు. ఈవిషయంపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేస్తానని ఆమె వివరించారు.